సినిమాపురి.. కబ్జాయే మరి!

ABN , First Publish Date - 2021-06-28T09:25:02+05:30 IST

హైదరాబాద్‌ చిత్రపూరి హౌసింగ్‌ సొసైటీలో రాజకీయ గద్దలు వాలాయి. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్న సినీ కా ర్మికుల ఇళ్లను కైవసం చేసుకుంటున్నాయి.

సినిమాపురి.. కబ్జాయే మరి!

  • చిత్రపురి కాలనీలో నాయకుల పాగా
  • మంత్రి బంధువులు, ఎమ్మెల్యేలకు విల్లాలు
  • సినీ కార్మికుల ఇళ్లు పెద్దల కైవసం 
  • 24 కళల్లో సభ్యత్వం నామ్‌కే వాస్తే
  • పలుకుబడి అనే కళ కే పట్టం
  • విచారణ కమిటీ నివేదికపై మీనమేషాలు 
  • ఇక నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లు దక్కేదెవ్వరికో?


ఆయనో తెలంగాణ ఉద్యమకారుడు, న్యాయవాది. నీతి, న్యాయం, ధర్మం, చట్టం.. ఇలా అనేక హక్కుల గురించి గుక్క తిప్పకుండా మాట్లాడుతారు. టీవీ చర్చల్లో ప్రత్యర్థులను మాటలతో ముప్పుతిప్పలు పెడతారు. అధికార పార్టీకి స్వయం ప్రకాశిత నేతగా.. మేధావిగా ఆయనకు  పేరుంది. చిత్ర పరిశ్రమలోని 24 క్రాప్టుల్లో ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. కానీ చిత్రపురి కాలనీలో ఓ విల్లాను కేటాయించుకోవడంలో సఫలీకృతుడయ్యాడు. 


ప్రభుత్వ పాఠశాలో టీచర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన ఆడితే డప్పుల మోత.. ఆయన పాడితే గజ్జెల మోత.. అతడి పాటలకు యావత్‌ తెలంగాణ ధుంధాం చేస్తోంది. కళాకారుడిగా ప్రజల మనస్సులు పొంది ఎమ్మెల్యేగా గెలిచానంటూ చెప్పుకుంటారు. సినీ కళాకారుల సొంతింటి కలను చిదిమేస్తూ ఏకంగా ఓ విల్లాను తనకు కేటాయించేలా చేశారు. 


తను అన్నలను కలిశారు. ప్రజల మన్ననలు పొందారు. పాత్రికేయ నేత నుంచి ఎమ్మెల్యేగా ఎదిగారు. వృత్తి ధర్మానికి గుర్తింపుగా ఇప్పటికే ఓ ఇంటి స్థలాన్ని పొందారు. సినిమాలో వేషం లేదు. సినీ ఇంటర్వ్యూలూ చేయలేదు. సినీ పరిశ్రమలో కుటుంబం కూడా లేదు. చిత్రపురి హౌసింగ్‌ సొసైటీలో సభ్యుడయ్యారు. తన భార్యను సభ్యురాలిని చేశారు. భార్య పేరున కారుచౌకగా ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ను సొంతం చేసుకోగలిగారు. 


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ చిత్రపూరి హౌసింగ్‌ సొసైటీలో రాజకీయ గద్దలు వాలాయి. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్న సినీ కా ర్మికుల ఇళ్లను కైవసం చేసుకుంటున్నాయి. అర్హులకు కేటా యించాల్సిన ఇళ్లను అనర్హులకు అప్పజెబుతూ తమకు అయిన వారి సేవలో సొసైటీ పాలక వర్గాలు తరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు మంత్రుల సమీప బంధువులు, పలుకుబడి నేతలు పాలక మండలికి ముడుపులు అందించి కారుచౌకగా ఇళ్లను కైవసం చేసుకున్నారు. ఎన్నో ఏళ్లు సినీ పరిశ్రమలో ఉండి, పైసా, పైసా కూడగట్టి చిత్రపూరి హౌసింగ్‌ సొసైటీకి చెల్లించిన సామాన్య సభ్యులకు మాత్రం ఇంటి కేటాయింపుల కోసం ఎదురు చూపులే మిగిలాయి.


ఇళ్లకు డబుల్‌ సభ్యత్వాలిచ్చారు

సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఇళ్లు ఉండాలనే ధ్యేయంతో 1990లో సినీ నటుడు ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొందరూ సినిమా ఆర్టిస్టులు, టెక్నిషియన్లు, వర్కర్లు కలిసి ఏపీ సినీ వర్కర్స్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ లిమిటెడ్‌ ఏర్పాటు చేశారు. వారి విజ్ఞప్తి మేరకు 1994 జూలై 4న ఉమ్మ డి రాష్ట్రంలో అప్పటి సీఎం విజయ భాస్కర్‌రెడ్డి ప్రభుత్వం 67.16 ఎకరాల స్థలాన్ని రంగారెడ్డి జిల్లా మణికొండ జాగిర్‌లో చదరపు గజం రూ.40ల చొప్పున కేటాయించింది. ఆ స్థలంలో సినిమా 24 క్రాఫ్ట్‌లో పనిచేసే కార్మికులకు అపార్ట్‌మెంట్లను నిర్మించాలని, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడే స్థిరపడేందుకు వచ్చిన సినీ కార్మికులకు 50ు రిజర్వు చేయాలని అప్పట్లో జీవో (నెంబర్‌ 658) జారీ చేసింది. చిత్రపూరి కాలనీకి అప్పటి సీఎం విజయభాస్కర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. సినీ పరిశ్రమ 24 కళల్లో ఏ యూనియన్‌ కార్డు ఉన్నా హౌసింగ్‌ సొసైటీలో రూ.500ల రుసుంతో సభ్యత్వం కల్పించారు. కాలక్రమేణా ప్రస్తుతం సభ్యత్వ రూసుం రూ.5 వేల వరకు పెరిగింది. 2016 వరకు 9,153 మందికి సభ్యత్వం కల్పించారు. హౌసింగ్‌ సొసైటీలో కేవలం 4213 ఫ్లాట్లు ప్లాన్‌ చేశారు. సొసైటీ చట్టం ప్రకారం సొసైటీలో ఉన్న ఫ్లాట్ల కంటే పది శాతానికి మించి ఎక్కువ సభ్యత్వాలు ఇవ్వరాదు. వంద శాతానికి పైగా అధికంగా సభ్యులను చేర్చుకున్నారు. అడ్డగోలుగా అనర్హులను సొసైటీ సభ్యులుగా చేర్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


ఫ్లాట్లకు నిర్ణయించిన ధరలు ఇలా

2015 వరకు అప్పటి పాలక మండలి నిర్ణయం ప్రకారం ఎంఐజీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ ధర రూ.16 లక్షలు కాగా, నిర్మాణం ఆలస్యం కావడం వల్ల ప్రస్తుతం రూ.19.25 లక్షలకు పెరిగింది. మొత్తం 4213 ప్లాట్లలో ఈడబ్య్లూఎస్‌ ఫ్లాట్లు 224 కాగా ఒక్కో ప్లాట్‌ ధర రూ.2.25 లక్షలు, ఎల్‌ఐజీ ఫ్లాట్లు 1688 కాగా, ఒక్కో ఫ్లాట్‌ ధర రూ.5 లక్షలు, ఎంఐజీ ఫ్లాట్లు 1176 కాగా, ఒక్కో ఫ్లాట్‌ ధర రూ.19.25లక్షలు, హెచ్‌ఐజీ ఫ్లాట్లు 720 కాగా, ఒక్కో ఫ్లాట్‌ ధర రూ.30.50 లక్షలు, రోహౌస్‌లు 225 కాగా ఒక్కో హౌస్‌ ధర రూ.44 లక్షలు, హెచ్‌ఐజీ డూప్లెక్స్‌ విల్లాలు 180 కాగా, ఒక్కో డూప్లెక్స్‌ విల్లా రూ.49.66 లక్షలుగా నిర్ణయించారు. 2015 వరకు ఉన్న ధరలతో పోల్చితే ప్రస్తుతం లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఫ్లాట్ల ధరలను పెంచారు. 


నిబంధనలు పక్కాగానే ఉన్నాయి

చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ కేవలం సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేశారు. కనీసం నిర్మాతలకు కూడా అర్హత లేదు. సినీ పరిశ్రమలో పని చేస్తున్నట్లు సంబంధిత విభాగ యూనియన్‌ గుర్తింపు కార్డు, ధ్రువీకరిస్తూ అధ్యక్ష, కార్యదర్శుల సంతకంతో సీనియారిటీ పత్రం పొందుపరుస్తూ దరఖాస్తు చేసుకోవాలి. సమాచార శాఖ కమిషనర్‌, కోఆపరేటివ్‌ కమిషనర్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, మరో ఇద్దరు సినీ ప్రముఖులతో కూడిన కమిటీ సదరు దరఖాస్తును తనిఖీ చేసి ధ్రువీకరిస్తేనే ఫ్లాట్‌ కేటా యిస్తారు. ఈ విధంగా 4,213 మందిని కమిటీ ధ్రువీకరిం చింది. వారంతాఫ్లాట్‌ కోసం సొసైటీకి 25ు మొదటి వాయి దా చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కొందరూ సినీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో చెల్లించకపోయారు. అలా చెల్లించలేని వారి స్థానంలో తమకు నచ్చిన వ్యక్తులను పాలక మండళ్లు చే ర్చుకుంటూ వస్తున్నాయని ఓ వర్గం ఆరోపిస్తోంది. సినీ కార్మి కులు డబ్బులు చెల్లించేందుకు ముందుకు రానిపక్షంలో 20ు ప్లాట్లను సినీ పరిశ్రమకు అనుబంధంగా ఉన్నవారికి విక్రయిం చవచ్చని గతంలో పాలక మండలి తీర్మానించిందని, దాని ప్రకారమే ఈ విక్రయాలు జరిగాయని మరోవర్గం చెబుతోంది. అయితే, హౌసింగ్‌ సొసైటీలో ఇప్పటికే ఇళ్లు పొందిన వారిలో, ఇళ్లు ఖరారైన వారిలో ప్రతీ ఒక్కరికీ సినిమా 24 కళల్లో ఏదైనా ఒక యూనియన్‌ సభ్యత్వం ఉందని చెప్పడం గమనార్హం.


టీఆర్‌ఎస్‌లోని పలువురు పెద్దలకు

చిత్రపురి హౌసింగ్‌ సొసైటీలో సినీ కార్మికులతో పాటు టీఆర్‌ఎస్‌లోని పలువురు పెద్దలకు చోటు కల్పించారు. 2018 ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు, ఆయన భార్యకు చిత్ర పురి హౌసింగ్‌ సొసైటీలో సభ్యత్వాలున్నాయి.  హెచ్‌ఐజీలో 1670 అడుగుల్లో ఉండే త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ప్లాట్‌ను అద్దెక్కిచ్చి నెలనెలా కిరాయి పొందుతున్నారు. వారిద్దరూ ఏ సినిమాలో నటించలేదు. ఏ సినిమాకు పనిచేసింది కూడా లేదు. పాత్రికే యుడిగా పనిచేసే సందర్భంలో సంబంధిత హౌసింగ్‌ సొసైటీ లోనూ సభ్యుడిగా ఉన్నారు. ఆట, పాటలతో తెలంగాణ ఉద్య మాన్ని హోరెత్తించిన ఓ ఎమ్మెల్యే రచయితగా హౌసింగ్‌ సొసైటీలో సభ్యత్వం పొందారు. చివరాఖరులో సభ్యత్వం పొం దినా కానీ 25వ నెంబర్‌ కలిగిన హెచ్‌ ఐజీ డూప్లెక్స్‌ విల్లాను ఖరారు చేసిన్నట్లు సమాచారం. అదేవిధంగా రాష్ట్రంలో ఓ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ సైతం చిత్రపురి హౌసింగ్‌ సొసైటీలో సభ్యత్వం పొందారు. 


టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయన సినీ పరిశ్రమలో ఏం పాత్ర పోషించారనేది అంతుబ ట్టకుండా ఉంది. హెచ్‌ఐజీ డూప్లెక్స్‌ విల్లా ఒకటి ఖరారవ్వగా, ఇప్పటికే డబ్బులు కూడా చెల్లించిన్నట్లు తెలిసింది. మరో రాజ కీయ పార్టీ సేవా సంఘానికి మూడు రాష్ట్రాల ఇన్‌చార్జిగా ఉన్న ప్రముఖ వ్యక్తి కూడా రచయితగా చిత్రపురి హౌసింగ్‌ సొసైటీలో ఫ్లాట్‌ పొందారు. హెచ్‌ఐజీ 5వ బ్లాక్‌లో త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. సదరు నేత ముగ్గురు బంధువులు కూడా హెచ్‌ఐజీలోనే ఈ ఫ్లాట్లు పొందారు. ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ బ్యాంకులోని ఓ అధికారికి హెచ్‌ఐజీలోనే 3 ప్లాట్లు ఉన్నాయి. అధికార పార్టీ న్యూస్‌ చానల్‌లోని ఓ వ్యక్తి సైతం సభ్యత్వం పొందడంతో పాటు ఫ్లాట్‌ను సైతం దక్కించుకున్నారు.


విచారణ నివేదిక ఎప్పుడు?

సొసైటీలో అక్రమాలపై జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కోఆపరేటివ్‌ శాఖ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదు లు అందాయి.  ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గతేడాది అక్రమాలు జరిగిన్నట్లు పలువురు సినీ కార్మికులు రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్‌ను ఆశ్రయించారు. దాంతో గతేడాది అక్టోబరులో సహకార చట్టం 51 సెక్షన్‌ కింద చిత్రపురి అవకతవకలపై విచారణ చేపట్టారు. హౌసింగ్‌ సొసైటీ ప్రారంభం నుంచి ప్రస్తుత పరిస్థితి వరకు మొత్తం సమాచారాన్ని సేకరించారు. మూడు నెలల్లో విచారణ కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయినా ఇంతవరకు ఇవ్వలేదు.  


సొసైటీ చెప్పినట్లు ఆడుతున్న యూనియన్లు

సినీ నేపథ్యం లేకున్నా పలు సినీ యూనియన్లు డబ్బులిస్తే మరుసటి రోజే గుర్తింపు కార్డులిస్తున్నాయి. వాటి ఆధారంగా హౌసింగ్‌ సొసైటీ సభ్యత్వం ఇస్తోంది. పలుకుబడి ఉంటే సీనియారిటీ పక్కనబెట్టి వెంటనే ఫ్లాట్‌ను కూడా కేటాయిస్తున్నారు. పాలక మండలిలోని పెద్దలు యూనియన్లలో కొందర్ని గుప్పెట్లో పెట్టుకున్నారు. దాంతో ఒక్క ఫోన్‌ కాల్‌తో యూనియన్‌ గుర్తింపు కార్డు వచ్చేస్తుంది. పలు రాజకీయ పార్టీల నేతలు తమ పలుకుబడితో బంధువులకు ఇళ్లను ఇప్పించారు. నగరానికి చెందిన ఓ మంత్రి బంధువుల పేరు మీద, నగర మాజీ మేయర్‌ తన బంధువుల పేరుతో హెచ్‌ఐజీలో ఫ్లాట్లు ఉన్నట్లు తెలిసింది. పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు బినామీల పేరుతో ప్లాట్లను పొందిన్నట్లు తెలుస్తోంది. మరికొందరు ప్రముఖులు నిర్మాణంలో ఉన్న ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు.


నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లు దక్కేదెవ్వరికో?

చిత్రపురి కాలనీలో 1581 ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఫా ట్లను ఇప్పటికే ఖరారు చేశారు. గృహ ప్రవేశాలు జరిగే సమయానికి తమ పేర్లు ఉంటాయా? ఎత్తేస్తారా? అని సీనియారిటీ లిస్టులోని సామాన్యసభ్యులు ఆందోళన చెందుతున్నారు. గత జాబితాల్లోనూ పేరు ఒకరిది ఫ్లాటు మరొకరికి దక్కిన సందర్భాలున్నాయి. 


సీబీ సీఐడీ విచారణ జరపాలి: చాడ

చిత్రపురి కాలనీ ఇళ్ల కేటాయింపులో అవకతవకలపై సీబీసీఐడీ దర్యాప్తు జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 

Updated Date - 2021-06-28T09:25:02+05:30 IST