టీవీ సీరియల్‌ డైరెక్ట్ చేద్దామనుకుంటే.. ఆ హీరోయిన్ కావాలన్నారు: ముత్యాల సుబ్బయ్య (లాస్ట్ పార్ట్)

మా అబ్బాయిలు ఓ సారి ‘‘నాన్నా, ఈ ఫీల్డ్‌లో ఉన్నావు. ఖాళీగా ఉండటం ఎందుకు, మనమే ఏదన్నా సినిమా చేద్దామా’’ అని అడిగారు. ‘‘వద్దురా, వ్యాపారం మనకు తెలియదు, లెక్కలు అసలే రావు. మనకు రావాల్సిన డబ్బులే చాలామంది నిర్మాతల నుంచి వసూలు చేసుకోలేకపోయాం. కొంతలో కొంత బెటర్‌ ఐనాగానీ, పెద్దగా మనం సంపాదించింది లేదు. దాచుకున్న డబ్బుతో సినిమాతీసి, తీరా దెబ్బతింటే, మీరందరూ రోడ్డున పడాల్సిందే. మీరు బాగా చదువుకున్నారు. ఏదో ఉద్యోగం చేసుకుని సంపాదించుకోండి. ఆర్ఠికంగా మీరు ఇబ్బంది పడకుండా అన్నీ ఏర్పాటు చేశాను. అది చాలు. నిర్మాతగా మారి డబ్బు సంపాదించాలనే ఆశ నాకు లేదురా’’ అని వాళ్లకు నచ్చజెప్పాను. వాళ్లు సరేనన్నారు. కొన్నిరోజులకు నాకు తెలిసిన కొంతమంది వచ్చి ‘‘ఊరికే కూర్చోవడం ఎందుకు, ఏదైనా మంచి సీరియల్‌ చేద్దాం’’ అని ప్రపోజల్‌ పెట్టారు.


వాళ్లలో ఒకాయన అడ్వాన్స్‌ కూడా ఇచ్చాడు. అయితే తర్వాత డిస్కషన్స్‌లో కూర్చున్నప్పుడు ‘‘అలా ఎందుకండీ...ఇలా తీద్దాం’’ అని వేలుపెట్టడం ప్రారంభించేసరికి, ‘‘మీ అడ్వాన్స్‌ వద్దు గురువుగారు’’ అని చెప్పి ఆ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకున్నాను. ఆ తర్వాత కొంతకాలానికి ఎవరికో ఎందుకు.. మనమే సీరియల్‌ సొంతంగా తీద్దాం అనిపించింది. పెట్టుబడి పెట్టడానికి స్నేహితులు ఉన్నారు ఇబ్బంది లేదు అనుకుని ఈటీవీ బాపినీడుగారిని కలిశాను. ‘‘ఓ మెగా సీరియల్‌ చేద్దామనుకుంటున్నా’’ అని ఆయనకు చెప్పగానే, ‘‘తప్పకుండా చేయండి సార్‌’’ అన్నారాయన. ‘మధ్యతరగతి మహాభారతం’ అని టైటిల్‌ కూడా అనుకున్నాను. ‘ముత్యాల మల్టీ మీడియా’ పేరిట బ్యానర్‌ ఏర్పాటు చేశాను. సీరియల్‌కు మా అబ్బాయిలే నిర్మాతలు. ఆ తర్వాత స్టోరీ డిస్కషన్స్‌ కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టాను. స్ర్కిప్ట్‌ రెడీ చేసిన తర్వాత మళ్లీ బాపినీడుగారిని కలిశాను.

అజయ్‌శాంతిగారిని కలవమని ఆయన చెప్పారు. అజయ్‌శాంతిగారిని కలిసి, బౌండ్‌ స్ర్కిప్ట్‌ ఇచ్చాను. కథగురించి క్లుప్తంగా చెప్పాను.. ‘‘మధ్యతరగతి మహాభారతం టైటిల్‌ చాలా పెద్దగా ఉంది కదూ’’ అన్నాడాయన. అది నాకు ఫస్ట్‌ స్ట్రోక్‌. కొన్ని రోజుల తర్వాత ‘‘మీరు ఆ హీరోయిన్‌ను ట్రై చేయకూడదూ’’ అన్నారు. ఆమె పేరు చెప్పనుగానీ నా దర్శకత్వంలో రెండు సినిమాల్లో ఆమె నటించింది. టైటిల్‌ దగ్గరనుంచి ఇలా ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటుంటే పనిచేయడం కష్టమనిపించింది. అప్పటికి రెండుమూడు లక్షలు ఖర్చుపెట్టాను. పోతే పోయిందనుకుని ఆ సీరియల్‌ పక్కకు పెట్టేశాను. 


ఈ సంఘటన తర్వాత నాకు పూర్తిగా ఆసక్తి సన్నగిల్లింది. 51 సినిమాలకు దర్శకత్వం వహించాను. వాటిల్లో అధిక శాతం విజయవంతమయ్యాయి. నేను కేబీఆర్‌ పార్క్‌కు రెగ్యులర్‌గా వాకింగ్‌కు వెళతాను. తెలిసినవాళ్లు, తెలియనివాళ్లు అక్కడ ఎదురుపడి ‘‘ఏమండీ.. ముత్యం మళ్లీ రావడం లేదు’’ అంటుంటారు. మంచి సినిమాలు చేశాను కాబట్టే వాళ్లు అలా అడుగుతున్నారు కదా. అది చాలు. మళ్లీ ఇప్పుడు ఏదో ఒకటి చేసి చెడ్డపేరు ఎందుకు తెచ్చుకోవాలి. హ్యాపీగా ఉన్నాను. పిల్లలు సెటిలయ్యారు. నేను పెద్దగా ఆస్తులు సంపాదించుకోలేదు. కానీ తినడానికి, ఉండటానికి ఉంది. చాలు. తృప్తిని మించింది మరేదీ లేదు కదా! 

(సమాప్తం)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.