ఆయన కోపానికి ‘కలికాలం’ బలైంది

సహజనటి జయసుధ జె.ఎస్‌.కె. కంబైన్స్‌ బ్యానర్‌పై నిర్మించిన చిత్రాల్లో ‘కలికాలం’ ఒకటి. ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర నిర్మాణం వెనుక ఓ కథ ఉంది. సినిమా విడుదలయ్యాక వివాదం రాజు కుంది. కథ తయారయ్యాక ముత్యాల సుబ్బయ్య చాలా మంది నిర్మాతలకు చెప్పారు. కానీ అందులో సెంటిమెంట్‌ ఎక్కువ ఉండడంతో తీయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు తన మిత్రుడు శ్రీనివాసరెడ్డికి ఈ కథ చెబితే సినిమా తీయడానికి ఒప్పుకొన్నారాయన. ఇందులో ప్రధాన పాత్ర జయసుధ పోషిస్తే బాగుంటుందని ముత్యాల సుబ్బయ్యకు అనిపించింది. అంతవరకూ ఆమెతో సినిమా చేసే అవకాశం ఆయనకు రాలేదు. అయితే ఆ సమయంలో ఆర్టిస్ట్‌గా జయసుధకు కొంత గ్యాప్‌ వచ్చింది. ఆమె నటించిన సినిమా విడుదలై రెండున్నర ఏళ్లయింది. 

‘కలికాలం’ కథ నచ్చితే ఆమె తిరిగి నటించడానికి అంగీకరిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే రచయిత తోటపల్లి మధుని వెంట బెట్టుకుని జయసుధ ఇంటికి వెళ్లారు ముత్యాల సుబ్బయ్య. మధు చెప్పిన కథను జయసుధ విన్నారు. అయితే బాగుందని కానీ బాగోలేదని కానీ వెంటనే ఆమె చెప్పలేదు. ‘సుబ్బయ్య గారూ.. నాకు కొంచెం టైమ్‌ కావాలి. రెండు రోజుల్లో ఆలోచించి చెబుతాను’ అన్నారామె. రెండు రోజుల తర్వాత జయసుధ ఇంటికి వెళితే ఆమె సూటిగా విషయానికి వస్తూ ‘సుబ్బయ్యగారూ.. మా బ్యానరులో సినిమా తీసి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు మళ్లీ  ప్రొడక్షన్‌ మొదలు పెడదాం అనుకుంటున్నాం.. కథల కోసం వెదుకుతున్నాం. అలాగే మంచి పాత్రలు దొరక్క ఆర్టిస్టుగా నేను కూడా కొంత గ్యాప్‌ తీసుకున్నాను. కథ నచ్చింది. మీరు ఒప్పుకుంటే మా బ్యానరులోనే తీద్దాం. అందులో నేను నటిస్తాను’ అన్నారు. ఈ విషయం తన మిత్రుడు శ్రీనివాసరెడ్డికి చెప్పారు ముత్యాల సుబ్బయ్య. ఆయన ఒప్పుకోవడంతో జయసుధ నిర్మాతగా ‘కలికాలం’ చిత్రం మొదలైంది. రూ.35 లక్షల్లో ఈ సినిమా పూర్తి అయ్యింది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేశారు. 1991లో ‘కలికాలం’ విడుదలైంది. 

ఇక ఈ సినిమాకు సంబంధించిన వివాదం విషయానికి వస్తే.. చెన్నైలో కళాసాగర్‌ అనే సాంస్కృతిక సంస్థ ఉండేది. దానికి అధ్యక్షుడు ఎమ్మెస్‌ రెడ్డి. పరిశ్రమలోని ప్రతిభావంతులను గుర్తించి ఏటా అవార్డులు అందజేసి కళాసాగర్‌ సంస్థ ప్రోత్సహించేది. ఆ సంస్థ ఇచ్చే అవార్డులకు ఎంతో విలువ ఉండేది. ‘కలికాలం’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్యకు, ఉత్తమ సహాయ నటిగా జయసుధకు అవార్డులు ప్రకటించింది కళాసాగర్‌ సంస్థ. అయితే ‘ఆ సినిమాలో నేను హీరోయిన్‌గా నటించాను. ఇస్తే ఉత్తమ నటి అవార్డు ఇవ్వాలి. లేకపోతే మానెయ్యాలి. ఉత్తమ సహాయ నటి అవార్డు ప్రకటించి నన్ను అవమాన పరచడం దేనికి?’ అని జయసుధ ఆ అవార్డును తిరస్కరించారు. దాంతో ఎమ్మెస్‌ రెడ్డికి కోపం వచ్చింది. ‘నా నిర్ణయాన్ని జయసుధ తప్పు పడుతుందా’ అని ఆగ్రహించారు. కానీ ఆయన బయటపడలేదు. తన కోపాన్ని మనసులోనే దాచుకున్నారు. కట్‌ చేస్తే... 1990 నంది అవార్డుల కమిటీకి ఎమ్మెస్‌ రెడ్డి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. జయసుధ మీద కోపంతో ఆయన ‘కలికాలం’ సినిమాను అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకోలేదు. దానికి ఒక్క అవార్డు కూడా రాకుండా చేశారు. అలా ఆయన కోపానికి ‘కలికాలం’ బలైంది. 

-వినాయకరావు

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.