కరోనా ముంగిట... ఎటూ కదల్లేక!

కథ... సిద్ధం చేశారు. కథనం... పక్కాగా రాశారు.

కథానాయకుడు... పచ్చ జెండా ఊపేశారు.

కాసులు పెట్టే నిర్మాత... నమ్మకం ఉంచారు.

కానీ...??? ‘స్టార్‌... కెమెరా... యాక్షన్‌’ అని

ఈ దర్శకులు చెప్పడానికి టైమ్‌ పట్టేలా ఉంది!

దీనికి కారణం కొవిడ్‌-19 మహమ్మారి! కరోనా ముంగిట... ఎటూ కదల్లేక...

ఈ దర్శకులు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. కెరీర్‌ కొంత విరామం ఇస్తే...

కరోనా ఆ విరామ సమయాన్ని పొడిగిస్తోంది.


చిరంజీవితో ‘వేదాలం’ రీమేక్‌ చేసే అవకాశం మెహర్‌ రమేశ్‌కు వచ్చింది. మామూలుగా అయితే ఈపాటికి సినిమా సెట్స్‌ మీదకు వెళ్లేది. కరోనా కారణంగా ‘ఆచార్య’ ఆలస్యం కావడం, మెహర్‌ రమేశ్‌కు మరికొన్నాళ్ల నిరీక్షణ తప్పదు. ‘షాడో’ (2013) తర్వాత ఆయన చేస్తున్న చిత్రమిది. ఎనిమిదేళ్ల తర్వాత అవకాశం వచ్చినా... ‘స్టార్ట్‌... కెమెరా... యాక్షన్‌’ అని చెప్పడానికి మరికొన్నాళ్లు ఎదురు చూడాలి. ఇంత విరామం తర్వాత అవకాశం అందుకున్న దర్శకుడు ప్రస్తుతం తెలుగులో ఆయనే ఏమో! ఒకవేళ ‘లూసిఫర్‌’ రీమేక్‌ ముందు మొదలైతే... ఆయన సినిమా ఇంకొంత ఆలస్యం అవుతుంది.


‘సోగ్గాడే చిన్ని నాయనా’తో దర్శకుడిగా పరిచయమైన కల్యాణ్‌కృష్ణ, తొలి సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. రెండో సినిమా ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సైతం హిట్‌. కానీ, ఆ తర్వాత చేసిన ‘నేల టికెట్‌’ (2018) ఫ్లాప్‌. అయితే, ఆ ఎఫెక్ట్‌ కల్యాణ్‌కృష్ణ మీద పడలేదు. వెంటనే ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్‌ ‘బంగార్రాజు’ చేసే అవకాశం అందుకున్నారు. ఎప్పుడు చేసినా... సంక్రాంతి విడుదలే లక్ష్యంగా సినిమా చేస్తానని నాగార్జున చెబుతున్నారు. ఇప్పుడీ కరోనా ఎఫెక్ట్‌ వల్ల సినిమా ఆలస్యమయ్యేలా ఉంది. ఎందుకంటే... ఆల్రెడీ ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా ప్రారంభించారు.


తెలుగు తెరపై విజయవంతమైన రచయితల్లో వక్కంతం వంశీ ఒకరు. ‘కిక్‌’, ‘ఎవడు’, ‘రేసుగుర్రం’, ‘టెంపర్‌’ చిత్రాల్లో ఆయన కలం కృషి ఉంది. అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా’ (2018)తో వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమయ్యారు. అది ఆశించిన విజయం సాధించలేదు. కానీ, నితిన్‌ హీరోగా ‘ఠాగూర్‌’ మధు నిర్మాణంలో సినిమా చేసే అవకాశం అందుకున్నారు. కరోనా వల్ల అదీ ఆలస్యంగా సెట్స్‌ మీదకు వెళ్లే పరిస్థితి. హీరోలకు కమర్షియల్‌ సక్సెస్‌లు అందించిన దర్శకుడు వీవీ వినాయక్‌. ‘ఇంటిలిజెంట్‌’ ఫ్లాప్‌ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా బాలీవుడ్‌లో ‘ఛత్రపతి’ రీమేక్‌ చేసే చేసే అవకాశం అందుకున్నారు. కరోనా కారణంగా సెట్స్‌ మీదకు వెళ్లని సినిమాల ఖాతాలో అదీ ఉంది.


ఒకప్పుడు వరుస విజయాలకు శ్రీను వైట్ల చిరునామా. అయితే... ‘బాద్‌షా’ తర్వాత ఆయన చేసిన చిత్రాలు అంతంతమాత్రంగా ఆడాయి. అయితే, శ్రీను వైట్ల ప్రతిభపై విష్ణు మంచు నమ్మకం ఉంచారు. తనకు ‘ఢీ’ లాంటి మంచి హిట్‌ ఇచ్చిన దర్శకుడితో, దానికి సీక్వెల్‌గా ‘ఢీ ్క్ష ఢీ’ (డబుల్‌ డోస్‌) చేయడానికి సిద్ధమయ్యారు. కరోనా వల్ల ఇప్పుడీ సినిమా సైతం సెట్స్‌ మీదకు వెళ్లలేదు. ‘నేనే రాజు నేనే మంత్రి’తో దర్శకుడు తేజ మళ్లీ మునుపటి ఫామ్‌లోకి వచ్చారు. అయితే, ఆయన జోరుకు ‘సీత’ బ్రేకులు వేసింది. దాంతో సంబంధం లేకుండా ఓ వెబ్‌ సిరీస్‌ చేశారు. గోపీచంద్‌తో ‘అలిమేలు మంగ వెంకటరమణ’, రానా దగ్గుబాటితో ‘రాక్షసరాజు రావణాసురుడు’, ‘చిత్రం 1.1’, సురేశ్‌బాబు రెండో కుమారుడు - రానా తమ్ముడు అభిరామ్‌ను హీరోగా పరిచయం చేసే చిత్రం... మొత్తం నాలుగు కథలను తేజ సిద్ధం చేశారు. ఆయన్ను సెట్స్‌కు వెళ్లకుండా కరోనా అడ్డుకుంది.


‘జత కలిసే’(2015), ‘విజేత’ (2018) చిత్రాల దర్శకుడు రాకేశ్‌ శశికి, అల్లు శిరీశ్‌ ఓ చిత్రం చేసే అవకాశం వచ్చిందని సమాచారం. అదీ మొదలు కావడానికి టైమ్‌ పడుతుంది. ‘హలో గురు ప్రేమ కోసమే’ తర్వాత రవితేజతో త్రినాథరావు నక్కినకు సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే, ‘ఖిలాడి’తో పాటు శరత్‌ మండవ దర్శకత్వంలో సినిమా పూర్తయ్యే వరకూ ఆయన వెయిట్‌ చేయాలట. ‘చుట్టాలబ్బాయి’ (2016) తర్వాత దర్శకుడు వీరభద్రమ్‌ చౌదరికి ఐదేళ్లు విరామం వచ్చింది. ఈమధ్యే ఆది సాయికుమార్‌ హీరోగా ఓ సినిమా ఓకే అయ్యింది. ఇదొక్కటే కాకుండా... ఆది చేతిలో ఇంకొన్ని చిత్రాలు ఉన్నాయి. మరి, ఆయన సినిమా ఎప్పుడు సెట్స్‌ మీదకు వెళుతుందో? ఈ జాబితాలో ఇంకొందరు చిన్న దర్శకులు ఉన్నారు.


జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుని సెట్స్‌ మీదకు వెళ్లిన శ్రీకాంత్‌ అడ్డాల (నారప్ప), క్రిష్‌ (హరి హర వీరమల్లు), సుధీర్‌ వర్మ (కొరియన్‌ సినిమా మిడ్‌నైట్‌ రన్నర్స్‌ రీమేక్‌), చందూ మొండేటి (కార్తికేయ 2), మోహనకృష్ణ ఇంద్రగంటి (సుధీర్‌బాబుతో సినిమా) తదితరులు కొత్త సినిమాలతో సత్తా చాటడానికి వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.


‘గెలుపేముందిరా! మహా అయితే... ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు... ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది’ - ఓ తెలుగు చిత్రంలో సంభాషణ. నిజమే... సినిమా విజయవంతమైతే దర్శకులకు వెంటనే అవకాశాలొస్తాయి. అదే పరాజయమైతే... కొంత సమయం పడుతుంది. కర్ణుడి చావుకు వెయ్యి కారణాలన్నట్టు... సినిమా పరాజయానికి కారణాలు ఏమైనా? దర్శకుడిపై ఎక్కువ ప్రభావం పడుతుంది. మరో సినిమా అవకాశం రావడానికి సమయం పడుతుంది. ఈ దర్శకులకు అవకాశాలు వచ్చాయి. కానీ, కరోనా కారణంగా ఆయా హీరోలు చేస్తున్న సినిమాలు పూర్తవడం ఆలస్యం అవుతుండటంతో ఏమీ చేయలేని పరిస్థితి. కరోనా ముంగిట... ఎటూ కదల్లేక... సినిమా ఎప్పుడు సెట్స్‌ మీదకు వెళ్తుందా? అని ఎదురు చూస్తున్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు... సినిమాకు అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ తమ ప్రతిభను నిరూపించుకునేందుకు పాపం  వీళ్లకు నిరీక్షణ తప్పడం లేదు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.