హైదరాబాద్‌ మహిళతో దిలీప్ కుమార్‌కు వివాదాస్పద వైవాహిక బంధం

అస్మా బేగంతో 1980లో పెళ్లి.. సైరాబాను గొడవ

శరద్‌ పవార్‌ మధ్యవర్తిత్వంతో 1983లో విడాకులు

2013లో చివరిసారి మక్కాకు వచ్చిన దిలీప్ కుమార్‌


బాలీవుడ్‌ దిగ్గజం, బుధవారం కన్నుమూసిన దిలీప్ కుమార్‌కు హైదరాబాద్‌తో వివాదాస్పద అనుబంధం ఉంది. ప్రస్తుతం కెనడాలో స్థిరపడ్డ, హైదరాబాద్‌కు చెందిన అస్మా బేగం అనే మహిళను ఆయన రహస్యంగా రెండో వివాహం చేసుకోవడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. 


హైదరాబాద్‌కు వెళ్లినప్పుడల్లా ఓ మిత్రుడి వద్ద బస చేసే దిలీప్ కుమార్‌కు.. తన చెల్లెలి ద్వారా అస్మా బేగం పరిచయమైంది. కొన్నాళ్ల తరువాత 1980లో వారిద్దరు నిఖా చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి విషయం తన మొదటి భార్య సైరాబానుకు తెలియకూడదని దిలీప్ కుమార్‌ షరతు విధించినా.. అస్మా మాత్రం తన మకాంను ముంబయికి మార్చింది. బాంద్రాలో దిలీప్ కుమార్‌ ఇంటికి సమీపంలోనే బస చేసింది. వీరి మధ్య ఉన్న బంధాన్ని బయటపెడుతూ అప్పటి సంచలన వారపత్రిక ‘బ్లిట్జ్‌’ కథనాన్ని ప్రచురించింది. దీంతో ముంబయితోపాటు హైదరాబాద్‌లో దుమారం రేగింది. దిలీప్ కుమార్‌ మొదటి భార్య సైరాబాను.. ముంబయిలోని బాలీవుడ్‌ పెద్దలను కలిసి, తనకు అన్యాయం జరిగిందని చెప్పుకొన్నారు. వారి ద్వారా చేసిన ఒత్తిడితో దిలీప్ కుమార్‌ 1983 జనవరి 22న అస్మా బేగంకు విడాకులిచ్చారు. హైదరాబాద్‌లో జంట సినిమా థియేటర్ల యాజమాని, నాటి మహారాష్ట్ర కాంగ్రెస్‌ నేత శరద్‌పవార్‌ ఇద్దరు ఈ వివాదాన్ని పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించారు. ఇదిలా ఉండగా.. విజయవాడలో పుట్టి పెరిగి, ‘రోజులు మారాయి’ చిత్రం ద్వారా తెలుగు నటిగా జీవితాన్ని ఆరంభించి ప్రముఖ హిందీ నటిగా మూడు దశాబ్దాలకు పైగా ఉన్న వహీదా రెహమాన్‌పై కూడా దిలీప్ కుమార్‌ మనసు పారేసుకున్నట్లుగా చెబుతారు. ఒకప్పుడు దుబాయికి తరచుగా వచ్చిన దిలీప్ కుమార్‌ చివరిసారిగా 2013లో సౌదీ అరేబియాలో మక్కా దర్శనం కోసం వచ్చారు. అయితే అప్పటికే జ్ఞాపకశక్తిని దాదాపు కోల్పోయిన ఆయనతో సమావేశం కావడానికి భార్య సైరాబాను ఎవరినీ అనుమతించలేదు. కానీ, ఈ ప్రతినిధిని అనమతించడంతో కొంతసేపు దిలీప్ కుమార్‌ పిచ్చాపాటిగా మాట్లాడారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.