కరోనా విరామంలో ‘కొండపొలం’ చేశా!

ABN , First Publish Date - 2021-10-07T06:07:52+05:30 IST

‘‘హిందీ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పుడు కరోనా లాక్‌డౌన్‌ వచ్చింది. ముంబైలోని ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో క్రిష్‌ ఫోన్‌ చేసి ఈ కథ గురించి చెప్పారు....

కరోనా విరామంలో ‘కొండపొలం’ చేశా!

‘‘హిందీ చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పుడు కరోనా లాక్‌డౌన్‌ వచ్చింది. ముంబైలోని ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో క్రిష్‌ ఫోన్‌ చేసి ఈ కథ గురించి చెప్పారు. లాక్‌డౌన్‌ తొలగించిన తర్వాత తొలి ఫ్లయిట్‌కు హైదరాబాద్‌ వచ్చాను. క్రిష్‌ కథ పూర్తిగా చెప్పారు. నచ్చింది. కానీ, డేట్స్‌ ఎలా అడ్జస్ట్‌ చేయాలని ఆలోచిస్తుంటే... వెంటనే చిత్రీకరణ ప్రారంభిస్తానని చెప్పారు. అప్పటికి ముంబైలో హిందీ చిత్రాలు ప్రారంభం కాలేదు. అలా... కరోనా వల్ల హిందీ చిత్రాలకు వచ్చిన విరామంలో ఈ సినిమా చేశా’’ అని రకుల్‌ అన్నారు. వైష్ణవ్‌తేజ్‌కు జోడీగా ఆమె నటించిన చిత్రం ‘కొండపొలం’. క్రిష్‌ దర్శకుడు. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. శుక్రవారం సినిమా విడుదలవుతోంది. రకుల్‌ చెప్పిన ముచ్చట్లు...


‘‘నేను ఇంతకు ముందు ‘కరెంట్‌ తీగ’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’, ‘ఖాకి’ చిత్రాల్లో పల్లెటూరి అమ్మాయిగా నటించా. అయితే, అందుకు భిన్నంగా గొర్రెలు కాసే అమ్మాయిగా ‘కొండపొలం’లో నటించా. 


సినిమా అంగీకరించాక... లుక్‌ ఎలా ఉండాలని ఆలోచించాం. గొర్రెల కాపరులు ఎండలో తిరుగుతారు. ఎక్కువరోజులు ఒకే దుస్తులు వేసుకుంటారు. కాబట్టి... రంగు తక్కువ కనిపించాలని స్కిన్‌ ట్యాన్‌ చేశాం. కాస్ట్యూమ్స్‌ ఐదారుసార్లు ఉతికి వేసుకున్నా.- మినీ జంగిల్‌ బుక్‌లాంటి చిత్రమిది. వికారాబాద్‌ అడవుల్లో ఎక్కువశాతం చిత్రీకరణ చేశాం. లొకేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో కేర్‌వ్యాన్‌ ఉండేది. నేను భోజనం చేయడానికి నడుచుకుంటూ వచ్చి వెళ్లేదాన్ని. ట్రెక్కింగ్‌ చేసినట్టు... అలా వర్కౌట్స్‌ చేసేదాన్ని.


అడవిలో చిత్రీకరణ ఓ ఎగ్జైట్‌మెంట్‌ అయితే... గొర్రెల మధ్యలో చేయడం మరో టాస్క్‌. సాయంత్రానికి వైష్ణవ్‌, నా దగ్గర గొర్రెల వాసన వచ్చేది. చిత్రీకరణ ప్రారంభించిన నాలుగు రోజులకు గొర్రెలను ఎలా అదుపులో పెట్టాలో నాకు వచ్చేసింది. రాత్రి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు తెరకెక్కించడానికి ఉదయం నాలుగున్నరకు నిద్రలేవడం మరో అనుభూతి. సినిమా కోసం నేనూ సీమ యాస నేర్చుకున్నా. అయితే, హిందీ చిత్రీకరణలో బిజీగా ఉండటంతో డబ్బింగ్‌ చెప్పడం కుదరలేదు.


వైష్ణవ్‌ తేజ్‌కు రెండో చిత్రమైనా చాలా బాగా నటించాడు. తన కళ్లు పవర్‌ఫుల్‌గా, ఎక్స్‌ప్రెస్సివ్‌గా ఉంటాయి. ప్రతి విషయాన్ని గమనిస్తాడు. తనలో నేర్చుకోవాలనే తపన ఉంది. నేను ఎక్కువ చిత్రాలు చేసినా... నటనలో టిప్స్‌ ఏమీ ఇవ్వలేదు. క్రిష్‌లాంటి దర్శకుడు ఉన్నప్పుడు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.


వచ్చే ఏడాది నేను నటించిన ఆరు హిందీ చిత్రాలు విడుదల కానున్నాయి. వాటి ఫలితాలు చూసి కొత్త చిత్రాలు అంగీకరిస్తా. కథలు నచ్చితే... తెలుగు, తమిళ భాషల్లోనూ నటించడానికి రెడీ. హిందీ చిత్రాలే చేస్తున్నానని, తెలుగులో చేయడం లేదంటే ఒప్పుకోను.’’


Updated Date - 2021-10-07T06:07:52+05:30 IST