ప్రకృతి ముందు చేతులు కట్టుకోవాల్సిందే..

ABN , First Publish Date - 2020-05-17T17:57:34+05:30 IST

హాస్యనటుడు అలీ చిక్కడు దొరకడు. మద్రాసుకు వెళ్లినప్పుడు సినిమా కష్టాలకు చిక్కలేదు. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు అంతస్థులకు దొరకలేదు. కానీ.. మానవత్వం చేతిలో బందీ అయ్యాడు. తనకున్నదాంట్లో....

ప్రకృతి ముందు చేతులు కట్టుకోవాల్సిందే..

హాస్యనటుడు అలీ చిక్కడు దొరకడు. మద్రాసుకు వెళ్లినప్పుడు సినిమా కష్టాలకు చిక్కలేదు. హైదరాబాద్‌కు వచ్చినప్పుడు అంతస్థులకు దొరకలేదు. కానీ.. మానవత్వం చేతిలో బందీ అయ్యాడు. తనకున్నదాంట్లో ఎంతో కొంత ఇతరులకు దానం చేస్తూ.. చిరునవ్వులు పూయిస్తున్నాడు. పవిత్ర రంజాన్‌ మాసంలో.. లాక్‌డౌన్‌ తీరికలో..  ఆత్మావలోకనం చేసుకుంటున్న అలీని పలకరించినప్పుడు చెప్పుకొచ్చారిలా..  


బతికితే చాలు..

ఇదేమి కరోనానండీ బాబూ.. ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో.. అంతుచిక్కడం లేదు. ఇక, దాని అంతుచూడటం దేవుడెరుగు. మనమేంటి? అగ్రరాజ్యలను సైతం గజగజ వణికిస్తోంది. ఇదివరకైతే నేను యమబిజీగా ఉండేవాణ్ణి. ఇప్పుడు రెండు నెలలు అయ్యింది. ఇంటికే పరిమితం. కాళ్లూ చేతులూ కట్టేసినట్లుంది. అడుగుబయట పెట్టడానికి లేదు. రోగాలు వచ్చినప్పుడు ఇంట్లో ఉండొచ్చు కానీ.. రోగానికి భయపడి ఇంటికే పరిమితం కావడం విచిత్రం. ప్రకృతి ముందు ఏమీ చేయలేం. చేతులు కట్టుకుని ఉండటం తప్ప! లాక్‌డౌన్‌ ఎత్తేసిన తరువాత.. ప్రజల ఆలోచనా దృక్పథంలో మార్పు వస్తుంది. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు.. తొందరగా ఇంటికెళ్లిపోయి.. హమ్మయ్యా బతుకుజీవుడా అనుకుంటున్నారు. బతికిబట్టకడితే అదే పదివేలు అన్నదే అందరి భావన.


భారమంతా ఆమెదే..

చెప్పుకుంటే తీరే బాధ కాదు.. లాక్‌డౌన్‌లో అందరికంటే భారం పడింది గృహిణులపైనే! ఎవరో ఎందుకు? నా భార్యనే తీసుకుంటే.. గిన్నెలు తోమడం దగ్గర నుంచి.. వంట చేయడం వరకు.. ఆమె చేతులు కందిపోయాయి. మా ఇంట్లోనే కాదు, అందరి ఇళ్లలోనూ ఇదే పరిస్థితి. ఇళ్లలో బందీ అయినందుకు మనం సహనం కోల్పోవచ్చు కానీ.. మహిళలు నిగ్రహంతో వ్యవహరిస్తున్నారు. ఇంటి పని, వంట పని, వృద్ధులు, పిల్లల బాగోగులు... ఒంటిచేత్తో చేస్తున్నారు. రోబో కూడా ఇంతగా శ్రమించలేదేమో?. అందుకే అమ్మలకు, అక్కచెల్లెళ్లకు రుణపడి ఉంటాం. వాళ్ల అలుపెరుగని సేవకు చేతులెత్తి దండం పెట్టాలి.


వంచకుల నటనకు..

సినిమా ఆర్టిస్టుల జీవితం ఎలా ఉంటుందంటే.. రేపటి గురించి ఆలోచన ఉండదు. ఈ రోజు ముఖ్యమనుకుంటారు. ఒకప్పుడు బాగా బతికిన వాళ్లు.. నేడు ఇబ్బందుల్లో కూరుకుపోయారు. వాళ్లు డబ్బు పోగొట్టుకోలేదు, పారేసుకోలేదు. ఒకరి చేతిలో నమ్మి మోసపోయారు. కన్నపేగు తెంచుకు పుట్టిన పిల్లలే.. ఉన్నదంతా లాగేసుకుని, బలవంతంగా ఆస్తుల్ని రాయించుకుని బయటకి తోసేస్తారు. ఎవరూ లేకపోతే చుట్టాలు, స్నేహితులు, సన్నిహితులు నమ్మించి మోసం చేస్తారు. మేం సినిమాల్లో కూటి కోసం నటిస్తే .. వంచకులు నిజజీవితంలో మోసగించడానికి నటిస్తారు. అలా పోగొట్టుకున్నవాళ్లే ఎక్కువ. లేకపోతే ఎవరి మాటలో నమ్మి.. సినిమాలు తీసి చేతులు కాల్చేసుకోవడం, ఎక్కడో భూమి కొనడం, దాన్ని వేరే వాళ్లు కబ్జా చేయడం.. ఇలా ముగిసిపోతున్నాయి సినీ కళాకారుల జీవితాలు. అందుకే గుండెపోట్లు, ఆత్మహత్యలు, అర్థాంతర చావులు. ఆ సంఘటనలను పాఠాలుగా తీసుకోకపోతే.. మనమూ నష్టపోతాం. 


అడిగినంత ఇవ్వను..

చిన్నప్పుడు ఎంతమంది ఎన్నిరకాలుగా సహాయం చేస్తే... ఇక్కడి వరకూ వచ్చాను? కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక చిన్న సహాయం ఆ మనిషిని ఆదుకుంటుంది. అందుకే, నలుగురికి సహాయం చేయాలన్న తపన నా హృదయంలో నిలిచిపోయింది. ఆ సాయంలో దొరికే సంతృప్తి ఇంకెందులోనూ లభించదు. కష్టంలో ఉన్న వ్యక్తి నా దగ్గరికి వచ్చి సహాయం కోరితే కాదనలేను. కాకపోతే, కొందరు అబద్ధాలు చెప్పి డబ్బులు కాజేశారు. మోసపోయాక బాధేసింది. కావాలనుకుంటే ఆ డబ్బును తిరిగి రాబట్టుకోవచ్చు. కానీ, ఓ దెబ్బ కొడితే ఎదుటి వ్యక్తి మరుక్షణం మరచిపోతాడు. అదే భగవంతుడు కొడితే జీవితాంతం గుర్తుంచుకుంటాడు. అందుకే సైలెంట్‌ అయిపోయా. అదో పాఠం అనుకుంటానంతే!. ఆ అనుభవంతో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎంత అడిగితే అంత దానం చేయకూడదని. ఎవరైనా పది రూపాయలు కావాలని అడిగితే.. మూడు రూపాయలే ఇస్తాను. తిరిగి ఇవ్వొద్దులే అంటాను.


పవిత్రమాసంలో..

లాక్‌డౌన్‌లో లక్షల మంది పేదలు తిండిలేక పస్తులుండే దీన పరిస్థితి. ఎవరి బాధ వారు పడుతున్నారు. పవిత్ర రంజాన్‌ మాసంలో పరులకు దానం చేయాలి. అది మన బాధ్యత. ఉన్నదాంట్లో ఎంతో కొంత సహాయం చేస్తే కొందరికైనా ఊరట లభిస్తుంది. రంజాన్‌ సమయంలో.. రోజూ చేసే అయిదు పూటల నమాజ్‌తో పాటు.. అదనంగా మరో ఇరవైసార్లు ప్రార్థనలు చేస్తే అల్లా మనం కోరుకున్నది ఇస్తాడని ఖురాన్‌ చెబుతోంది. ఎలాగూ పవిత్రమాసం వచ్చింది కాబట్టి.. సహాయం కోసం చేతులు ఎదురుచూస్తున్నాయి. వెళ్లి సాయం చేయాలంటుంది రంజాన్‌.


గుర్తుకొస్తున్నాయి..

మన బిజీ జీవితంలో పాత జ్ఞాపకాలు గుర్తుకురావు. ఇప్పుడు లాక్‌డౌన్‌ కదా! ఖాళీగా కూర్చున్నప్పుడు.. మన వెనకటి జీవితం గుర్తుకొస్తుంటుంది. కుటుంబసభ్యులతో కూడా సరదాగా పంచుకుంటుంటాం. లేకపోతే మన పిల్లలకు మనం పడిన కష్టాలు తెలీవు కదా. ఇప్పుడు బాగానే ఉన్నాను కానీ.. మద్రాసులో ఉన్నప్పుడు పడిన కష్టాలను తల్చుకుంటే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. నా జీవితానికి సరిపడా అనుభవాలు, పాఠాలు అప్పుడే నేర్చుకున్నాను.


పైసల కోసం ఇస్త్రీ చేశా

పది రూపాయల కోసం పస్తులున్న రోజుల్ని చూశాను. ఆ డబ్బు కోసం ఎంత ఆరాటపడ్డానో నాకు గురుతు. అప్పట్లో ఒక చొక్కా ఇస్త్రీ చేస్తే యాభై పైసలు, ప్యాంటుకు యాభై పైసలు. మేమే బట్టలు ఉతుక్కుని బండి వాడికి ఇస్త్రీ కోసం ఇచ్చేవాళ్లం. ఆ డబ్బుకూ కష్టమైపోయేది. ఆఖరికి నా బట్టలు నేనే ఇస్త్రీ చేసుకోవడం మొదలుపెట్టా. నా మిత్రుల బట్టలను కూడా ఇస్త్రీ చేసి డబ్బులు తీసుకునేవాడిని. మద్రాసులో నిలదొక్కుకోవడానికి ఆరేళ్లపాటు ఇలా ఎన్నో కష్టాలు పడ్డాను. ఇదేమీ నేనొక్కడే పడిన కష్టం కాదు. ప్రతి సినీ ఆర్టిస్టుకూ ఇలాంటి కష్టాలు ఉంటాయి.


నిందల్ని కడిగేసుకో.. 

‘నువ్వేదైనా మంచి పని చేస్తే బురదచల్లడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. నువ్వో నీళ్లబాటిల్‌ పెట్టుకుని కడిగేసుకో, అంతేకానీ అలాగే పూసుకోవద్ద్ద’ ని నాన్న చెప్పేవారు. రాజేశ్‌ఖన్నా ‘అమర్‌ప్రేమ్‌’లో ఓ పాట ఉంది. ‘కుఛ్‌తో లోగ్‌ కహేంగే... లోగోంకా కామ్‌ హై కెహెనా... ఛోడో ఇన్‌ బాతోంకో...’ ఈ పాటను వింటూ ముందుకు వెళుతుంటా. ‘వీడు నిన్నమొన్నటి వరకు ఠికానా లేని వాడు, ఈరోజు ఇంత పెద్ద కార్లో తిరుగుతున్నాడు, ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు, సినిమాల్లో నటిస్తున్నాడు..’ అని ఈర్ష్యపడతారు కొందరు. కానీ, వాడు ఇంత దూరం రావడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటాడు, ఎన్ని నిద్రలేని రాత్రులు అనుభవించి ఉంటాడు, అర్ధాకలితో ఎన్ని పూటలు గడిపాడు? అని ఆలోచించరు. ఇప్పటి అద్దాల మేడల్ని కాదు.. గతంలో నడిచొచ్చిన రాళ్లబాటను కూడా చూడాలి కదా. ‘ఎదుటి వాడి మంచి కోరుకో.. నీకంతా మంచే జరుగుతుందని...’ బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత చెబుతున్నాయి. 


నాన్నకు ప్రేమతో...


నాన్నగారి పేరున ‘మహ్మద్‌ బాషా ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ ఏర్పాటు చేశాను. పదకొండేళ్ల క్రితం మే 10న రాజమండ్రిలో ఈ సంస్థను స్థాపించాం. రెండు రోజుల తరువాత మాకు బాబు పుట్టాడు. నాన్న పేరే పెట్టా వాడికి. 


ట్రస్ట్‌ తరపున అనాథ శవాలకు దహన సంస్కారం చేయిస్తుంటాం. ఇరవయ్యో, ముఫ్పైయ్యో ఎన్ని వేల రూపాయలైతే అంత సంస్థే భరిస్తుంది. 


నలభై మంది వృద్ధులకు అయిదు వందల రూపాయలు చొప్పున ప్రతి నెలా పంపిస్తుంటాను. ఒక చేత్తో చేసిన సహాయం మరో చేతికి తెలియకుండా ఉండాలని నాన్న చెప్పేవారు. ఇంతకాలం దాన్ని ఆచరిస్తూ వచ్చాను. 


నాన్నగారు టైలర్‌. ఆయన జయంతి రోజున కొంతమందికి కుట్టు మిషన్లు పంచుతుంటాను. డబ్బులిస్తే ఖర్చు అయిపోతుంది. కుట్టుమిషన్‌ను సద్వినియోగం చేసుకుంటే ఓ కుటుంబం నిలబడుతుంది. 


కొంతమంది క్యాన్సర్‌ పేషెంట్లకు ఆరు నెలల మందుల కిట్‌లను కొనిస్తున్నాను. పేద విద్యార్థుల చదువులకి ఫీజు కడుతుంటా. 


హైదరాబాద్‌ పరిసరాల్లో వంద మంది మధ్యతరగతి కుటుంబాలకు నెలనెలా కొంత డబ్బును వాళ్ల అకౌంట్లలో నేరుగా వేస్తుంటా. ఇందులో కళాకారులు, స్నేహితులు, ఒకప్పుడు బాగా బతికి చితికిపోయిన కుటుంబాల వాళ్లు ఉన్నారు. 


‘నాకో ట్రస్టు ఉంది.. విరాళాలు ఇవ్వండి’ అని ఇంతవరకూ ఎవరినీ అడిగింది లేదు. నాకు సినిమాల్లో వచ్చే ప్రతి పది రూపాయల్లో మూడు రూపాయలు ట్రస్టుకు వెళుతుంది. ఇతర దేశాల్లో ఎక్కడ పని చేసినా అందులో యాభై శాతం ట్రస్టుకి వెళుతుంది.


గుంటూరులో ఆరేళ్ల క్రితం కొంతమంది మిత్రులు, తమ్ముళ్లు కలిసి అలి ఫోర్స్‌గా ఏర్పడ్డారు. నా పుట్టిన రోజుకి అన్నదానం నిర్వహించడం, అనాథ ఆశ్రమాలకి వెళ్లి అవసరమైన వస్తువులను పంచిపెట్టడం లాంటివి చేస్తుంటారు. ఏడాదికి రెండుసార్లు రక్తదానం చేస్తారు. ఇటీవల కరోనా బాధితుల కోసం రక్తదానం చేసి తమ పెద్ద మనసును చాటారు.

Updated Date - 2020-05-17T17:57:34+05:30 IST