మెగాస్టార్ నటిస్తుంటే నవ్వాపుకోలేక పోయేవాళ్లం: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 47)

ABN , First Publish Date - 2021-07-31T03:30:51+05:30 IST

బాలయ్యబాబు సినిమా సరిగా ఆడలేదు. చాలా ఫీలయ్యాడు. కానీ ఎవరినీ ఏమీ అనలేదు. మనసులోనే బాధ పడ్డారు. బాలకృష్ణగారి ‘కృష్ణబాబు’ చిత్రం ఫినిషింగ్‌ స్టేజ్‌లో ఉండగానే చిరంజీవిగారితో మరో సినిమా చేసే ఛాన్స్‌ రావడంతో ఎగిరి గంతేశాను. ఆ చిత్రం పేరు

మెగాస్టార్ నటిస్తుంటే నవ్వాపుకోలేక పోయేవాళ్లం: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 47)

‘పవిత్ర ప్రేమ’ సినిమా బాగా ఆడటంతో నిర్మాతలు చంటి అడ్డాల, శ్రీనివాసరెడ్డిలకు మరోసారి డేట్స్‌ ఇచ్చారు బాలకృష్ణ. దర్శకుడిగా నన్ను ఎన్నుకొన్నారు. ఆ సినిమా పేరు ‘కృష్ణబాబు’. మంచి కథే. సినిమాలో హీరో హీరోయిన్‌ను ఇంటర్వెల్‌ బ్లాక్‌‌లో పొరపాటున చంపబోతాడు. కథ అక్కడ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. హీరో చిన్నతనం నుంచి మూడు సార్లు జైలుకు వెళతాడు. మంచి కథ. క్యారెక్టర్లు కూడా బాగుంటాయి. అబ్బాస్‌, మీనా, రాశి కీలక పాత్రలు పోషించారు. సినిమా బాగా వచ్చింది కూడా. బాలకృష్ణగారు ఇచ్చిన అవకాశాన్ని నిర్మాతలు సద్వినియోగం చేసుకోలేదు. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే మరో సినిమా మొదలుపెట్టేశారు. మిక్సింగ్‌ సమయంలో జరిగిన పొరపాటు కారణంగా సౌండ్‌లో తేడా వచ్చింది. ఫస్ట్‌ కాపీ చూసి అంతా బాగుందనుకున్నాం. అయితే డీటీఎస్‌లో విన్నప్పుడు సౌండ్‌ బాగానే ఉంది. ఆ సౌకర్యం లేని థియేటర్లతో సౌండ్‌ తేడా వచ్చి మాటలు వినపడలేదు. ఆ రోజుల్లో డీటీఎస్‌ సిస్టమ్‌ ఉన్న థియేటర్లు తక్కువ. అందుకే డైలాగులు వినబడక జనం గోలగోల చేశారు. నిర్మాతలు మిక్సింగ్‌ సమయంలో దగ్గరుండి చూసుకోకపోవడం వల్లే డామేజ్‌ జరిగింది. బాలయ్యబాబు చాలా ఫీలయ్యాడు. కానీ ఎవరినీ ఏమీ అనలేదు. మనసులోనే బాధ పడ్డారు.


బాలకృష్ణగారి ‘కృష్ణబాబు’ చిత్రం ఫినిషింగ్‌ స్టేజ్‌లో ఉండగానే చిరంజీవిగారితో మరో సినిమా చేసే ఛాన్స్‌ రావడంతో ఎగిరి గంతేశాను. ఆ చిత్రం పేరు ‘అన్నయ్య’. హీరో, అతని ఇద్దరు తమ్ముళ్లు, మరో పక్క హీరోయిన్‌, ఆమె ఇద్దరు చెల్లెళ్లు. వీరందరి మధ్య సాగే ఆసక్తికరమైన కథ ‘అన్నయ్య’. ఈ స్టోరీ లైన్‌ చిరంజీవిగారికి భూపతిరాజా చెప్పారు. పాయింట్‌ బాగుంది, వర్క్‌ చేయమని ఆయన అన్నారట. ఒకరోజు భూపతిరాజా నా దగ్గరకు వచ్చి ‘గురువా.. స్టోరీ లైన్‌ ఇదీ. ఈ సినిమా మీరు చేయాల్సివస్తుందేమో’ అని ముందే హింట్‌ ఇచ్చాడు.


‘నాకు సినిమా ఇవ్వండి’ అని ఏ నాడూ ఎవరినీ అడగలేదు. అది నా పాలసీకి విరుద్ధం కూడా. అయితే గతంలో కన్నడంలో ఒక సినిమా చేద్దామని అల్లు అరవింద్‌గారు అడిగినప్పుడు ‘తెలుగులో గీతా ఆర్ట్స్‌ బేనరుపై సినిమా చేసే అవకాశం ఇవ్వండి గురువుగారూ’ అని అడిగాను. అది జరిగి చాలా కాలం అయింది కూడా. అయినా సరే అరవింద్‌గారు గుర్తు పెట్టుకుని నాకు కబురు చేశారు. ‘అన్నయ్య’ చిత్రానికి నిర్మాత చిరంజీవి తోడల్లుడు డాక్టర్‌ వెంకటేశ్వరరావుగారు. అయినా నిర్మాణ సారథి అరవింద్‌గారే! కథా చర్చలు ప్రారంభించాం. గీతా ఆర్ట్స్‌ ఆస్థాన రచయిత సత్యానంద్‌గారు కూడా చర్చల్లో పాల్గొనేవారు. నూతన శతాబ్దం 2000 సంవత్సరంతో ప్రారంభమవుతుంది కనుక ఆ ఏడాదిలో విడుదలయ్యే తొలి సినిమా ‘అన్నయ్య’ కావాలని అరవింద్‌గారు పట్టుబట్టారు. నేను సరేనన్నాను.


‘స్ర్కిప్ట్‌’ సూపర్‌గా వచ్చింది. హిలేరియస్‌ కామెడీ. ‘హిట్లర్‌’లోని చిరంజీవిగారి పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుంది ఈ సినిమాలో పాత్ర. చిరంజీవిగారి కామెడీ టైమింగ్‌ అద్భుతం. స్ర్కిప్ట్‌లో ఇంతుంటే తన నటనతో అంత చేసి ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించారు. అంతెందుకు.. షూటింగ్‌ స్పాట్‌లో చిరంజీవిగారు నటిస్తుంటే నవ్వాపుకోలేక పోయేవాళ్లం. ఆయన తమ్ముళ్లుగా రవితేజ, వెంకట్‌ నటించారు. మంచి డ్రామా ఉన్న సినిమా. చిరంజీవి, సౌందర్య మధ్య సీన్లు బాగా పండాయి. సినిమా పెద్ద హిట్‌. స్ర్కిప్ట్‌ స్టేజ్‌లోనే ‘ కామెడీతో పాటు కొంచెం సెంటిమెంట్‌ పెడదాం గురువా’ అనేవాడిని. ‘వద్దు సార్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌ వేలోనే వెళతాం’ అనేవారంతా దాంతో కాదనలేకపోయా. నేను సెంటిమెంట్‌ సుబ్బయ్యను కనుక సెకాండాఫ్‌లో మరింత మెలో డ్రామా ఉంటే బాగుండేదనిపించినా ప్రేక్షకులు అదేం పట్టించుకోలేదు.


‘అన్నయ్య’ వంద రోజుల ఫంక్షన్‌కు చంద్రబాబు నాయుడుగారు ముఖ్య అతిధిగా వచ్చారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండటంతో ఆయన చేతుల మీదుగా షీల్డ్‌ తీసుకొంటుంటే అవార్డ్‌ తీసుకొన్న ఫీలింగ్‌ కలిగింది. చిరంజీవిగారితో రెండు సినిమాలు చేస్తే రెండూ హిట్‌ కావడం ఆనందాన్ని కలిగించింది. రెండూ డిఫరెంట్‌ ఫిల్మ్స్‌. అలా చిరంజీవిగారితో రెండు, బాలకృష్ణగారితో మూడు, వెంకటేశ్‌బాబుతో రెండు, పవన్‌కల్యాణ్‌గారితో ఒకటి సినిమాలు చేశాను. నాగార్జునగారితో కనీసం ఒక్క సినిమా కూడా చేయలేకపోయానే అనే అసంతృప్తి మాత్రం నాకు ఉంది.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

Updated Date - 2021-07-31T03:30:51+05:30 IST