సిల్క్‌స్మిత పాట కోసం కృష్ణ, తమ్మారెడ్డి మధ్య విభేదాలు

ABN , First Publish Date - 2021-05-24T00:00:59+05:30 IST

ఒక పాట కారణంగా హీరోకి, దర్శకుడికి మధ్య అభిప్రాయ భేదాలు రావడం, చివరకు మూడేళ్లు వారిద్దరి మధ్య మాటలు లేకపోవడం.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ నిజంగానే ఇది జరిగింది.

సిల్క్‌స్మిత పాట కోసం కృష్ణ, తమ్మారెడ్డి మధ్య విభేదాలు

ఒక పాట కారణంగా హీరోకి, దర్శకుడికి మధ్య అభిప్రాయ భేదాలు రావడం, చివరకు మూడేళ్లు వారిద్దరి మధ్య మాటలు లేకపోవడం.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ నిజంగానే ఇది జరిగింది. వరుస అపజయాలతో డీలా పడిన హీరో కృష్ణకు ‘పచ్చని సంసారం’ (1993) చిత్రంతో మళ్లీ పూర్వ వైభవం మొదలైంది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన తమ్మారెడ్డి భరద్వాజతోనే ఆయన చేసిన మరో సినిమా ‘రౌడీ అన్నయ్య’. ఇందులో రంభ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఘట్టమనేని శివరామకృష్ణ అని సొంత పేరుతోనే కృష్ణ నటించడం విశేషం. ఆడుతూ పాడుతూ షూటింగ్‌ పూర్తి చేశారు. ఒక పాట మాత్రం మిగిలింది. ‘చోళీకే పీఛే క్యాహై’ పాట బాణీలో ‘వాకిట్లో రోకలి పెట్టా.. నట్టింట్లో తిరగలి పెట్టా’ అనే పల్లవితో ఆ పాట సాగుతుంది. ఆ రోజుల్లో దాదాపుగా ప్రతి సినిమాలోనూ హాస్య నటుడు బాబూమోహన్‌ మీద ఓ పాట పెట్టడం తప్పనిసరిగా ఉండేది. ఆ ప్రయోగం వ్యాపారపరంగా ఎంతో సహాయపడేది. అందుకే ఈ పాటను బాబూమోహన్‌, సిల్క్‌స్మిత మీద తీయాలనుకున్నారు దర్శకుడు భరద్వాజ. ‘రౌడీ అన్నయ్య’లో సిల్క్‌ స్మిత బాబూమోహన్‌ అభిమానిగా నటించారు. అందుకే సన్నివేశానికి అనుగుణంగా ఆ పాట ఉంటుందన్నది భరద్వాజ ఆలోచన. అయితే అటువంటి పాట తన మీద తీస్తే సినిమాకు హెల్ప్‌ అవుతుందని హీరో కృష్ణ అభిప్రాయం. ఆ మాటే భరద్వాజతో చెప్పారు. కానీ ఆయన అంగీకరించలేదు. ఈ పాట విషయంలో వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఎవరి నమ్మకాలు వారివి. అందుకే ఇద్దరూ వెనక్కి తగ్గలేదు. చివరకు హీరో కృష్ణ ఒక అడుగు ముందుకు వేసి పద్మాలయా స్టూడియోలో సెట్‌ వేయించారు. కృష్ణ, సిల్క్‌ స్మిత మీద పాట చిత్రీకరణ మొదలైంది. భరద్వాజ కూడా వెనక్కి తగ్గలేదు. అన్నపూర్ణ స్టూడియోలో మరో సెట్‌ వేసి, నైట్‌ షూటింగ్‌ పెట్టి బాబూమోహన్‌, స్మిత మీద అదే పాటను చిత్రీకరించడం ప్రారంభించారు. పగలు కృష్ణతో, రాత్రి బాబూమోహన్‌తో ఆ పాట చిత్రీకరణలో పాల్గొనేవారు స్మిత. అయితే ఈ పాటను రాత్రి పూట చిత్రీకరిస్తున్న విషయం హీరో కృష్ణకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు భరద్వాజ. 


ఫస్ట్‌ కాపీ రాగానే హీరో కృష్ణ, స్మిత పాల్గొన్న పాటతోనే కృష్ణకు కాపీ చూపించారు. అయితే సెన్సార్‌కు పంపిన ప్రింట్‌లో మాత్రం బాబూమోహన్‌, స్మిత పాట ఉంది. అది అభ్యంతరకరంగా ఉందని చెప్పి, మొత్తం పాట తీసెయ్యాలని చెప్పారు సెన్సార్‌ బోర్డు అధికారి. వెంటనే రివైజింగ్‌ కమిటీకి వెళ్లారు భరద్వాజ. తన పాటకు సెన్సార్‌ అభ్యంతరం చెప్పిందని తెలిసి కృష్ణ కంగారు పడి సెన్సార్‌ ఆఫీసుకు వెళ్లారు. అప్పటికి కానీ బాబూమోహన్‌, స్మిత మీద ఆ పాట తీశారన్న విషయం ఆయనకు తెలియలేదు. ఆ పాట చూశాక బయటకు వచ్చి ‘థాంక్యూ.. మనిద్దరి స్నేహానికి మంచి న్యాయం చేశావు’ అన్నారు కృష్ణ భరద్వాజతో. ఆ తర్వాత ఆయన్ని దూరం పెట్టారు. మూడేళ్ల పాటు వారిద్దరి మధ్య మాటలే లేవు. ‘దర్శకుడిగా నేను కథకు న్యాయం చేయాలనుకున్నాను కానీ కృష్ణగారిని మోసం చెయ్యాలనుకోలేదు. దర్శకునిగా సినిమాకు న్యాయం చేసినా, స్నేహం విషయానికి వచ్చేసరికి కృష్ణగారిని మోసం చేశాననే ఫీలింగ్‌ నాకు ఇప్పటికీ ఉంది’ అంటారు భరద్వాజ.

-వినాయకరావు

Updated Date - 2021-05-24T00:00:59+05:30 IST