ఆ పాట రాసిందెవరు?

ABN , First Publish Date - 2021-02-14T18:29:09+05:30 IST

కృష్ణంరాజు, జయప్రద జంటగా దాసరి నారాయణరావు తీసిన చిత్రం ‘సీతారాములు’. ఈ చిత్రకథనే అటుఇటు మార్చి రజనీకాంత్‌, విజయశాంతి జంటగా తమిళంలో ‘మన్నన్‌’ తీశారు. ఇదే సినిమా హక్కులు కొని...

ఆ పాట రాసిందెవరు?

‘తొలిసంజ వేళలో... తొలిపొద్దు పొడుపులో..’ పాటను ఎప్పుడు రేడియోలో విన్నాసరే... అలనాడు రగిలిన ఒక వివాదం గుర్తుకొస్తుంది.

కృష్ణంరాజు, జయప్రద జంటగా దాసరి నారాయణరావు తీసిన  చిత్రం ‘సీతారాములు’. ఈ చిత్రకథనే అటుఇటు మార్చి రజనీకాంత్‌, విజయశాంతి జంటగా తమిళంలో ‘మన్నన్‌’ తీశారు. ఇదే సినిమా హక్కులు కొని చిరంజీవి, నగ్మాలతో తెలుగులో ‘ఘరానా మొగుడు’ తీశారు. ‘సీతారాములు’లోని పాటలన్నీ హృదయానికి హత్తుకునేవే. ముఖ్యంగా కన్యాకుమారిలో చిత్రీకరించిన ‘తొలి సంజ వేళలో.. తొలి పొద్దు పొడుపులో’ పాట సంగీతప్రియులను మరింత ఆకట్టుకొంది. చిత్ర దర్శకుడు దాసరి ఈ పాటను రాసినట్లు ప్రకటించుకున్నారు. అదుగో... సరిగ్గా అక్కడే వివాదం మొదలైంది. ఆ పాటను దాసరి రాయలేదనీ, దేవులపల్లి కృష్ణశాస్ర్తి రాసిస్తే, అది తన పాటగా దాసరి చెప్పుకున్నాడనీ ఆ రోజుల్లో ప్రచారం జరిగింది. దేవులపల్లి రాసిన చివరి పాట ఇదేనని కూడా అప్పట్లో వాదించారు కొందరు. ఈ విషయంపై కొన్ని రోజులపాటు వాదోపవాదాలు జరిగాయి. పాట రాసిన తర్వాత దేవులపల్లి మరణించడం, ఆయన బంధువులు కూడా ఎవరూ ఈ విషయం మీద మాట్లాడకపోవడంతో విమర్శకులకు మంచి సాకు దొరికినట్లయింది. దాసరిని ప్రశ్నించే ధైర్యం వారికి లేకపోవడం వల్లే వారు నోరు మెదపడం లేదంటూ దేవులపల్లిని సపోర్ట్‌ చేస్తూ కొందరు, దాసరిని వెనకేసుకు వస్తూ మరికొందరు ఈ పాట వివాదం ముదరడానికి ఆజ్యం పోశారు. చివరికి నిర్మాత జయకృష్ణ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందో వివరణ ఇచ్చారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి తమ మీద అభిమానంతో ఓ పాట రాసి ఇచ్చారనీ, దురదృష్టవశాత్తూ అది ఆయన చివరి గీతం అయిందని వివరించారు జయకృష్ణ. ‘కలలొచ్చే వేళ ఇది’ అనే పల్లవితో ఆ పాట ఉంటుంది. అలాగే ఆచార్య ఆత్రేయ కూడా కొన్ని పాటలు రాశారనీ, కొన్ని కారణాల వల్ల రికార్డ్‌ చేసిన పాటలను కూడా సినిమాలో వాడలేదని చెప్పాడాయన. అదేవిధంగా దేవులపల్లి రాసిన చివరి పాట ‘కలలొచ్చే వేళ ఇది’ పాటను రికార్డ్‌ చేసి కూడా సినిమాలో ఉపయోగించలేదన్నారు. 


దాసరి స్వతహాగా రచయిత. మాటలే కాకుండా పాటలు కూడా రాయగల సమర్థుడు. ఒకరు రాసిన పాటను తన పాటగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదని కూడా జయకృష్ణ ప్రకటించారు. ఇక సినిమాలో మాత్రం ‘తొలిసంజ వేళలో.. తొలి పొద్దు పొడుపులో’ పాట పెద్ద హిట్‌ అయింది. ‘సీతారాములు’ సినిమా కూడా సూపర్‌హిట్‌ చిత్రాల సరసన చేరింది. ఆ పాట మాత్రం వివాదాస్పదంగా మిగిలిపోయింది. 

- వినాయకరావు

Updated Date - 2021-02-14T18:29:09+05:30 IST