స్పెషల్‌: దర్శక శిఖరం దాసరి నాలుగో వర్ధంతి!

Twitter IconWatsapp IconFacebook Icon
స్పెషల్‌: దర్శక శిఖరం దాసరి నాలుగో వర్ధంతి!

దాసరి ఓ సినీ పుస్తకం..
దర్శకుడి స్యాయిని పెంచిన వ్యక్తి...
కార్మిక నేత నుంచి రాజకీయ నాయకుడి దాకా...
ఆయన సేవలు అనిర్వచనీయం!

‘ఆగదు.. ఆగదు.. ఆగదు ఏ నిమిషము నీ కోసమూ.. ఆగితే సాగదు ఈ లోకము’ అంటూ గేయ రచన చేసి ‘ప్రేమాభిషేకం’ చేయించుకొన్న దర్శక దార్శనికుడు దాసరి నారాయణరావు కన్ను మూసి నాలుగేళ్లు పూర్తయింది. ఆదివారం ఆయన నాలుగో వర్ధంతి. దర్శక దిగ్గజం కెరీర్‌ గురించి ఓ సారి నెమరు వేసుకుందాం. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలూ తీసి, ‘డైరెక్టర్‌ ఈజ్‌ ద కెప్టెన్‌ ఆఫ్‌ ద మూవీ’ అని అందరు దర్శకులూ సగర్వంగా తలెత్తుకొని నిల్చొనేలా చేశారు దాసరి. చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ కష్టమొచ్చినా ‘మా గురువుగారున్నారు’ అనే భరోసా కల్పించిన మహాగురువు. ఇరవై నాలుగు శాఖల వారూ తమ ఇంటి మనిషి, ఇండస్ట్రీ పెద్ద దిక్కు, తమ ‘మేస్త్రి’ దూరమై నాలుగేళ్లయిన మరువలేకపోతున్నారు.

స్పెషల్‌: దర్శక శిఖరం దాసరి నాలుగో వర్ధంతి!

శక్తిగా ఎదుగుతారని ఊహించలేదు...
కోర్టు ఆవరణలో టైప్‌ మిషన్‌ పెట్టుకొని వర్క్‌ చేసిన వ్యక్తి తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి తన ప్రతిభతో శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా పరిశ్రమ బాగోగులు పర్యవేక్షించే ఓ అద్భుత శక్తిగా ఎదుగుతాడని ఎవరు మాత్రం ఊహించగలరు? కానీ ఆ వ్యక్తిలో మాత్రం భవిష్యత్‌లో తానేదో సాధించగలననే నమ్మకం, ఆత్మవిశ్వాసం మెండుగా ఉండేవి. స్వయంకృషి, అపారమైన తెలివితేటలతో అంచలంచెలుగా ఎదిగారు దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణరావు. ప్రతి  వ్యక్తి జీవితంలోనూ ఓ చరిత్ర ఉంటుంది. అలాగే ఎక్కడో ఓ పేద కుటుంబంలో పుట్టి తన కుటుంబానికీ, బంధువులకు, స్నేహితులకు తప్ప వేరే ప్రపంచానికి తెలియని దాసరిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తెలిసేలా చేసింది సినీరంగమే. ఈ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నెన్నో విజయాలు, అపజయాలు, ఎన్నో కష్టాలు, నష్టాలు, కీర్తిప్రతిష్టలు, అవమానాలు చోటుచేసుకొన్నాయి. అయినా అవన్నీ తట్టుకొని నిలబడ్డారు. దాసరికి సాటి దాసరే అనిపించుకుని ఓ వ్యవస్థగా ఎదిగారు. ఎందరో నటీనటులు  ఆయన దర్శకత్వంలో రాణించారు. మరెందరో దర్శకులకు ఆయన మార్గధర్శకునిగా మారారు. ఎందరెందరో నిర్మాతలు దాసరితో సినిమాలు తీసి డబ్బు సంపాదించుకొన్నారు. కొత్తవారిలో ఉన్న దాగిన ప్రతిభను వెలికి తీశారు. వెండితెరపై మెరుపులు మెరిపించిన అపర విశ్వామిత్రుడు దాసరి అని చెప్పడానికి సందేహించనక్కర్లేదు. ఇతరులకు సాయపడే గుణం, ఎటువంటి కష్టాన్నయినా ఎదుర్కొనే ధీరత్వం, నష్టం వచ్చిన కుంగిపోని ఆత్మస్థైర్యం.. దాసరిలో ఉన్నాయి కాబట్టే ఆయన ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిచారు. పరిశ్రమలో దాసరి పేరు, మాట వాడుకోని వారెవరూ కనిపించరు. అలాగే శత్రువు అయినా తన దగ్గరికి వచ్చి మాట సాయం కోరితే ‘లేదు.. కాదు’ అని చెప్పలేకపోవడం దాసరి బలహీనత అని చెప్పాలి. ఆ బలహీనతని ఆసరాగా తీసుకొని ఆయన్ని నిచ్చెనలా వాడుకొన్న వారు పరిశ్రమలో ఎందరో!  పరిశ్రమలో ఎటువంటి పెద్ద సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఓర్పు దాసరిలో ఉండేవి. దాసరిని వివాదాస్పద వ్యక్తిగా మార్చినా ఆయన ఏనాడూ వెన్ను చూపలేదు. రాజీపడి తన పంథా మార్చుకోలేదు.

స్పెషల్‌: దర్శక శిఖరం దాసరి నాలుగో వర్ధంతి!

దాసరి బాల్యం.. విద్యాభాస్యం.. నాటకాలు...

పాలకొల్లులోని ఓ నిరుపేద కుటుంబంలో ఆరుగురు పిల్లల్లో ఒకరిగా పుట్టారు దాసరి. ఆయన ఆరో తరగతిలోకి వచ్చేసరికి వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. స్కూల్‌ ఫీజు కట్టడానికి కూడా డబ్బు లేకపోవడంతో దాసరి చదువు మాన్పించి ఓ కార్పెంటర్‌ దగ్గర పనికి పెట్టారు వాళ్ల నాన్న. ఫస్ట్‌ ఫారం(ఐదో తరగతి)లో ఉత్తమ విద్యార్థిగా దాసరికి బహుమతి వచ్చింది. తను పనిచేసే షాపు ముందు నుంచే తన క్లాస్‌మేట్స్‌ బడికి వెళుతుంటే చూసి దాసరి కళ్లలో నీళ్లు తిరిగేవి. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. ఇది గ్రహించి వాళ్ల స్కూల్‌ మాస్టర్‌ దాసరిని చదివించడానికి ముందుకు వచ్చారు. మాస్టర్‌ పిలుపుతతో తోటి విద్యార్థులందరూ జేబులో ఉన్న అణాలు, బేడాలు తీసి టేబుల్‌ మీద పెట్టారు. దాసరి స్కూల్‌ ఫీజుకి సరిపడా డబ్బు పోగయింది. ఈ సంఘటన దాసరి మీద ఎంత ప్రభావం చూపిందంటే.. కెరీర్‌లో ఆయన స్థిరపడిన తర్వాత డబ్బుకి ఇబ్బంది పడి చదువుకోలేని ఎంతోమందికి సాయం చేశారు. తన పుట్టిన రోజు  నాడు పేద విద్యార్థులకు ఆర్ధిక సాయం అందించడం ఓ అలవాటుగా పెట్టుకొన్నారు.

స్పెషల్‌: దర్శక శిఖరం దాసరి నాలుగో వర్ధంతి!

రాష్ట్ర స్థాయి నటుడిగా...
చిన్న వయసు నుంచే దాసరికి నాటకాల పిచ్చి. అప్పట్లో పౌరాణిక నాటకాలకు డిమాండ్‌ ఎక్కువ. తన 8వ ఏట ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకంలో నారదుని వేషం వేసి తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేశారు. తన 13వ ఏట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘పంచవర్ష ప్రణాళికా ప్రగతి’ అనే నాటికను ప్రదర్శించి రాష్ట్రస్థాయి ఉత్తమ నటునిగా ఎన్నికయ్యారు. అలాగే  తన 14వ ఏట ‘నేను–నాస్కూలు’ నాటికను రచించారు. ఈ నాటికకు ఆయనే దర్శకత్వం వహించడం విశేషం. నరసాపురం వైఎన్‌ కళాశాలలో బిఏ చదువుతున్న రోజులలోనే కన్నీరు–పన్నీరు, పద్మవ్యూహం వంటి నాటకాలను రచించి, క్షీరారామ ఆర్ట్‌ ధియేటర్స్‌ అనే నాటక సమాజాన్ని స్థాపించి అనేక మందిని నటులుగా తీర్చి దిద్దారు. డిగ్రీతోపాటు టైపింగ్‌ లోయర్‌, హయ్యర్‌ పాజైన ఆయన చిక్కడపల్లిలో ఓ సంస్థలో టైపి్‌స్టగా పనిచేశారు. ఆ తర్వాత చార్మినార్‌ కంపెనీలో చేరారు. అక్కడ పనిచేస్తుండగానే హైదరాబాద్‌ ఏరో నాటిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగం వచ్చిందాయనకి.
 
సినిమాల్లో ఛాన్స్‌...
ఓ సారి రవీంద్రభారతిలో నాటకం వేస్తుంటే వై.వి. కృష్ణయ్య అనే నిర్మాత చూసి ‘సినిమాల్లో నటిస్తావా?’ అని అడిగారు. ఆ సమయంలో ఆయన ‘అందం కోసం పందెం’ అనే సినిమా తీస్తున్నారు. అందులో కమెడియన్‌ వేషం దాసరితో వేయించాలని కృష్ణయ్య ఆలోచన. అయితే అప్పటికి దాసరికి సినిమాల మీద ఆసక్తిలేదు. సినిమాల్లో అవకాశాల కోసం మద్రాసుకి వెళ్లిన వాళ్ల కష్టాలు పత్రికల్లో చదవడంతో ఆ జోలికి పోవద్దనుకొన్నారు. హాయిగా ఉద్యోగం చేసుకొంటూ నాటకాల్లో నటిస్తే చాలుకొన్నారు. అందుకే కృష్ణయ్య ఆఫర్‌కి పెద్దగా స్పందించలేదు. అయినా కృష్ణయ్య ఆయన్ని వదిలిపెట్టలేదు. ‘అందం కోసం పందెం’ చిత్రంలో మెయిన్‌ కమెడియన్‌ వేషం నీకు ఇస్తున్నామనీ, వెంటనే మద్రాసు రావాలనీ ఉత్తరం రాశారు. ‘ఇంతకంటే మంచి అవకాశం రాదు. వెంటనే బయలుదేరు’ అని మిత్రులంతా ప్రోత్సహించడంతో దాసరి సరేనని రైలెక్కారు. వాహినీ స్టూడియో షూటింగ్‌ .. మేకప్‌ వేసుకోవడానికి  ఎంతో ఉత్సాహంతో మేక్‌పరూమ్‌కి వెళ్లారు దాసరి. అయితే ఆదిలోనే ఆయనకు అవమానం ఎదురైంది. ‘ప్రతి వాడూ ఓ నాటకం వేసేయడం, కప్పు తెచ్చుకోవడం, కప్పు వచ్చిన వెంటనే మద్రాసు సెంట్రల్‌లో దిగిపోవడం, వేషం వేసేయాలనుకోవడం ... అసలెప్పుడైనా అద్దంలో నీ మొహం చూసుకొన్నావా?’ అని ఓ పక్క మేకప్‌ చేస్తూనే ఈసడింపుగా మాట్లాడుతున్నాడు మేక్‌పమేన్‌. ఆ మాటలు విని నిర్ఘాంతపోయారు దాసరి. వాళ్లు పిలిస్తేనే కదా తను ఇక్కడికి వచ్చింది.. మరి ఏమిటీ ఇతనిలా మాట్లాడుతున్నాడు.. కోపం వచ్చినా తమాయించుకొన్నారు. మౌనం వహించి మేకప్‌ వేయించుకొన్నారు. ఆ తర్వాత పిలకజుట్టు ఉన్న విగ్గు తీసుకొచ్చి ఆయనకి తగిలించారు. అప్పుడు తెలిసింది ఆయనకు.. ఇందులో మెయిన్‌ కమెడియన్‌ బాలకృష్ణ అనీ, ఆయన అసిస్టెంట్‌ వేషం తనదనీ. వెంటనే నిర్మాత కృష్ణయ్య దగ్గరికి వెళ్లి అడిగారు. తనకు తెలియకుండానే జరిగిన మార్పు ఇదని చెప్పి ఆయన దాసరి చేతులు పట్టుకొన్నారు. నాటకరంగంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ నటుడినైనా సినిరంగానికి మాత్రం ఓ అనామక వేషంతో పరిచయమవడం నిజంగా విధి చేసిన వింతే.

స్పెషల్‌: దర్శక శిఖరం దాసరి నాలుగో వర్ధంతి!

‘అందం కోసం పందెం’తో...
వెనక్కి తిరిగి వెళ్లిపోతే ‘సినిమాలకు పనికిరాడని పంపించేశారని’ అందరూ అనుకొంటారని భావించి, అవమానాన్ని దిగమింగుకొని ‘అందం కోసం పందెం’ చిత్రంలో నటించారు దాసరి. ఆ సినిమా తర్వాత ఇక నటన జోలికి పోకూడదని గట్టి నిర్ణయం తీసుకొన్నారు. తెలుగులో ‘ప్రేమకు పర్మిట్‌’ అనే డబ్బింగ్‌ సినిమాతో దాసరి రచయితగా మారారు. ‘మా నాన్నకి నిర్దోషి’ చిత్రంతో సహకార దర్శకుడాయ్యరు. ఆ హోదాలో ‘జగత్‌ జెట్టీలు’, ‘ఒకే కుటుంబం’, ‘వింత సంసారం’, ‘కూతురు కోడలు’ తదితర పన్నెండు సినిమాలకు పనిచేశారు. కొన్ని సినిమాలకు మాటలు కూడా రాశారు.

దర్శకుడిగా టర్నింగ్‌ పాయింట్‌..
పాతికేళ్ల వయసులో ‘తాత–మనవడు’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం దాసరికి వచ్చింది. కె.రాఘవ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తొలి ప్రయత్నంలోనే పరిశ్రమ పెద్దల మెప్పు, ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకొనే అవకాశం ఆయనకి కలగలేదు. ఏడాదికి పది సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి. ఒకే సమయంలో ఏడు సినిమాలకు పని చేసిన సందర్భాలూ ఉన్నాయి. ప్రతి సినిమాకీ స్ర్కిప్ట్‌ సిద్ధంగా ఉండటంతో అన్ని సినిమాలు ఒకేసారి చేసినా ఏ ఇబ్బంది కలిగేది కాదు. సినిమా తప్ప మరో ధ్యాస లేని వ్యక్తి కావడంతో అద్భుతాలు సృష్టించగలిగారు దాసరి.

స్పెషల్‌: దర్శక శిఖరం దాసరి నాలుగో వర్ధంతి!

పరిశ్రమకు గురువు...
దాసరి నారాయణరావు లేరు. కానీ ఆయన తీసిన సినిమాలున్నాయి. తన సినిమాలతో ‘దర్శకరత్న’గా పేరుపొందిన ఆయన, చిత్రసీమ అంతటికీ గురువుగా మారిన వైనం అనితర సాధ్యం. ఆయనకు ముందు ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు. తమ చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని చాటారు. ఆయన సమకాలికుల్లోనూ, ఆయన తర్వాతి తరాల్లోనూ ప్రతిభావంతులైన దర్శకులు చాలా మందే ఉన్నారు. కానీ వాళ్లెవరికీ దక్కని గురువు స్థానం ఆయనకే దక్కింది. దర్శకుడిగా ఎంత ఉన్నతుడో, వ్యక్తిత్వపరంగా అంత ఉన్నతుడు కావడమే దీనికి కారణం. ఆయన రూపొందించిన 150 చిత్రాల్లో ఉత్తమ చిత్రాలెన్నో. వాటిలో మచ్చుకు కొన్ని...

తాత మనవడు సిల్వర్‌ జూబ్లీ...
దర్శకుడిగా తొలి చిత్రంతోటే సంచలనానికి తెరతీశారు. ‘తాత మనవడు’ పేరుతో సినిమా అంట.. ఎస్వీ రంగారావు, రాజబాబు తాతా మనవళ్లంట.. రాజబాబు జోడీగా విజయనిర్మల అంట.. అని వ్యంగ్యంగా మాట్లాడుకున్నవాళ్ల నోళ్లు ఆ సినిమా విడుదలయ్యాక మూతపడ్డాయి. దానికి తగ్గ సంభాషణలతో రచయితగానూ ‘ఇతను మామూలోడు కాదు’ అని గుర్తింపు పొందారు. దీనికి స్ర్కీన్‌ప్లే కూడా దాసరే!  తొలి సినిమాతోటే సిల్వర్‌ జూబ్లీని చూసిన దర్శకుడు దాసరి.
స్వర్గం నరకం (1975)
పుణ్యం చేసిన వాళ్లకు స్వర్గం, పాపం చేసిన వాళ్లకు నరకం ప్రాప్తిస్తాయని మనవాళ్ల నమ్మకం. ఆ రెండు లోకాలూ ఒక్కడో ఉండవు, మనం చేసే పనులకు ఈ లోకంలోనే వాటిని చవిచూస్తామని చెప్పే కథతో దాసరి రూపొందించిన సినిమా ‘స్వర్గం నరకం’. స్వయంగా తను ఓ కీలక పాత్ర పోషించి, రెండు జంటలను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు దాసరి. వారెవరో కాదు.. మోహన్‌బాబు, ఈశ్వరరావు, అన్నపూర్ణ, జయలక్ష్మి. ఈ కథకు, దీన్ని దాసరి తీసిన విధానానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డునిచ్చి సత్కరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇదే చిత్రాన్ని దాసరి దర్శకత్వంలోనే ‘స్వర్గ్‌ నరక్‌’ (1978) పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు.

స్పెషల్‌: దర్శక శిఖరం దాసరి నాలుగో వర్ధంతి!

మనుషులంతా ఒక్కటే (1976)
ఎన్టీ రామారావుతో దాసరి రూపొందించిన తొలి సినిమా ‘మనుషులంతా ఒక్కటే’ కమర్షియల్‌ ఎంత విజయం సాధించిందో, కంటెంట్‌పరంగానూ అంత మంచి పేరు తెచ్చుకుంది. టైటిల్‌లోనే ఈ సినిమా దేని గురించనేది చెప్పేశారు దాసరి.

శివరంజని (1978)
ఎన్టీఆర్‌ వంటి అగ్ర కథానాయకుడ్ని డైరెక్ట్‌ చేసి విజయం సాధించిన దర్శకుడు స్టార్‌ హీరోలతోటే సినిమాలు చేయాలని కోరుకుంటాడు. అలా చేస్తే దాసరి ఎందుకవుతాడు! ఒక పల్లెటూరి అమ్మాయి నగరానికి వచ్చి, సినీ తారగా కోట్లాదిమందికి ఆరాధ్యురాలిగా మారి, చివరకు ఏమయ్యిందనే హృదయాన్ని తడిచేసే కథతో అద్భుతమే సృష్టించారు దాసరి. ఆ అద్భుతం పేరు ‘శివరంజని’. టైటిల్‌ రోల్‌లో జయసుధను, ఆమె ప్రియుడి పాత్రలో అనామకుడైన హరిప్రసాద్‌ను చూపించి, ‘స్వర్గం నరకం’ ద్వారా తను హీరోగా పరిచయం చేసిన మోహన్‌బాబుతో నెగటివ్‌ రోల్‌ చేయించి ఉత్తమ ఫలితాన్ని రాబట్టారు దాసరి. ఈ కథ, శివరంజని పాత్ర మన హృదయాల్ని ఎలా కలచి, కదిలించి వేస్తాయో, పాటలూ అదే స్థాయిలో మనసును హత్తుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ‘శివరంజని’ ఒక సంగీత దృశ్య కావ్యం.

గోరింటాకు (1978)
‘గోరింట పూచింది కొమ్మా లేకుండా..’ పాట వినని, పాడని తెలుగువాళ్లు ఉండరు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన ఈ పాట ఉన్న సినిమా ‘గోరింటాకు’. ఈ సినిమాతో దాసరి ప్రేక్షకులకు రెట్టింపు దగ్గరయ్యారు. మ్యూజికల్‌గానూ మంచి విజయం సాధించిన ‘గోరింటాకు’ కుటుంబ కథాచిత్రాల్లో ఆణిముత్యం. ఇదే చిత్రాన్ని హిందీలో ‘మెహందీ రంగ్‌ లాయేగీ’ (1982) పేరుతో రీమేక్‌ చేశారు దాసరి.

నీడ (1978)
పాటలు లేని తెలుగు సినిమాని, నలుపు తెలుపు సినిమాల కాలం చెల్లిపోయి రంగుల సినిమాలు రాజ్యం చేస్తున్న కాలంలో నలుపు తెలుపు సినిమాని ఊహించగలమా? దాసరి ఊహించడమే కాదు, చేసి చూపించారు. అందరి చేతా ‘ఔరా’ అనిపించారు. ఆ సినిమా ‘నీడ’.

స్పెషల్‌: దర్శక శిఖరం దాసరి నాలుగో వర్ధంతి!

సర్దార్‌ పాపారాయుడు (1980)

స్వాతంత్య్ర సమరంలో సర్వస్వాన్నీ త్యాగం చేసిన ఒక సమరయోధుడు, స్వాతంత్య్రం వచ్చిన ముప్పై ఏళ్ల తర్వాత సమాజంలోకి వచ్చి, ఆ స్వాతంత్య్ర ఫలాలు దుర్వినియోగం అవుతుంటే ఎలా స్పందించాడనే కథతో దాసరి రూపొందించిన ‘సర్దార్‌ పాపారాయుడు’ సినిమా ఒక చరిత్ర. చిన్న చిత్రాల నిర్మాత క్రాంతికుమార్‌ నిర్మించిన తొలి పెద్ద సినిమా ఇదే. టైటిల్‌ రోల్‌లో ఎన్టీఆర్‌ నటన అపూర్వం. ఆయన కొడుకు పాత్రను కూడా ఆయనే చేశారు. తండ్రీ కొడుకులు తొలిసారి కలుసుకొనే సన్నివేశం ఒక్కటి చాలు దాసరి దర్శకత్వ ప్రతిభ ఏ స్థాయిదో చెప్పడానికి. హైదరాబాద్‌, విజయవాడ కేంద్రాల్లో 300 రోజులు ఆడి బాక్సాఫీస్‌ వద్ద గట్టి ముద్ర వేసింది ఈ సినిమా.

బొబ్బిలిపులి (1982)
అటు ఎన్టీఆర్‌, ఇటు దాసరి కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిన సినిమా ‘బొబ్బిలిపులి’. సమాజాన్ని ప్రక్షాళన చేయాలనే కథాంశానికి దేశభక్తిని మిళితంచేసి దాసరి రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు సృష్టించింది. వ్యవస్థలోని అక్రమాలపై తిరుగుబాటు చేసిన మేజర్‌ చక్రధర్‌ పాత్రలో టైటిల్‌ రోల్‌లో ఎన్టీఆర్‌ నటన చూసి తీరాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్‌ రాజకీయ జీవితానికి ఈ సినిమా ఊపునిచ్చింది. విడుదలలో సెన్సార్‌ సమస్యల్ని ఎదుర్కొన్నప్పటికీ, ఎట్టకేలకు బయటపడి, తొలిసారి వందకు థియేటర్లలో విడుదలైన చిత్రంగా చరిత్రకెక్కిన ‘బొబ్బిలిపులి’ది కలెక్షన్ల విషయంలోనూ, ఆడియో కేసెట్ల అమ్మకాల్లోనూ చరిత్రను తిరగరాసింది.

మేఘసందేశం (1982)
ఏ నటుడికైనా 200వ సినిమా అనేది ఒక మైలురాయి లాంటిది. ఆ స్థాయిలో ఆ సినిమా పేరు తెచ్చుకొంటే ఆ నటుడికి ఇంకెంత తృప్తి. అలాంటి తృప్తిని అక్కినేని నాగేశ్వరరావుకు కలిగించిన చిత్రం ‘మేఘసందేశం’. అక్కినేనికి అలాంటి క్లాసిక్‌ ఫిల్మ్‌ను అందించిన ఘనతను సొంతం చేసుకున్న దర్శకుడు దాసరి. అపురూప సంగీత దృశ్యకావ్యంగా ‘మేఘసందేశం’ను తీర్చిదిద్ది దర్శకుడిగా తనేమిటో మరోసారి రుజువు చేసుకున్నారు దాసరి. పెళ్లయిన ఒక భావకవి ఒక నర్తకి ప్రేమలో పడి, ఆమెతో సహజీవనం చేస్తూ, తర్వాత పెళ్లినాటి ప్రమాణాలు జ్ఞాపకమొచ్చి ఎలా కుమిలిపోయాడు, భార్య చేతుల్లో అతను కనుమూస్తే, అతడ్ని ప్రాణప్రదంగా ప్రేమించిన నర్తకి పద్మ కూడా ఎలా కన్నుమూసిందనే ఇతివృత్తం అభిరుచి కలిగిన ప్రేక్షకుల్ని కదిలించింది. ఆర్థిక విజయం సాధించకపోయినా, తొమ్మిది నంది అవార్డులతో పాటు జాతీయ స్థాయిలో ప్రాంతీయ ఉత్తమ చిత్రం అవార్డును సాధించింది ‘మేఘసందేశం’.

స్పెషల్‌: దర్శక శిఖరం దాసరి నాలుగో వర్ధంతి!

బుల్లితెర విశ్వామిత్ర...
బుల్లితెరపైనా దాసరి తొలి రోజుల్లోనే తన ప్రతిభ చూపించారు. రామానంద్‌ సాగర్‌ రామాయణ్‌ లాంటి పౌరాణిక సీరియల్స్‌ దేశాన్ని ఊపేస్తున్న రోజుల్లో దూరదర్శన్‌లో దాసరి విశ్వామిత్ర పేరిట హిందీ సీరియల్‌ రూపొందించడం ఒక సెన్సేషన్‌. దూరదర్శన్‌లో పదమూడు వారాల పాటు ఆ సీరియల్‌ అలరించింది. ఆ తరువాత ఉపగ్రహ టీవీ చానళ్ళు వచ్చిన తరువాత వందలకొద్దీ ఎపిసోడ్లతో అభిషేకం, గోకులంలో సీత లాంటి మెగా సీరియల్స్‌ తీసి అందులోనూ సూపర్‌ హిట్‌ అనిపించుకున్నారు.

కార్మిక నేతగా, పత్రికల అధినేతగా, రాజకీయ నేత, దాసరి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆయన దర్శకత్వం వహించిన 150 చిత్రాల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. దాసరి  రాజకీయ శక్తిగానూ ఎదిగారు. ఆయన పుట్టినరోజును దర్శకులంతా డైరెక్టర్స్‌ డేగా ప్రకటించి ఆ రోజున వేడుగా నిర్వహిస్తారు. అయితే దాసరి చివరి కోరిక ఆయన బయోగ్రఫీ రాయడం. అది మాత్రం పూర్తి కాలేదు. 

స్పెషల్‌: దర్శక శిఖరం దాసరి నాలుగో వర్ధంతి!


స్పెషల్‌: దర్శక శిఖరం దాసరి నాలుగో వర్ధంతి!AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.