పండ్ల వ్యాపారం నుంచి పద్మవిభూషణ్‌ వరకూ!

ABN , First Publish Date - 2021-07-07T21:43:29+05:30 IST

బాలీవుడ్‌లో మెథడ్‌ ఆర్టిస్ట్‌గా, సహజ నటనకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు దిలీప్‌కుమార్‌. తనదైన శైలి నటన, డైలాగ్‌ డిక్షన్‌తో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్నిని సంపాదించుకున్నారాయన.

పండ్ల వ్యాపారం నుంచి పద్మవిభూషణ్‌ వరకూ!

నటనకు నిర్వచనం ... దిలీప్‌..

బాలీవుడ్‌ మెథడ్‌ ఆర్టిస్ట్‌గా గుర్తింపు..

నిజజీవితంలోనూ భగ్న ప్రేమికుడు..

నాలుగున్నర దశాబ్ధాల దిలీప్‌కుమార్‌ జర్నీ..

బాలీవుడ్‌లో మెథడ్‌ ఆర్టిస్ట్‌గా, సహజ నటనకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు దిలీప్‌కుమార్‌. తనదైన శైలి నటన, డైలాగ్‌ డిక్షన్‌తో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారాయన. నాలుగున్నర దశాబ్ధాలుగా 70 చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో తిరుగులేని నటుడిగా గుర్తింపు పొందిన దిలీప్‌కుమార్‌ గత నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కరోనా సోకిన ఆయన రెండు వారాల చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి చేరారు. ఇటీవల అస్వస్థతకు గురి కావడంతో మరోసారి ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ నటనా దిగ్గజం సినీ ప్రస్థానం గురించి... 

జేమ్స్‌ స్టువర్ట్‌ స్ఫూర్తితో...

మహ్మద్‌ యూసఫ్‌ఖాన్‌ 1922,  డిసెంబర్‌ 11న ప్రస్తుత పాకిస్టాన్‌లోని పెషావర్‌లో జన్మించారు. ఆయన తండ్రి  లాలా గులామ్‌ సర్వర్‌ పండ్ల వ్యాపారి. మహారాష్ట్రలో వారికి భూములు ఉండడంతో ముంబైకి మకాం మార్చారు. పుణెలో పండ్ల దుకాణం నిర్వహిస్తున్న యూసఫ్‌ఖాన్‌ను చూసి బాంబే టాకీస్‌ యజమాని దేవికా రాణి ఇతనిలో హీరో లక్షణాలు ఉన్నాయని గ్రహించి తను తీయబోయే చిత్రంగా హీరోగా ఎంపిక చేశారు. అక్కడే ఆయన పేరు దిలీప్‌ కుమార్‌గా మార్చారు. సినిమా పట్ల ఆసక్తి ఉన్నా నటుడు అవుతానని ఆయన ఏ రోజూ అనుకోలేదట. దేవికా రాణి ఇచ్చిన అవకాశాన్ని ఆయన వినియోగించుకున్నారు. కరెక్ట్‌గా 20 ఏళ్ల వయసులో అంటే 1944లో ‘జ్వార్‌ భాటా’ సినిమాలో దిలీప్‌కుమార్‌ నట జీవితం మొదలైంది. అయితే ఆ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు. విమర్శించిన చోటే పేరు తెచ్చుకోవాలని దిలీప్‌కుమార్‌లో పట్టుదల పెరిగింది. నటనపై కసి పెంచుకున్నారు. క్రమం తప్పకుండా సినిమాలు చూసేవారు. హాలీవుడ్‌ నటుడు జేమ్స్‌ స్టువర్ట్‌ సహజ నటన అతనికి నచ్చింది. ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లారు. తర్వాతి సినిమా ‘జుగ్ను’, ‘మిలన్‌’ తదితర చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అప్పటి నుంచి దిలీప్‌ వెనక్కి తిరిగి చూసింది లేదు. నటుడిగా భారతదేశంలో తనదైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నటనకు నూతన నిర్వచనం ఇచ్చారు. 



ముందు జాగ్రత్త ఎక్కువ... 

దిలీప్‌కుమార్‌ కథల విషయంలో చాలా కచ్చితంగా ఉండేవారు. అతి జాగ్రత్తగా తాను చేసే సినిమాలను ఎంచుకునేవారు. కథ నచ్చకపోతే సినిమాను వదులుకోవడానికి వెనుకాడేవారు కాదు. సంగీత ప్రియుడైన ఆయన సాహిత్యం, సంగీతం విషయంలో రాజీ పడేవారు కాదు. ‘కోహినూర్‌’ సినిమాలో ‘మధువన్ మే రాధికా’ పాట కోసం సితార నేర్చుకున్నారు. ‘మొఘల్‌ ఏ ఆజం’ తర్వాత దిలీప్‌కుమార్‌కు చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. షమ్మీకపూర్‌, రాజేంద్రకపూర్‌ వంటి నటుల పోటీ పెరగడంతో సినిమా రూపురేఖలు మారాయి. దీంతో దిలీప్‌కుమార్‌ నటనను నిరూపించుకునేందుకు నిర్మాణంలోకి దిగారు. ఫలితంగా ‘గంగా జమున’ రూపొందింది. ఈ సినిమాలో దిలీప్‌కుమార్‌ నటనకు ఫిలింఫేర్‌ నామినేషన్‌ పంపించింది. నటుడిగా దిలీప్‌కుమార్‌ హిందీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సినీ నిర్మాణ విషయంలో రాజీపడేవారు కాదు. దిలీప్‌కుమార్‌ దర్శకత్వం చేయాల్సిన ‘కళింగ’ సినిమా అలాగే ఉండిపోయింది.

అమితాబ్‌కు దీటుగా...

1970 సమయంలో తన తోటి నటుల మాదిరిగానే అస్తిత్వ సమస్యను ఎదుర్కొనక తప్పలేదు. ఫలితంగా ఐదేళ్లు సినిమాల్లో నటించలేదు. 1981లో ‘క్రాంతి’ సినిమాతో తెరపైకి వచ్చారు దిలీప్‌కుమార్‌. అమితాబ్‌ ఉచ్చస్థితిలో ఉండగా, ఆయనకు దీటుగా నిలబడిన నటుడు దిలీప్‌కుమార్‌ ఒక్కడే. దిలీప్‌కుమార్‌, అమితాబ్‌తో రమేశ్‌సిప్పీ తెరకెక్కించిన ‘శక్తి’ అంచనాలను పెంచింది. అయితే, బాక్సాఫీస్‌ వద్ద అనుకున్న విజయం సాధించలేకపోయింది. అయితే ఈ చిత్రంలో నటనకు గానూ దిలీప్‌కుమార్‌ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అందుకున్నారు. ‘కర్మ’ సినిమాలో దేశం కోసం సర్వం త్యాగం చేేస పోలీస్‌ అధికారిగా ఆయన నటన ఎంత గొప్పగా ఉందంటే.. నసీరుద్దీన్‌ షా వంటి నటుడు దిలీప్‌కుమార్‌ నుంచి పాఠాలు నేర్చుకున్నానని చాలా సందర్భాల్లో చెప్పారు. 



శాస్ట్రీయ సంగీత ప్రియుడు...

దిలీప్‌ కుమార్‌ శాస్త్రీయ సంగీత ప్రియుడు. ముఖ్యంగా వాద్య సంగీతం అంటే చెవి కోసుకునేవారు. హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం విద్వాంసులను, వాద్య సంగీత ప్రముఖులను ఆయన తన నివాసానికి తరచూ ఆహ్వానించి మినీ కచేరిలు జరిపించేవారు. సితార, తబల, సారంగి వాద్యాలు అంటే దిలీప్‌కు మరీ ఇష్టం. తాను నటించే సినిమాల్లో మధురమైన పాటలుంటాయని ఆడియన్స్‌ నమ్మకం. ఆయన చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాటలున్నాయి. 1949లో వచ్చిన ‘అందాజ్‌’ దిలీప్‌కుమార్‌, రాజ్‌కపూర్‌ల జీవితాలను మలుపు తిప్పింది.  ‘తారానా’, ‘సంగ్‌దిల్‌’, ‘దాగ్‌’, ‘షికస్త్‌’, ‘ఫుట్‌పాత్‌’ వంటి సినిమాలతో దిలీప్‌కుమార్‌ ట్రాజెడీ కింగ్‌గా ఎదిగారు. దిలీప్‌కుమార్‌ నటనా పద్థతిని మెథడ్‌ యాక్టింగ్‌ అంటారు. ఈ పద్థతిలో నటులు తమంతతామే ఆ పాత్రలోకి వెళ్లిపోతారు. నిజ జీవితానికి, నట జీవితానికీ తేడాను చెరిపివేసే నటనా పద్థతి ఇది. ఇలాంటి నటనతో  నాటకీయమైన సినిమాని చూస్తున్నట్లు కాకుండా, నిజజీవితాన్ని తెరపై చూస్తున్నామన్న భావన కలుగుతుంది. అందుకే దిలీప్‌కుమార్‌ ట్రాజెడీ సినిమాలు అంతగా అలరించాయి. మహిళలతతో విపరీతంగా కన్నీళ్లు పెట్టించి మరింతగా ఆకర్షించాయి. ‘దీదార్‌’ చిత్రంలో ప్రేయసి కోసం కళ్లు పొడుచుకున్న అమర ప్రేమికుడు పాత్రలో దిలీప్‌కుమార్‌ నటనకు అందరూ నీరజనాలు పట్టారు. ఆ పాత్ర తర్వాత దిలీప్‌కుమార్‌ మానసికంగా దెబ్బతిన్నారు. ట్రాజెడీ, వినోదాత్మక సినిమాలకు నడుమ సమతుల్యం లేకుండా ట్రాజెడీ చిత్రాలే చేస్తే దిలీప్‌ మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని అప్పట్లో వైద్యులు సూచించారు. దాంతో దిలీప్‌కుమార్‌ కామెడీ వైపు దృష్టి పెట్టారు.


అపురూప ఘట్టం

‘దేవదాస్‌’లో ప్రేయసిని పొందే ధైర్యం లేక, తాగి జీవితాన్ని నాశనం చేసుకున్న పాత్రలో అంతగా జీవించాడు. ‘కోహినూర్‌’ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో మరువలేని హాస్యాన్ని అందించారు. ‘యహూది’లో రొమన్‌ ప్రేమికుడిగా అద్భుతమైన నటన కనబరిచారు. ఆయన నటించిన ‘మధుమతి’ సినీ చరిత్రలో ఓ అపురూప సంఘటనగా నిలిచింది. సినీ వినీలాకాశంలో ఒక అపురూప ఘట్టం ‘మొఘల్‌ ఏ ఆజం’. ఈ చిత్రంలో సలీం అంటే ఇలాగే ఉంటాడని నిరూపించారు. ‘గంగా జమున’లో మంచి వారు చెడు మార్గాల్లో ఎందుకు పడతారో అద్భుతంగా చూపించి, ఎందరో నటులకు స్ఫూర్తిగా నిలిచారు. ‘దిల్‌ దియా దర్ద్‌ లియా’లో ఓ ేసవకుడు యజమానిగా మారి యజమాని ఎలా ఉండాలో నేర్పించే పాత్రలో దిలీప్‌కుమార్‌ ఒదిగిన తీరు మాటల్లో చెప్పలేనిది! ‘ఆద్మీ’లో అసూయతో రగిలి నిజం గ్రహించే ప్రేమికుడి పాత్రలో జీవించారు. 



జీవితంలోనూ. తెరపైనా భగ్న ప్రేమికుడు

సినిమాల్లో భగ్న ప్రేమికుడి పాత్రకు తిరుగులేని మనిషి దిలీప్‌కుమార్‌. జీవితంలోనూ ఆయనకు ఆ అనుభూతి తప్పలేదు. వయసులో ఉన్నప్పుడు నటి మధుబాలను ప్రేమించారాయన. కానీ మత వ్యవహారాలు వీరి ప్రేమకు అడ్డుపడ్డాయి. తనతో కలిసి నటించిన హీరోయిన్లు కామినీ కౌశల్‌తో క్లోజ్‌గా ఉండేవారు. కానీ వివాహం చేసుకోలేదు. ‘గంగాజమున’, ‘నయా దౌర్‌’, ‘లీడర్‌’ వంటి సినిమాల్లో నాయికగా నటించిన వైజయంతీమాలతో సన్నిహితంగా ఉండేవారు. అక్కడా దెబ్బకొట్టింది. మరో త్రిలోక సుందరి నసీమ్‌ కూతురు సైరాభానును చూశారు దిలీప్‌. ఇద్దరి మతాలు ఒకటే! కానీ ఇద్దరి వయసులో వ్యత్యాసం ఉంది. 44 ఏళ్ల దిలీప్‌ 22 ఏళ్ల సైరాభాను దగ్గరికి నేరుగా వెళ్లి ‘నిన్న పెళ్లి చేసుకుందాం’ అనుకుంటున్నాను అని చెప్పేశారు. లవ్‌ ఎట్‌ మెనీ సైట్‌. బట్‌  మ్యారేజ్‌ ఎట్‌ ఫస్ట్‌ టాక్‌ అన్నట్లు వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు సంతానం లేదు. 

ఆయన క్రాఫ్‌కు క్రేజ్‌ ఎక్కువ...

ఏదైనా చిత్రం విశేషంగా ఆదరణ పొందితే ఈ చిత్రంలో తారల పేరిట చీరలు, గాజులు, బట్టలు మార్కెట్‌లో విపరీతంగా అమ్మకాలు జరిగేవి. ఆ రోజుల్లో ఇద్దరి నటుల క్రాఫ్‌కు సెలూన్‌లో భలే గిరాకీ ఉండేది. అప్పట్లో దిలీఫ్‌, ఆ తర్వాత అమితాబ్‌ బచ్చన్‌ క్రాఫ్‌కు భలే క్రేజ్‌ ఉండేది. 


తెలుగువారితో అనుబంధం 

ఒక నాటక కళా పరిషత్తు సభలో అధ్యక్షస్థానంలో ఉన్న పృథ్వీరాజ్‌ కపూర్‌ హాస్యనటుడు చలంను చూసి ‘అరే దిలీప్‌కుమార్‌లా ఉన్నాడే ఈ కుర్రాడు అన్నారు. దక్షిణాదిన దిలీప్‌కు మొదటి అవకాశం ఇచ్చింది పక్షిరాజా నిర్మాత శ్రీరాములు నాయుడు. అగ్గిరాముడు, ఆజాద్‌ హిందీ చిత్రాలను ఆయన నిర్మించారు. తర్వాత బి.నాగిరెడ్డి ‘రామ్‌ ఔర్‌ శ్యామ్‌’లో దిలీప్‌ నటించారు. తెలుగు, తమిళ వెర్షన్‌లో రామారావు ఎంజీఆర్‌ నటించారు. తెలుగు సినిమా ‘బొబ్బలి బ్రహ్మన్న’ హిందీ రీమేక్‌ ‘ధర్మాధికారి’లో దిలీప్‌కుమార్‌ నటన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. చివరి సినిమా ‘ఖిలా’లో ద్విపాత్రాభినయం చేశారు. ఆ తర్వాత ఏ సినిమాలోనూ నటించకూడదని  నిర్ణయం తీసుకున్నారు. మద్రాస్‌లో స్టూడియోలు నీట్‌గా ఉంటాయ, ఇక్కడి షూటింగ్‌లు పద్దతి ప్రకారం జరుగుతాయని దిలీప్‌ తరచూ ప్రశంసిస్తుండేవారు. 

పద్మ విభూషణుడు...

నటుడు నిర్మాతగానే కాకుండా రాజసభ సభ్యుడిగానూ నామినేట్‌ అయ్యారు. నిజ జీవితంలో వివాదాలకు దిలీప్‌ దూరంగా ఉండేవారు. తన వ్యక్తిగత విషయా?ను పెద్దగా పంచుకోరు. ‘ది సబ్‌స్టాన్స్‌ అండ్‌ ది షాడో’ పుస్తకం ద్వారా తన జీవిత చరిత్రను ఆవిష్కరించారు. భారత సినిమా పరిశ్రమకు దిలీప్‌కుమార్‌ అందించిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు. 


దిలీప్ కుమార్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.  





















జైపూర్ కి చెందిన  చంద్రప్రకాష్ గుప్తా అనే అభిమాని దిలీప్ కుమార్ బొమ్మను గీసి శ్రద్ధాంజలి  ఘటించారు. 


Updated Date - 2021-07-07T21:43:29+05:30 IST