కోలీవుడ్‌లోని బ్యాచిలర్ హీరోల్లో విశాల్ ఒకరు. ఈ యేడాది ‘చక్ర ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం నాట్ ఏ కామన్‌మ్యాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో విశాల్‌పై సహాయ దర్శకుడు విజయ్ ఆనంద్ టైటిల్ చోరీ ఆరోపణలు చేశారు.
ఇదే విషయంపై విజయ్ ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘నేను 15 యేళ్ళుగా సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నాను. విశాల్ నటించిన ‘చక్ర’ సినిమాకు పనిచేసే సమయంలో సిద్ధం చేసుకున్న ‘కామన్‌మ్యాన్’ చిత్రం కథను వినిపించాను. పైగా ఈ టైటిల్‌ను నేను రిజిస్టర్ చేయించుకోగా, దాన్ని విశాల్ తన కొత్త చిత్రానికి పెట్టుకున్నారు. నిజానికి ఈ టైటిల్ కావాలంటే ఇస్తానని చెప్పినప్పుడు మిన్నకుండిన విశాల్.. ఆ తర్వాత కొత్త చిత్రానికి ‘నాట్ ఏ కామన్‌మ్యాన్’ అనే టైటిల్‌ను పెట్టుకున్నారు. ఈ విషయంపై విశాల్‌ను సంప్రదించగా ఎలాంటి సమాధానం లేదు. పైగా ఆయన స్నేహితుల ద్వారా బెదిరించసాగారు. కోలీవుడ్‌లో టైటిల్స్ పంచాయితీలకు ఫుల్స్టాప్ పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇదే విషయంపై సినీ హీరో, ఎమ్మెల్యే అయిన ఉదయనిధి స్టాలిన్‌కు ఫిర్యాదు చేస్తా’’ అని పేర్కొన్నారు.