క్లిక్‌మన్న ‘కలర్ ఫొటో’
ABN , First Publish Date - 2022-07-23T05:56:54+05:30 IST
ఎంచుకొన్న కథ బాగుండేలే గానీ, చిన్న, పెద్దా అనే తేడా చూడరు ప్రేక్షకులు.

ఎంచుకొన్న కథ బాగుండేలే గానీ, చిన్న, పెద్దా అనే తేడా చూడరు ప్రేక్షకులు. తక్కువ బడ్జెట్‌తో రూపొందించే చిత్రాలకూ బ్రహ్మరథం పట్టడం ప్రేక్షకులకు అలవాటే. అలా.. ప్రేక్షకుల అభిమానాన్ని, విమర్శకుల ప్రశంసలనూ దక్కించుకొన్న చిత్రం ‘కలర్ ఫొటో’. ఇప్పుడు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డునీ ఎగరేసుకుపోయింది. సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుహాస్, చాందినీ చౌదరి జంటగా నటించారు.
ఓ స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. ప్రేమకు కులం, మతం, జాతి, ఆస్తి, అంతస్తులు.. ఇలా చాలా ఆటంకాలు ఉంటాయి. ‘రంగు’ కూడా ఓ అడ్డంకి అయితే.. అదే ‘కలర్ ఫొటో’. జయకృష్ణ (సుహాస్), దీప్తి (చాందిని చౌదరి) ఇద్దరూ ప్రేమించుకొంటారు. దీప్తి అన్నయ్య రామరాజు (సునీల్)కి ఈ సంగతి తెలిసిపోతుంది. తనో పోలీస్ ఆఫీసర్. కానీ క్రూరుడు. వీరిద్దరి ప్రేమకూ తనే అడ్డుకట్ట వేయాలనుకొంటాడు. మరి ఆ ప్రయత్నం ఫలించిందా లేదా? జయ, దీప్తి ఒక్కటయ్యారా, లేదా? అనేదే కథ.
చాలా చిన్న పాయింట్‌ని దర్శకుడు ఆద్యంతం హృద్యంగా మలిచాడు. పతాక సన్నివేశాలైతే కంట తడి పెట్టిస్తాయి. యూ ట్యూబ్ ద్వారా పాపులర్ అయిన సుహాస్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. సునీల్ ప్రతినాయకుడి అవతారం ఎత్తడం విశేషం. అక్టోబరు 23, 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆర్థికంగానూ మంచి విజయాన్ని అందుకొంది.