దాసరి జీవిత సంఘటనలతో దర్శకరత్న

ABN , First Publish Date - 2022-01-17T06:27:33+05:30 IST

బహుముఖ ప్రజ్ఞాశాలిగా, అందరివాడుగా పేరొందిన దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జీవితంలోని కొన్ని సంఘటనల సమాహారంగా ‘దర్శకరత్న’ పేరుతో ఓ సినిమా...

దాసరి జీవిత సంఘటనలతో దర్శకరత్న

బహుముఖ ప్రజ్ఞాశాలిగా, అందరివాడుగా పేరొందిన దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జీవితంలోని కొన్ని సంఘటనల సమాహారంగా ‘దర్శకరత్న’ పేరుతో ఓ సినిమా తీయనున్నట్లు నిర్మాత తాడివాక రమేశ్‌నాయుడు ప్రకటించారు. సీనియర్‌ దర్శకుడు, దాసరికి అత్యంత సన్నిహితుడు ధవళ సత్యం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు ధవళ సత్యం మాట్లాడుతూ ‘దాసరిగారితో నాకున్న అనుబంధం ఈ చిత్రం తీయడానికి పురికొల్పింది. ఆయన జీవితంలో నేను చూసిన సంఘటనలతో పాటు, ఆయనతో అనుబంధం కలిగిన అనేకమందిని సంప్రదించి, ఈ చిత్రం స్ర్కిప్ట్‌ తయారు చేస్తాం. దాసరిగారంటే ఎంతో అభిమానం కలిగిన నిర్మాత తాడివాక రమేశ్‌ నాయుడు ఈ చిత్రం తీయడానికి ముందుకు రావడం అభినందనీయం. ‘దర్శకరత్న’ను ఒక గొప్ప చిత్రంగా రూపొందించాలని మా ప్రయత్నం’ అన్నారు. నిర్మాత రమేశ్‌నాయుడు మాట్లాడుతూ ‘జాతీయ స్థాయి నటుడు ఈ చిత్రంలో దాసరి పాత్ర పోషిస్తారు. అలాగే దాసరి పద్మ పాత్రను కూడా గుర్తింపు కలిగిన నటి పోషిస్తారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తాం. ఎక్కడా రాజీపడకుండా సినిమా తీస్తాం’ అని తెలిపారు. 

Updated Date - 2022-01-17T06:27:33+05:30 IST