నా ఫొటో పెద్దది వేసి, హీరో ఫొటో చిన్నది వేశారు: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 46)

నేను దర్శకత్వం వహించిన మరో రీమేక్‌ సినిమా ‘మాణిక్యం’. తమిళంలో విజయం సాధించిన ‘పోర్కాలమ్‌’ సినిమాకు రీమేక్‌ ఇది. కార్తీక్‌, మీనా, సంఘవి నటించారు. ఆ సినిమా రీమేక్‌ రైట్స్‌ ఎప్పుడో కొన్నారు నిర్మాత సి.ఎం.కృష్ణ. ఆయన దగ్గర నుంచి శానం నాగఅశోక్‌కుమార్‌, ఎన్వీ ప్రసాద్‌ కొన్నారు. రీమేక్‌ సినిమా అయినా మన నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేసిన సందర్భాలు ఎన్నో!. సాధారణంగా మోహన్‌బాబుగారు ఓ రీమేక్‌ సినిమా చేస్తున్నప్పుడు మూల కథలో మార్పులు చేయడానికి ఒప్పుకొనేవారు కాదు. అటువంటి వ్యక్తిని కూడా ఒప్పించి ‘సోగ్గాడి పెళ్లాం’ సినిమాలో మార్పులు చేశాం. నా పాలసీ ఒక్కటే.. రీమేక్‌ చేస్తున్నప్పుడు ఒరిజనల్‌లో ఉన్న మంచి సీన్లు వదిలిపెట్టకూడదు. బాగా లేని సీన్లు తప్పకుండా మార్చాలి. అదే పద్ధతిని ఫాలో అయ్యాను.


అయితే ‘పోర్కాలమ్‌’ కథలో మార్పులు చేయడానికి నిర్మాత నాగఅశోక్‌కుమార్‌ ఒప్పుకునేవారు కాదు. సినిమాలో శ్రీకాంత్‌ హీరో. దేవయాని హీరోయిన్‌. తమిళ వెర్షన్‌లో నటించిన సంఘవినే తెలుగులోనూ తీసుకున్నాం. కథలో శ్రీకాంత్‌ దేవయానిని ప్రేమిస్తాడు. సంఘవి శ్రీకాంత్‌ను ప్రేమిస్తుంది. హీరో చెల్లెలు మూగది. సినిమాలో కీలకమైన పాత్ర ఆమెదే. ఆమెకు పెళ్లి చేసిన తర్వాతే తను పెళ్లి చేసుకుంటానంటాడు శ్రీకాంత్‌. అతని తండ్రి కోట శ్రీనివాసరావు తాగుబోతు. ఏమీ పట్టించుకోడు. చివరకు ఓ దివ్యాంగురాలిని పెళ్లి చేసుకుంటాడు హీరో. అది ప్రేక్షకులకు నచ్చలేదు. అంటే త్యాగం ఓవర్ అయిందన్నమాట. నేను, పోసాని కృష్ణమురళి డిస్కషన్స్‌ సమయంలో మూల కథలో ఉన్న ఆ సీన్‌ను మారుద్దామన్నాం. కానీ నిర్మాతలు ఒప్పుకోలేదు. ఉన్నది ఉన్నట్లుగా తీయాల్సిందే అని పట్టుబట్టారు. కాదనలేకపోయా. సినిమాలో మెలో డ్రామా ఉండాలి కానీ అతిగా ఫీలయ్యారు ప్రేక్షకులు. తమిళనాడులో హిట్‌ అయినా తెలుగులో మాత్రం ఆడలేదు.

‘మాణిక్యం’ విడుదలైన తర్వాత పాలకొల్లు ప్రాంతానికి ఓ షూటింగ్‌ నిమిత్తం వెళ్లాను. అక్కడ పబ్లిసిటీ పోస్టర్లు చూసి ఆశ్యర్యపోయాను. 24 షీట్‌ పోస్టర్‌లో నా ఫొటో పెద్దది వేశారు. శ్రీకాంత్‌, హీరోయిన్ల ఫొటోలు చిన్నవి వేశారు. అది చూసి ఆశ్చర్యపోయా.. సిగ్గు పడ్డా. దడ పుట్టింది కూడా. నాకు వరుసగా హిట్స్‌ రావడంతో పోస్టర్‌లో నన్ను అలా హైలైట్‌ చేశారు. పోస్టర్లలో నా ఫొటో అంత పెద్దది వేస్తారని అనుకోలేదు. నాకు ముందు చెప్పలేదు కూడా. చెబితే ఒప్పుకొనేవాడిని కాదు. పబ్లిసిటీకి దూరంగా ఉండటం నాకు మొదటి నుంచీ అలవాటు.


నా సినిమా గురించి నేనెప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. సినిమా బాగా ఆడిందంటే అది నా ఒక్కడి ప్రతిభే కాదు. యూనిట్‌ సభ్యుల సమిష్టికృషి. సినిమా అనేది సింగిల్‌మ్యాన్‌ షో కాదు. సినిమా చివరిలో ‘ఇటీజ్‌ ముత్యాల సుబ్బయ్యాస్‌ ఫిల్మ్‌’ అని ఎప్పుడూ వేసుకోలేదు. అలాంటి ఎక్స్‌ట్రాలు నాకు వద్దు. నాకు మంచి రచయిత, సంగీత దర్శకుడు, హీరోహీరోయిన్లు, అన్నింటికంటే ముందు అభిరుచి కలిగిన నిర్మాత దొరకాలి. ఇంతమంది కలిసి తీసే సినిమాను వన్‌సైడెడ్‌గా ‘నా ప్రతిభే’ అని చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. అలా చేస్తున్న వాళ్లని నేను తప్పు పట్టను. ఎవరి ఇష్టం వారిది.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.