బాలీవుడ్ దిగ్గజం దిలీప్‌కుమార్ బుధవారం ఉదయం మళ్లీ హిందూజా ఆస్పత్రిలో చేరారు. శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తడంతో ఆయన్ని ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స చేస్తున్నారు. గత నెల ఆరో తేదిన ఇలాంటి సమస్య తలెత్తడంతో దిలీప్‌కుమార్‌ను ఆస్పత్రికి తీసుకువచ్చారు. కొన్ని రోజులు చికిత్స చేసి ఇంటికి పంపించారు. మళ్లీ పదిహేను రోజులు అయ్యాయో లేదో మళ్లీ అదే సమస్యతో 98 ఏళ్ల దిలీప్‌కుమార్ ఆస్పత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యుమోనియాతో బాధపడుతున్న నసీరుద్దీన్ షా
విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న విలక్షణ నటుడు నసీరుద్దీన్ షా (70) కూడా ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన న్యుమోనియాతో బాధపడుతుండడంతో రెండు రోజుల క్రితం ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఇంతకుముందు ఇలాంటి సమస్య వచ్చినా ఆరోగ్యపరంగా ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అయితే ఈసారి ఊపిరితిత్తుల్లో చిన్న మచ్చ కనిపించడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు షా ను ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, చికిత్సకు స్పందిస్తున్నారనీ షా మేనేజర్ వెల్లడించారు.
నటి మందిరా బేడి భర్త ఆకస్మికంగా గుండె పోటుతో మరణించడం, ఇలా దిలీప్‌కుమార్, నసీరుద్దీన్ షా ఆస్పత్రిలో చేరడంతో హిందీ చిత్ర పరిశ్రమ ఆందోళన చెందుతోంది.