‘రాజా’ అలా మిస్సయ్యా!: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 45)

ABN , First Publish Date - 2021-07-29T03:22:12+05:30 IST

నేను అప్పటికి హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అవలేదు. ఫ్యామిలీ మద్రాసులోనే ఉండేది. హైదరాబాద్‌లో షెడ్యూల్‌ ఉంటే షూటింగ్‌ జరిగినంతకాలం ఉండి, తర్వాత మద్రాసు వెళ్లేవాడిని. ఒకరోజు అలాగే మద్రాసు వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నా..

‘రాజా’ అలా మిస్సయ్యా!: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 45)

నేను అప్పటికి హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అవలేదు. ఫ్యామిలీ మద్రాసులోనే ఉండేది. హైదరాబాద్‌లో షెడ్యూల్‌ ఉంటే షూటింగ్‌ జరిగినంతకాలం ఉండి, తర్వాత మద్రాసు వెళ్లేవాడిని. ఒకరోజు అలాగే మద్రాసు వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాను. సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ అధినేత ఆర్‌.బి. చౌదరిగారు, పారాస్‌ జైన్‌ నన్ను వెదుక్కుంటూ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. బాగా తెలిసిన వాళ్లు కావడంతో దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి ‘ఏమిటి సార్‌.. విశేషాలు?’ అనడిగాను. ‘‘సుబ్బయ్యా.. వెంకటేశ్‌తో ‘రాజా’ సినిమా ప్లాన్‌ చేస్తున్నాం. కథ రెడీగా ఉంది. నువ్వు డైరెక్ట్‌ చెయ్యాలి’’ అని సూటిగా అసలు విషయం చెప్పేశారు చౌదరిగారు. ఏమనాలో తోచక ఆయన వంక అయోమయంగా చూశాను. నిజానికి అది చాలా మంచి ఆఫర్‌. వెంకటేశ్‌గారితో రెండు సినిమాలు చేశాను. రెండూ హిట్లే.


‘రాజా’ మూడో సినిమా అవుతుంది. హిట్‌ అయితే హ్యాట్రిక్‌ సాధించినట్లే. కానీ నా డేట్స్‌ ఖాళీగా లేవు. అప్పటికే ‘మాణిక్యం’ సినిమా కమిట్‌ అయి ఉన్నా. ఆ తర్వాత వరుసగా మరో మూడు సినిమాలు ఒప్పుకొన్నా. అవి చిన్న సినిమాలే కావచ్చు. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం నాకు మొదటినుంచీ అలవాటు. మరో దర్శకుడెవరైనా ఆ కమిట్‌మెంట్స్‌ రద్దు చేసుకొని ఆర్‌.బి, చౌదరిగారి ఆఫర్‌ను అంగీకరించేవారేమో! కానీ నేనలా చేయలేకపోయాను. ఆ సినిమా ఒప్పుకోకపోవడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. ‘పవిత్రబంధం’, ‘పెళ్లి చేసుకుందాం’ చిత్రాల విజయం తర్వాత వెంకటేశ్‌, నా కాంబినేషన్‌లో మూడో సినిమా తీసి హ్యాట్రిక్‌ సాధించాలనే కోరిక నిర్మాతలు శివరాజు, వెంకట్రాజులకు ఉంది.


ఓ సారి మాటల సందర్భంలో ‘ఒకే హీరో, ఒకే దర్శకుడితో వరుసగా మూడు హిట్‌ చిత్రాలు తీస్తే అదో రికార్డ్‌ అవుతుంది’ అని నాతో చెప్పారు కూడా. అప్పుడు నేను నవ్వి ఊరుకున్నా ఆ మాట మదిలో అలా ఉండిపోయింది. అందుకే ‘గురువుగారూ.. మీవంటి పెద్ద నిర్మాత వచ్చి అడిగినా కాదంటున్నందుకు నన్ను క్షమించండి. వెంకటేశ్‌తో మూడో సినిమా చేయాలని శివరాజు, వెంకట్రాజు అడిగారు. ఏమీ అనుకోవద్దు సార్‌’ అన్నాను. ఆర్‌.బి. చౌదరిగారు నన్ను అర్థం చేసుకున్నారు. ‘ఓకే సుబ్బయ్యా.. ఫరవాలేదు’ అని వెళ్లిపోయారు. ఆ తర్వాత ముప్పలనేని శివ దర్శకత్వంలో ‘రాజా’ సినిమా తీశారు. ఒక మంచి సంస్థలో అవకాశం మిస్‌ అయినందుకు నేను చాలా బాధ పడ్డాను. అయినప్పటికినీ మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిని కనుక తప్పలేదు. చిన్నదో, పెద్దదో ... ఒక సినిమా ఒప్పుకొన్న తర్వాత దానికి కట్టుబడి ఉండేవాడిని. పెద్ద మొత్తంలో అడ్వాన్సులు తీసుకున్న సందర్భాలు కూడా తక్కువ.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

Updated Date - 2021-07-29T03:22:12+05:30 IST