సంక్రాంతికి సంబరం... వేసవికి ఆశ, నిరాశల మధ్య ఆరు నెలలు
ABN , First Publish Date - 2021-07-04T05:52:33+05:30 IST
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయాయి. అయితే ఈ ఆరు నెలల కాలంలో తెలుగు చిత్రపరిస్థితి చూస్తే .. ఆరు నెలల లాభం, రెండు నెలల విరామంలా ఉంది. కరోనా

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయాయి. అయితే ఈ ఆరు నెలల కాలంలో తెలుగు చిత్రపరిస్థితి చూస్తే .. ఆరు నెలల లాభం, రెండు నెలల విరామంలా ఉంది. కరోనా ఫస్ట్ వేవ్‌తో చిత్రపరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే గత ఏడాది చివరిలో తిరిగి మాములు పరిస్థితులు నెలకొనడం, పలు చితాల్రు థియేటర్లలో విడుదల కావడం, ప్రేక్షకులు కూడా సినిమాలు చూసేందుకు థియేటర్లకు తరలిరావడం... వంటి పరిణామాలు ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. కోటి ఆశలతో తెలుగు చిత్ర పరిశ్రమ కొత్త ఏడాది ముంగిట అడుగు పెట్టింది.
కానీ కరోనా సెకండ్ వేవ్ ఆ ఆశలన్నింటినీ మూట కట్టి అవతలకు విసిరేసింది. కరోనా మొదటి దశ ప్రభావం నుంచి నెమ్మదిగా కోలుకొని సినీ ఇండస్ట్రీ తిరిగి గాడిలో పడుతుందనుకున్న తరుణంలో కరోనా సెకండ్ వేవ్ మరోసారి గట్టి దెబ్బ తీసింది. దాని ప్రభావంతో కొత్త సినిమాల చిత్రీకరణలు, విడుదలలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తెలుగు సినిమాల మార్కెటింగ్‌కు, బిజినెస్‌కు సంక్రాంతి, వేసవి పెద్ద సీజన్స్. అయితే సంక్రాంతికి విడుదలైన చిత్రాలు పరిశ్రమను సంతోషపరిస్తే, సినిమాల విడుదలలు లేక వేసవి నిరాశ పరిచింది.
సంక్రాంతి కిరీటం రవితేజదే!
ఈ ఏడాది సంక్రాంతికి రవితేజ ‘క్రాక్’ చిత్రంతో థియేటర్ల దగ్గర సందడి చేశారు. మాస్ పోలీసాఫీసర్ శంకర్‌గా అయన నటన, కఠారి కృష్ణగా సముద్రఖని, జయమ్మగా వరలక్ష్మి శరత్‌కుమార్ క్రౌర్యం, సాయిమాధవ్ బుర్రా పదునైన డైలాగ్‌లు, గోపీచంద్ మలినేని అద్భుతమైన నెరేషన్ ‘క్రాక్’కు ఈ ఏడాది బాక్సాఫీసు దగ్గర తొలి సూపర్‌హిట్ ఇచ్చాయి. ఈ చిత్రం దాదాపు రూ. 70 కోట్ల వసూళ్లు సాధించిందని సమాచారం. అలాగే సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ‘అల్లుడు అదుర్స్’ కూడా సంక్రాంతి బరిలో నిలిచినా పోటీ ఇవ్వలేకపోయింది. ఈ నెల్లో మంచి హైప్‌తో వచ్చిన సంక్రాంతి చిత్రాల్లో కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్‌పోతినేని హీరోగా నటించిన ‘రెడ్’ ఒకటి. ఇందులో రామ్ తొలిసారి ద్విపాత్రిభినయం చే సినా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. బుల్లితెర యాంకర్ ప్రదీప్ కథానాయకుడిగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రం ప్రారంభంలో మంచి వసూళ్లు సాధించినా, ఆ తర్వాత యావరేజిగా నిలిచింది. బిగ్‌బాస్‌తో గుర్తింపు తెచ్చుకున్న పునర్నవి భూపాలం ‘సైకిల్’ సందడి లేకుండానే వెళ్లిపోయింది. ‘బంగారు బుల్లోడు’ రూపంలో అల్లరి నరేష్ ఖాతాలో మరో ప్లాప్ చేరింది. ఇదే నెల్లో వచ్చిన ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’, ‘చెప్పినా ఎవరూ నమ్మరు’, ‘అమ్మదీవెన’ ‘జైసేన’, ‘కళా పోషకులు’ చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి.
వైష్ణవ్‌తేజ్ సక్సెస్‌ఫుల్ ఎంట్రీ
ఫిబ్రవరిలో పంజా వైష్ణవ్ తేజ్ శుభారంభాన్ని అందించారు. . అంచనాలకు మించి ‘ఉప్పెన’ ఘన విజయాన్ని సొంతం చేసుకొని సినీ పరిశ్రమకు సంతోషాన్నిచ్చింది. కొత్త తరహాగా రూపొందిన ఈ ప్రేమకథకు తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్టయ్యారు. ‘ఉప్పెన’ విజయాన్ని కొనసాగించిన ‘జాంబిరెడ్డి’ కూడా కాసుల వర్షం కురిపించాడు. జాంబిలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు తోడు వినోదం బాగా పండడంతో సినిమా సక్సెస్ అయింది. ఈ నెల్లో అల్లరి నరేశ్‌కు ‘నాంది’ రూపంలో లభించిన హిట్ ఆయనకు పెద్ద ఊరటగా నిలిచింది. ఇదే నెల్లో మరో సూపర్ హిట్‌గా నిలుస్తుందనుకున్న నితిన్ ‘చెక్’ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఆ తర్వాత చెప్పుకోదగ్గ చిత్రాల్లో కన్నడ హీరో దృవ సర్జా ‘పొగరు’ ఒకటి. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ కావడం సినిమాపై ఆసక్తిని పెంచినా థియేటర్ల దగ్గర చతికిలపడింది. ఈ నె ల్లో వచ్చిన ‘జీ-జాంబి’, ‘మధురా వైన్స్’, ‘ప్రణవం’, ‘ఎఫ్‌సీయూకే’, ‘కపటధారి’, ‘నిన్నిలా నిన్నిలా’ జనాల్ని థియేటర్లకు రప్పించలేకపోయాయి.
మార్చిలో జాతిరత్నాల మోత
మార్చి నెల మొత్తం థియేటర్ల దగ్గర ‘జాతిరత్నాలు’ కలెక్షన్ల మోత మోగించారు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో అనుదీప్ కె.వి. దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే నెల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్, కీర్తిసురేష్‌లు జంటగా నటించిన ‘రంగ్ దే’ అంచనాలు అందుకోలేకపోయింది. కార్తికేయ ‘చావు కబురు చల్లగా’, యావరేజ్ టాక్ తెచ్చుకొంది. మంచి హైప్‌తో వచ్చి ప్లాప్‌ల జాబితాలో చేరిన చిత్రాలు కూడా ఈ నెలలో ఎక్కువే ఉన్నాయి. వాటిలో శర్వానంద్ ‘శ్రీకారం’ రాణా ‘అరణ్య’ కథ, కథనం బాగున్నా ప్రేక్షకులను నిరాశ పరిచాయి. సందీప్ కిషన్ ‘ఏ 1 ఎక్ ్సప్రెస్’, శ్రీ విష్ణు ‘గాలి సంపత్’, మంచు విష్ణు ‘మోసగాళ్లు’, ఆది ‘శశి’, శ్రీ సింహా ‘తెల్లవారితే గురువారం’ ‘ఏప్రిల్ 28 ఏం జరిగింది?’, తదితర చిత్రాలు ప్రేక్షకులను ఉసూరుమనిపించి వెళ్లిపోయాయి.
ఏప్రిల్ లో వసూళ్ల రాయుడు పవన్
ఏప్రిల్ నెలలో వెండితెరపై పవన్ కల్యాణ్ మానియా పనిచేసింది. ఈ ఏడాదికి ‘వకీల్‌సాబ్’ చిత్రం అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. రెండో లాక్‌డౌన్‌కు కొన్ని వారాల ముందే థియేటర్లలో విడుదలైన ‘వకీల్‌సాబ్’ భారీ వసూళ్లను రాబట్టాడు. రవితేజ క్రాక్‌తో మొదలుపెట్టిన విజయ పరంపర పవన్‌కల్యాణ్ ‘వకీల్‌సాబ్’తో ముగిసిందని చెప్పాలి.
నాగార్జున ‘వైల్డ్‌డాగ్’ థియేటర్ల దగ్గర ప్రభావం చూపలేకపోయింది. రామ్‌గోపాల్ వర్మ ‘దెయ్యం’, పరాజయం చవిచూసింది. కొన్ని చిన్న చిత్రాలు థియేటర్ల దగ్గర విడుదలైనా అరకొర స్పందనే లభించింది. ఇర వరుసగా రెండో ఏడాది కూడా వేసవి సీజన్‌ను తెలుగు సినిమా కోల్పోయింది. మే 12 నుంచి తెలంగాణలో లాక్‌డౌన్ విధించడంతో థియేటర్లు మూతపడ్డాయి. ఓటీటీల్లో వచ్చే సినిమాలు చూసే అలవాటు ప్రేక్షకుల్లో ఎక్కువైంది.
ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రాలు
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడం, పరిస్థితులు మెరుగవడంతో రెండు తెలుగు రాష్ర్టాల్లో థియేటర్లు త్వరలో ఓపెన్ కానున్నాయి. ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పలు భారీ చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి.
రానా ‘విరాటపర్వం’, గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’, నాగచైతన్య ‘థాంక్యూ’ వెంకటేష్ ‘నారప్ప’, ‘దృశ్యం 2’ నితిన్ ‘మాస్ట్రో’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. చిరంజీవి, చరణ్ ‘ఆచార్య’, జూనియర్ ఎన్టీఆర్ , రామ్‌చరణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’, వెంకటేశ్, వరుణ్‌తేజ్ ‘ఎఫ్ 3’, అల్లు అర్జున్ ‘పుష్ప’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ అడవి శేష్ ‘మేజర్’, వరణ్‌తేజ్ ‘గని’, శర్వానంద్ ‘మహాసముద్రం’, విజయ్ దేవరకొండ ‘లైగర్’, నాని ‘టక్ జగదీశ్’, ‘శ్యామసింగరాయ్’’ లాంటి చిత్రాలు చిత్రీకరణ చివరిదశలో ఉన్నాయి. రాబోయే రెండు మూడు నెలల్లో ఈ చిత్రాలన్నీ థియేటర్లకు రావడం ఖాయం. అయితే కరోనా థర్డ్ వేవ్ భయం నిర్మాతల మనసుల్లో ఉన్నా, షూటింగ్ పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు.

అనువాద చిత్రాల భయం లేదు
జయాపజయాల విషయం ఎలా ఉన్నా విడుదల సమయంలో మాత్రం డబ్బింగ్ చిత్రాలు స్ట్రెయిట్ సినిమాలకు గట్టి పోటీ ఇస్తుంటాయి. అయితే. ఈసారి వెండితెరపై అనువాద చిత్రాల మేజిక్‌కు అడ్డుకట్టపడిందనే చెప్పొచ్చు. కన్నడ, తమిళ, ఆంగ్ల భాషల నుంచి మొత్తం 16 అనువాద చిత్రాలు ఈ ఆర్నెల్లలో విడుదలయ్యాయి. వీటిలో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ చిత్రం ఒక్కటే కాస్త ఫరవాలేదనిపించింది. విజయ్ ‘మాస్టర్’, ధనుష్ ‘జగమే తంత్రం’, ‘రాబర్ట్’, ‘పొగరు’, ‘యువరత్న’ చిత్రాలు ఇలా వచ్చి అలా పోయాయి.
