చిరు, బాలయ్య నో చెప్పిన కథతో రాజశేఖర్‌కి పెద్ద హిట్టు: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 44)

ABN , First Publish Date - 2021-07-28T03:36:24+05:30 IST

చిరంజీవిగారు డిఫరెంట్‌ సబ్జెక్ట్స్‌ చేస్తున్నారు కనుక ఆయనకు ఈ కథ బాగా నచ్చుతుందని సినిమా సీడీని ఆయనకు పంపించాను. ఆ సీడీ నెల రోజుల పాటు ఆయన దగ్గరే ఉంది. ఆ తర్వాత బాలకృష్ణగారిని కలిసి ఆ సీడీ ఆయనకు ఇచ్చాను.. అక్కడ కూడా కొన్ని రోజులు ఆగింది. మళ్లీ..

చిరు, బాలయ్య నో చెప్పిన కథతో రాజశేఖర్‌కి పెద్ద హిట్టు: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 44)

కాస్త ఖాళీ దొరికితే చాలు ఇతర భాషల చిత్రాలు చూస్తుండేవాడిని. అలాగే ఒకరోజు మమ్ముట్టి నటించిన తమిళ చిత్రం ‘మరుమలర్చి’ చూశాను. అదీగాక ఆ రోజుల్లో ఏదన్నా సినిమా రీమేక్‌ చేయాలనుకుంటే మొదట నాకే చూపించేవారు. ఆ చిత్రం బాగుందని చెప్పడంతో నా అంతట నేనే వెళ్లి చూశాను. తెలుగులో తీస్తే బాగా పోతుందనిపించింది. ఆ సమయంలోనే నిర్మాత మేడికొండ మురళీకృష్ణగారు రీమేక్‌ రైట్స్‌ కొని నా దగ్గరకు వచ్చారు. చిరంజీవిగారు డిఫరెంట్‌ సబ్జెక్ట్స్‌ చేస్తున్నారు కనుక ఆయనకు ఈ కథ బాగా నచ్చుతుందని సినిమా సీడీని ఆయనకు పంపించాను. ఆ సీడీ నెల రోజుల పాటు ఆయన దగ్గరే ఉంది. ఆయనకు నచ్చలేదేమో అక్కడి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదు. సీడీ మాత్రం వెనక్కి తిరిగి వచ్చేసింది.


ఆ తర్వాత బాలకృష్ణగారిని కలిసి ఆ సీడీ ఆయనకు ఇచ్చాను.. అక్కడ కూడా కొన్ని రోజులు ఆగింది. మళ్లీ వెనక్కి వచ్చేసింది. ఇద్దరు అగ్రహీరోలు ఆ కథను కాదనడంతో నేను ఆలోచనలో పడ్డాను. ఆ కథలో పేరు ప్రతిష్టలున్న ఊరి పెద్దని అతనెవరో తెలియక మరో గ్రామానికి చెందిన వ్యక్తి కొడతాడు. బహుశా ఆ పాయింట్‌ చిరంజీవిగారికీ, బాలకృష్ణగారికీ నచ్చలేదేమో! అందుకే ఆ సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదు. తర్వాత రాజశేఖర్‌ హీరోగా ఆ సినిమా ‘సూర్యుడు’ తీశాం. నిజానికి చిరంజీవి, బాలకృష్ణగార్లలో ఎవరో ఒకరు ఆ సినిమా చేసినా పెద్ద హిట్‌ అయి ఉండేది.


రాజశేఖర్‌కు ఆ సినిమా గురించి తెలుసు కనుక మేం అడగగానే అంగీకరించారు. మంచి సబ్జెక్ట్‌. బ్యూటిఫుల్‌ మెలో డ్రామా ఉంది. మరి కొన్ని రోజులు వెయిట్‌ చేసి కన్విన్స్‌ చేస్తే వారిద్దరిలో ఎవరో ఒకరు చేసి ఉండేవారేమో! కానీ ఒక సినిమా రైట్స్‌ కొన్న తర్వాత దాన్ని ఎంత త్వరగా తీస్తే అంత మంచిది. ఎక్కువ రోజులు నానపెడితే సీన్లు కొట్టేస్తారు. అందుకే ఇక పెద్ద హీరోల గురించి ఆలోచించకుండా రాజశేఖర్‌తో ఫిక్స్‌ అయ్యాం. రామానాయుడుగారి స్టూడియోలో వేసిన సెట్‌ మినహా మిగిలిన షూటింగ్‌ అంతా రాజమండ్రిలోనే చేశాం. సౌందర్య అద్భుతంగా నటించింది. ‘సూర్యుడు’ సినిమా బాగా ఆడింది.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

Updated Date - 2021-07-28T03:36:24+05:30 IST