Deepika Padukone: నేను అందరిలా కాదు.. అక్కడ కూర్చున్న ప్రతిసారి గూస్‌బంప్స్ వస్తాయి

ABN , First Publish Date - 2022-05-24T22:43:17+05:30 IST

బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్లలో దీపికా పదుకొనే ఒకరు. ఈ బ్యూటీ ప్రస్తుతం 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ మెంబర్స్‌లో..

Deepika Padukone: నేను అందరిలా కాదు.. అక్కడ కూర్చున్న ప్రతిసారి గూస్‌బంప్స్ వస్తాయి

బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్లలో దీపికా పదుకొనే ఒకరు. ఈ బ్యూటీ ప్రస్తుతం 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ (Cannes Film Festival 2022)లో జ్యూరీ మెంబర్స్‌లో ఒకరిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జ్యూరీ మెంబర్‌‌గా తన అనుభవాల గురించి పంచుకుంది. 


దీపిక మాట్లాడుతూ.. ‘జ్యూరీ స్టేజ్ మీదకి వెళ్లిన ప్రతిసారీ నాకు గూస్‌బంప్స్ వస్తాయి. ఎందుకంటే అక్కడ సీటులో కూర్చున్న ప్రతి వ్యక్తి సినిమాని సెలబ్రేట్ చేయడానికి వచ్చారు. అలాంటి ప్రముఖులతో కలిసి పనిచేయడం వల్ల అలా అనిపిస్తుంటుంది. అయితే.. జ్యూరీలోని సభ్యులకి, నాకు చాలా తేడాలు ఉన్నాయి. అలాగే వారి గురించి డైరెక్ట్‌గా నాకు ఏం తెలియదు. కానీ.. వారి గురించి చదవడం, సినిమాలు చూడటం ద్వారా కొంచెం తెలుసుకున్నాను. వారితో ఎలా మాట్లాడాలి. ఎలా ప్రవర్తించాలనే విషయాలు అర్థమయ్యాయి’ అంటూ చెప్పుకొచ్చింది.


అలాగే.. ఓవైపు కేన్స్‌కి రావడం గర్వంగా ఫీల్ అవుతున్నప్పటికీ.. మరోవైపు జ్యూరీ మెంబర్‌గా సెలెక్ట్ కావడం ఆశ్యర్యపరిచిందని దీపిక తెలిపింది. దీపిక ఇంకా మాట్లాడుతూ.. ‘నా ఎంపిక విషయంలో కేన్స్ మేనేజ్‌మెంట్ సంతృప్తిగానే ఉంది. అయితే.. నేను మాత్రం కొన్నిసార్లు ఇక్కడ ఉండే స్థాయి నాకు ఉందా అని ఆలోచిస్తుంటా. ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే.. నేను సరైన దారిలోనే వెళుతున్నట్లు భావిస్తున్నా’ అని పేర్కొంది. అయితే.. కెరీర్ పరంగా, వర్క్ పరంగా జ్యూరీ సభ్యులైన అస్గర్ ఫర్హాదీ, రెబెక్కా హాల్‌‌ (Rebecca Hall)కి తనకు కొన్ని సారూప్యతలు ఉన్నట్లు దీపిక చెప్పింది.

Updated Date - 2022-05-24T22:43:17+05:30 IST