సోషల్ మీడియాకు దూరంగా ఉండే సిరివెన్నెల.. చివరి సారి ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్ ఏంటంటే..

టాలీవుడ్‌లో ప్రముఖ సినీగేయ రచయితల్లో ఒకరైన సిరివెన్నెల సీతారామశాస్త్రి.. అనారోగ్య కారణంగా మంగళవారం మృతి చెందడంతో సినీ పరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి. సామాన్యులకు సైతం అర్థమయ్యే పదాలతో పాటలను రాస్తూ.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సిరివెన్నెల సినిమాలో మొత్తం పాటలన్నింటినీ ఒక్కరే రాసి.. ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆయన లేరనే వార్తను పాటల ప్రేమికులు జీర్ణించుకుకోలేకున్నారు.

కారోనా ప్రారంభమైనప్పటి నుంచి సినిమా పరిశ్రమలో చాలా మంది సీనియర్ నటులు, దర్శకులు, రచయితలు.. సోషల్ మీడియాలోకి అడుగు పెట్టి తమ అభిప్రాయాలను పంచుకోవడం చూశాం. అయితే సిరివెన్నెల మాత్రం సోషల్ మీడియాకు చాలా వరకు దూరంగా ఉంటూ వచ్చారు. కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ ఆయన కుటుంబ సభ్యులతో గడిపేవారే కానీ.. సోషల్ మీడియాలో మాత్రం పెద్దగా కనబడలేదు. ఆయనకు ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉన్నా.. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే పోస్టులు పెట్టేవారు.

కారోనా కారణంగా 2020 సెప్టెంబర్ 25న గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.. మృతి చెందిన విషయం తెలిసిందే. ఎస్పీ బాలును సిరివెన్నెల అన్నయ్య అని పిలుస్తూ ఉండేవారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ అదే రోజు ఆయన యూట్యూబ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అదే వీడియో లింక్‌ను తన ఫేస్‌బుక్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇంత వరకు ఆయన సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా చేయలేదు.


@sirivennela1955 పేరుతో ఆయన ట్విట్టర్ ఖాతా కూడా తెరిచారు. “సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలనే కోరిక కలిగింది. నా భావాలని మీతో పంచుకోవడం, రోజువారి కార్యక్రమాల్లోనూ, నా ఇతరత్ర సాహితీ కార్యక్రమాల్లోనూ నా అభిప్రాయలను మీకు తెలియజేడం, మీ అభిప్రాయాలని నేను తెలుసుకోవడం కోసం.. మీకు సన్నిహితంగా రావడం జరిగింది. @sirivennela1955 అన్నది నా ఐడీ. నమస్కారం” అంటూ తొలి వీడియోని షేర్ చేశారు సిరివెన్నెల.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.