నాతో సినిమా చేస్తూ.. రాజశేఖర్ చేసిన పనికి షాకయ్యా: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 48)

ABN , First Publish Date - 2021-08-01T02:48:19+05:30 IST

‘అదేమిటి సార్‌.. మీరు మొదట ఆ రేటుకు కొనడానికి అంగీకరించారు కదా! ఇప్పుడు తగ్గిస్తానంటే ఎలా సార్‌?’ అని నిర్మాతలు అడగటంతో అసలు విషయం బయటపడింది. మరేమీ లేదు సార్‌.. మీ సినిమా కంటే ఆ సినిమా బాగా వచ్చిందని మీ హీరో గారే..

నాతో సినిమా చేస్తూ.. రాజశేఖర్ చేసిన పనికి షాకయ్యా: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 48)

‘అన్నయ్య’ తర్వాత అంబికా వారికి ఓ సినిమా చేశాను. ఉపేంద్ర హీరోగా నటించిన ఆ చిత్రం పేరు ‘ఒక మాట’. వెంకటేశ్‌తో ‘గణేశ్‌’ వంటి చిత్రాన్ని రూపొందించిన తిరుపతిస్వామి మా చిత్రానికి కథకుడు. మంచి కథ. అయితే రాజశేఖర్‌ చేయాల్సిన పాత్ర ఉపేంద్ర చేయడంతో సినిమా దెబ్బతింది. అంతకుముందు అంబికా సంస్థ నిర్మించిన ‘కన్యాదానం’ సినిమాలో ఉపేంద్ర నటించారు. ఆ పరిచయంతో ఈ సినిమాకూ ఆయన్నే ఎంపిక చేశారు. నిర్మాతలను విమర్శిస్తున్నానని అనుకోవద్దు కానీ ఒక నిర్ణయం తీసుకొనేముందు మంచి చెడు చర్చిస్తే రిజల్ట్‌ బాగుంటుంది. వన్‌సైడ్‌ నిర్ణయాలు ఒక్కోసారి ప్రాజెక్ట్‌ను దెబ్బతీస్తాయి. ఎందుకంటే ఇది కోట్లాది రూపాయలతో చేసే వ్యాపారం. ఒక నిర్ణయం తీసుకొనేముందు యూనిట్‌లో ముఖ్యుల్ని సంప్రదిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉపేంద్ర మంచి ఆర్టిస్టే. కానీ ఆ కథకు సూటబుల్‌ కాదు. అలాగే టైటిల్‌ కూడా సినిమాను దెబ్బతీసింది. ఎవరితో సంప్రదించకుండా ‘ఒకే మాట’ అనే టైటిల్‌ రిజిస్టర్‌ చేసేశారు. హిట్‌ అయితే అందరికీ పేరు వస్తుంది. ప్లాప్‌ అయితే దాన్ని డైరెక్టర్‌ అకౌంట్‌లో వేస్తారు. మంచి కథ, బాగా తీశాం కూడా. హీరో మైనస్‌ ఆ చిత్రానికి పెద్దగా ఆడలేదు. ర్యాంగ్‌ కాస్టింగ్‌ సినిమాను దెబ్బతీసిందని నిర్మాతలకు అర్థమైంది.


మనసున్న మారాజు

భగవాన్‌, దానయ్య ఇప్పుడు విడివిడిగా సినిమాలు తీస్తున్నారు కానీ ఒకప్పుడు కలసే చిత్రాలు తీసేవారు. వాళ్లతో నేను ఓ సినిమా చేశాను. మలయాళం రీమేక్‌. మలయాళ హీరో జయరామ్‌ నటించిన ఆ సినిమాలో పాయింట్‌ బాగుంది. రచయిత తోటపల్లి మధుతో కూర్చుని కథలో మార్పులు, చేర్పులు చేశాం. ‘మనసున్న మారాజు’ అని ఆ సినిమాకు పేరు పెట్టాం. రాజశేఖర్‌తో నాకు అది ఎనిమిదో సినిమా. లయ కథానాయిక. తూర్పు గోదావరి జిల్లా దోసకాలకాయల పల్లిలో షూటింగ్‌ చేశాం. ‘మనసున్న మారాజు’ చిత్రం చేస్తున్నప్పుడే రవిరాజా పినిశెట్టిగారి దర్శకత్వంలో ‘ఒక్కడు చాలు’ సినిమా చేస్తుండేవారు రాజశేఖర్‌. ‘మనసున్న మారాజు’ సినిమా దాదాపు అయిపోయింది. ఏదో సమస్య వచ్చి ఒక ఫైట్‌ మాత్రం తీయలేకపోయాం. దాన్ని హైదరాబాద్‌లో సెట్‌ వేసి తీద్దామంటే బడ్జెట్‌ పెరిగిపోతుందని భయపడి నిర్మాతలు మొదట ఒప్పుకోలేదు. ‘ఆ ఖర్చు నేను పెట్టుకుంటాను. షూటింగ్‌ ప్లాన్‌ చెయ్యండి’ అంటే అప్పుడు ఒప్పుకొన్నారు. వాళ్లను బ్లేమ్‌ చేయడం లేదు. అప్పటి పరిస్థితులు, మార్కెట్‌ అలా ఉండేది. ఇప్పుడు నిర్మాతలు కోట్లు ఖర్చు పెట్టడానికి వెనుకాడటం లేదు. మార్కెట్‌ బాగా పెరిగిందిప్పుడు. చివరకు హైదరాబాద్‌లోనే సెట్‌ వేసి ఆ ఫైట్‌ తీశాం. దాంతో ‘మనసున్న మారాజు’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు జరిగిన ఓ సంఘటన నన్ను మానసికంగా బాగా దెబ్బతీసింది. 


అదెలాగంటే.. తమిళంలో హిట్‌ అయిన ‘వానత్తై పోలా’ సినిమా రీమేక్‌ రైట్స్‌ కొన్నారు బెల్లంకొండ సురేశ్‌, శింగనమల రమేశ్‌. నా దర్శకత్వంలో రాజశేఖర్‌ హీరోగా ఆ సినిమాను తెలుగులో తీయాలని వారి ఆలోచన. రాజశేఖర్‌తో మాట్లాడుకొని తర్వాత నా దగ్గరకు వచ్చారు. సినిమా చూసి ఓకే అన్నాను. ‘మా అన్నయ్య’ అని ఆ సినిమాకు పేరు పెట్టాం. ఓ మంచి రోజు చూసుకొని ఓపెనింగ్‌ పెట్టారు. చిరంజీవిగారు ముఖ్య అతిధిగా వచ్చి క్లాప్‌ కొట్టారు. పేపర్లలో పబ్లిసిటీ కూడా బాగా వచ్చింది. ‘మనసున్న మారాజు’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఒక పక్క జరుగుతున్నాయి. మరో పక్క ‘మా అన్నయ్య’ స్ర్కిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఆ సినిమా తర్వాత రామోజీరావుగారి ‘దీవించండి’ చిత్రానికి వర్క్‌ చేయాలి. ఆ సినిమా స్ర్కిప్ట్‌ వర్క్‌ కూడా జరుగుతోంది. ‘మనసున్న మారాజు’ చిత్రానికి మొదటే బాగా బిజినెస్‌ జరిగింది.


మంచి రేట్లకు బయ్యర్లు కొనడానికి ముందుకు వచ్చారు. కొంత అడ్వాన్స్‌ ఇచ్చి ఏరియాలు ఖాయం చేసుకొన్నారు. తీరా విడుదల దగ్గర పడేసరికి మాట్లాడుకొన్న మొత్తం కాకుండా అందులో కొంత తగ్గిస్తామంటూ మొదలుపెట్టారు. ‘అదేమిటి సార్‌.. మీరు మొదట ఆ రేటుకు కొనడానికి అంగీకరించారు కదా! ఇప్పుడు తగ్గిస్తానంటే ఎలా సార్‌?’ అని నిర్మాతలు అడగటంతో అసలు విషయం బయటపడింది. ‘‘మరేమీ లేదు సార్‌.. మీ సినిమా కంటే ‘ఒక్కడు చాలు’ చాలా బాగుందని మీ హీరోగారే స్వయంగా చెప్పారు. అందుకే మీరు రేటు తగ్గించాల్సిందే’’ అని బయ్యర్లు మొదలుపెట్టారు. నిర్మాతలు షాక్‌. ఆ విషయం తెలిసి నేను షాక్‌. (అయితే ‘ఒక్కడు చాలు’ సినిమా కంటే మా సినిమా ‘మనసున్న మారాజు’ బాగా ఆడిందనుకోండి. అది వేరే విషయం)

(ఇంకా ఉంది)

-వినాయకరావు

Updated Date - 2021-08-01T02:48:19+05:30 IST