రావడం పక్కా... రిలీజే లేటు

ABN , First Publish Date - 2021-07-11T06:08:30+05:30 IST

మంచి ఆరంభం ఉంటే సగం విజయం సాధించినట్టే అంటుంటారు. ఇప్పటికే తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చేసిన పలువురు కథానాయికలూ అదే కోరుకుంటున్నారు.

రావడం పక్కా... రిలీజే లేటు

మంచి ఆరంభం ఉంటే  సగం విజయం సాధించినట్టే అంటుంటారు. ఇప్పటికే తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చేసిన  పలువురు కథానాయికలూ  అదే కోరుకుంటున్నారు. కానీ  కరోనా వారి ఆశలకు అడుగడుగునా అడ్డం పడుతోందిసెట్స్‌పై ఉన్న తమ సినిమాలు స్ర్కీన్‌  మీదకు ఎప్పుడు వస్తాయా అని వారంతా  ఆశగా ఎదురు చూస్తున్నారు  కెరీర్‌ను  డిసైడ్‌ చేసే తొలి చిత్రం విడుదలపై కథానాయికలకు ఉత్కంఠత ఉండడం  సహజమే.అలాగే పరభాషా చిత్రాల్లోకి ఇచ్చే ఎంట్రీ గ్రాండ్‌గా ఉండాలనే ఆశ కూడా వారిలో ఉంటుంది. కరోనా అటువంటి వారి ఆశలకు గండి కొట్టింది. కరోనా కారణంగా నిర్మాణంలో ఉన్న చిత్రాలు ఆగిపోవడం, పూర్తయిన చిత్రాల విడుదలకు బ్రేక్‌ పడడం,  థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోకపోవడం, కరోనా  మూడో దశ ఆందోళనలు.... వెరసి కథానాయికల తొలి చిత్రం విడుదలను మరింత ఆలస్యం చేస్తున్నాయి. 


ఎప్పుడెప్పుడు...

కొన్ని చిత్రాలే చేసినా  తమిళనాట కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తాన్యా రవిచంద్రన్‌. ఐదేళ్ల క్రితమే తమిళంలో కథానాయికగా కెరీర్‌ ప్రారంభించిన తాన్యా ఈ ఏడాది టాలీవుడ్‌ అరంగేట్రం చేయనున్నారు. కార్తికేయ సరసన ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘రాజా విక్రమార్క’. ఇంకో పది శాతం షూటింగ్‌ మాత్రమే పెండింగ్‌ ఉంది. అది పూర్తయితే తాన్యా రవిచంద్రన్‌ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తారు.


రిలీజ్‌ లేకుండానే... 

చ్చట వాహనములు నిలుపరాదు’, ‘ఖిలాడి’, ‘హిట్‌ 2’... ఇలా మూడు తెలుగు చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నారు హర్యానా భామ మీనాక్షి చౌధరి. అయితే ఈ మూడు చిత్రాల్లో ఒక్కటి కూడా ఇంతవరకూ  వెండితెరపైకి రాలేదు. రెండో దశ కరోనా లాక్‌డౌన్‌ అడ్డుపడకపోతే రవితేజ ‘ఖిలాడి’తో తెలుగు ప్రేక్షకులను పలకరించేవారు  మీనాక్షి చౌదరి. ఆ చిత్రం  దాదాపు పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. థియేటర్లు తెరుచుకొని పరిస్థితులు అనుకూలంగా ఉంటే ‘ఖిలాడి’తో తొలిసారి మీనాక్షి ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా. ఈ ఏడాది జనవరిలోనే ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ షూటింగ్‌ ప్రారంభమైంది. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో చిత్రీకరణ నెమ్మదిగా జరుగుతోంది. ఇక తాజాగా ఆమె ‘హిట్‌ 2’ చిత్రంలోనూ కథానాయికగా అవకాశం దక్కించుకున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకావాల్సి ఉంది. 


ఎదురు చూపులు తప్పవు

బాలీవుడ్‌ కథానాయిక అనన్యాపాండే విజయ్‌ దేవరకొండ సరసన కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘లైగర్‌’. తొలిచిత్రంతోనే స్టార్‌ కాంబో సెట్టయినా సినిమా చిత్రీకరణే  ఆలస్యం అవుతోంది. గతేడాది జనవరిలోనే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. 40 రోజుల తర్వాత లాక్‌డౌన్‌తో నిలిచిపోయింది. మళ్లీ తిరిగి ఈ ఏడాది ఆరంభంలో చిత్రీకరణ ప్రారంభమైనా కరోనా రెండో దశ లాక్‌డౌన్‌తో మళ్లీ ఆగిపోయింది. ‘లైగర్‌’ చిత్రీకరణ త్వరగా పూర్తయి, తెలుగు ప్రేక్షకుల ముందుకు వెళ్ళడం కోసం అనన్య ఆశగా ఎదురుచూస్తోంది.


అన్నీ అనుకున్నట్లుగా జరిగితే...? 

బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రణం రౌద్రం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో నటిస్తున్న  బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌ కోసం తెలుగు ప్రేక్షకులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రధారి రామ్‌చరణ్‌ జోడీగా గ్రామీణ యువతిగా అలియా కనిపిస్తున్నారు. ప్రస్తుతం చివరిషెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది. త్వరలోనే మళ్లీ ఆమె  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌లోకి అడుగుపెట్టనున్నారు.  అలియాభట్‌, రామ్‌చరణ్‌పై ఓ పాటను చిత్రీకరించాల్సి ఉంది. ముందు ప్రకటించిన విధంగా అక్టోబర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ థియేటర్లకు రావాలని  అభిమానులు కోరుకుంటున్నారు.  


మరింత ఆలస్యం 

2017లో మలయాళ చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చారు కథానాయిక ఐశ్వర్యాలక్ష్మి. రెండేళ్ల తర్వాత తమిళ చిత్రం ‘యాక్షన్‌’తో అక్కడ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా తెలుగు ఎంట్రీకి సిద్ధమయ్యారు. ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు.  సత్యదేవ్‌తో ‘గాడ్సే’ చిత్రం చేస్తు న్నారు. ఫిబ్రవరిలోనే ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. మధ్యలో లాక్‌డౌన్‌తో బ్రేక్‌ పడింది. వచ్చే నెల్లో మళ్లీ ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఆమె ప్రేక్షకుల ముందుకు రావడానికి  మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. 


మూడు చిత్రాలు చేస్తున్నా....

సోషల్‌ మీడియాలో డబ్‌స్మాష్‌ వీడియోల ద్వారా మంచి గుర్తింపు పొంది,  తెలుగు సినిమాలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు కేతిక శర్మ. ఆకాశ్‌ పూరి సరసన ఆమె నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్‌’. 2019లోనే ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైనా సినిమా మాత్రం ఇంకా విడుదల కాలేదు.  ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే నాగశౌర్య సరసన ‘లక్ష్య’ చిత్రంలో కేతిక అవకాశం దక్కించుకున్నారు. ఈ చిత్రం గతేడాదే సెట్స్‌పైకి వెళ్లింది. మధ్యలో లాక్‌డౌన్‌తో చిత్రీకరణలో జాప్యం జరిగింది. అలాగే గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌ చిత్రంలోనూ ఆమె అవకాశం అందిపుచ్చుకున్నారు.  మూడు చిత్రాలు చేస్తున్నా కేతిక ప్రేక్షకుల ముందుకు వెళ్లడానికి ఆలస్యమవుతూనే ఉంది.


మరింత ఆలస్యమవుతుందా? 

రాఠా చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ కథానాయికగా పాపులర్‌ మిథిలా పాల్కర్‌. తమిళ చిత్రం ‘ఓ మై కడవులే’ తెలుగు రీమేక్‌తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అవుతున్నారు. విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌లో సెట్స్‌ పైకి వెళ్లింది. చిత్రీకరణకు కరోనా లాక్‌డౌన్‌ బ్రేక్‌ వేసింది. మరోవైపు విష్వక్‌ ఇతర చిత్రాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందనే విషయంలో స్పష్టత లేదు. 


మేజర్‌, గని .. ఏది ముందు?

తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మరో బాలీవుడ్‌ బామ సయీ మంజ్రేకర్‌. అడివి శేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘మేజర్‌’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. . 2019లోనే ఈ చిత్రాన్ని ప్రకటించారు. 2020 ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లింది. 2021 ద్వితీయార్థం గడిచిపోయినా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు. జూలై 2న విడుదల చేయనున్నట్టు ప్రకటించినా చిత్రీకరణ పూర్తికాక వాయిదా పడింది. అలా ఆమె తెలుగు అరంగేట్రానికి బ్రేక్‌పడింది. ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే ‘గని’ చిత్రంలో వరుణ్‌తేజ్‌ సరసన కథానాయికగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్‌ షూటింగ్‌ కొనసాగుతోంది. 

Updated Date - 2021-07-11T06:08:30+05:30 IST