తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు బుధవారం నుంచి సమ్మెబాట పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా ఎక్కడా తెలుగు చిత్రాల షూటింగ్స్ జరగవనీ, 24 క్రాఫ్ట్స్‌కు చెందిన కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారని తెలుగు చలనచిత్ర కార్మిక సమాఖ్య వెల్లడించింది. ఫిల్మ్ ఛాంబర్ కల్పించుకుని తమ సమస్యలను పరిష్కరించేవరకూ సమ్మెను కొనసాగిస్తామని చెబుతున్నారు. వేతనాలు పెంచే విషయంలో ఫిల్మ్ ఫెడరేషన్ పై మరింత ఎత్తిడి తెచ్చేందుకు బుధవారం 24 క్రాఫ్ట్స్‌కు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో వెంకటగిరిలో ఉన్న ఫెడరేషన్ కార్యాలయానికి వచ్చి నిరసన తెలియజేయనున్నారు. ఈ సమ్మె విషయం తెలియడంతో కొంతమంది నిర్మాతలు ఫెడరేషన్ నాయకులకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్స్ అకస్మాత్తుగా ఆగిపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందనీ, వేతనాల విషయం చర్చిద్దామని చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఫిల్మ్ చాంబర్ తుది నిర్ణయం తీసుకోవాలి కనుక ఛాంబర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు ఫెడరేషన్ నాయకులు చెబుతున్నారు.
సమ్మెకు కారణాలు ఏమిటి?
సినీ కార్మికులకు ప్రతి మూడేళ్లకు ఒకసారి వేతనాలను సవరిస్తుంటారు. ఆయా శాఖలను బట్టి 30 నుంచి 35 శాతం వరకూ ఈ పెంపుదల ఉంటుంది. 2018లో వేతనాలు పెంచారు. మళ్లీ 2021కు పెరగాలి. అయితే కొవిడ్ వల్ల షూటింగ్స్ ఆగిపోవడం, సినిమాలు రిలీజ్ కాకపోవడం వంటి కారణాల వల్ల నిర్మాతలు ఇబ్బంది పడుతుండడంతో ఆరు నెలలు వేచి చూద్దామని అప్పట్లో వేతనాల గురించి ప్రస్తావించకుండా షూటింగ్స్‌కు హాజరవుతున్నారు సినీ కార్మికులు. ఆ తర్వాత కరోనా ప్రభావం తగ్గడం, చిత్రపరిశ్రమ మాములు దశకు చేరుకుని షూటింగ్స్‌తో బిజీ కావడంతో ఈ ఏడాది జనవరి నుంచి తమ వేతనాల విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫెడరేషన్ చెబుతోంది. ఫిల్మ్ చాంబర్, ఫెడరేషన్ల మధ్య ఈ విషయంలో కొన్ని సార్లు చర్చలు జరిగినా కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సమ్మె బాట పట్టామని కార్మికులు చెబుతున్నారు.
ఆ గొడవ మీద వివరణ కోరిన ఛాంబర్ గత నెలలో ఫెడరేషన్‌లోని స్టంట్ యూనియన్ ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా షూటింగ్స్‌కు హాజరు కాకపోవడంతో నిర్మాణంలో ఉన్న ఆరు చిత్రాలకు దాదాపు రూ రెండు కోట్ల నష్టం వాటిల్లిందనీ తెలిసింది. వేతనాల గురించి చర్చించేముందు ఆ సంఘటన మీద వివరణ ఇవ్వాలని ఫిల్మ్ ఛాంబర్ పట్టు పడుతున్నట్లు సమాచారం.
వారి వాదన కరెక్ట్ కాదు
ఫైటర్స్ యూనియన్‌తో ఉన్న సమస్యను పరిష్కరిస్తే తప్ప వేతనాల గురించి ఆలోచించమని ఛాంబర్ పెద్దలు అంటున్నారు. ఒక యూనియన్‌తో ఉన్న చిన్న సమస్యను అడ్డం పెట్టుకుని, మిగిలిన 23 యూనియన్‌కు చెందిన కార్మికులకు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ప్రతినెలా రెండో ఆదివారం యూనియన్ మీటింగ్స్ జరుగుతుంటాయి. ఆ మీటింగ్స్‌లో వేతనాల గురించి ఎప్పటికప్పుడు వర్కర్స్‌ను కన్విన్స్ చేసుకుంటూ వస్తున్నాం. వేతనాలు పెంచాల్సిందేనంటూ ఆరు నెలల నుంచి యూనియన్ నాయకుల మీద కార్మికులు ఒత్తిడి చేస్తున్నారు. 24 క్రాప్ట్స్‌లో 12 యూనియన్లకు చెందిన కార్మికులకే రోజువారీ వేతనం ఉంటుంది. పదిహేను రోజుల్లో వేతనాల విషయంలో ఏదీ తేల్చకపోతే మా సభ్యులు తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని మేం గతనెలలో తీర్మానం చేసి, ఆ కాపీని ఫిల్మ్ ఛాంబర్‌కు పంపాం. ఈ పదిహేను రోజుల నుంచి కాలయాపన చేస్తున్నారు కానీ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఫెడరేషన్ కూడా సమ్మె చేయాలని కోరుకోవడం లేదు. అందుకే మా మీద నిరసన తెలియజేయడానికి సినీ కార్మికులందరూ రేపు ఫెడరేషన్‌కు వస్తున్నారు
వల్లభనేని అనిల్‌కుమార్
అధ్యక్షుడు, తెలుగుచలనచిత్ర కార్మిక సమాఖ్య
మాకు నోటీసు ఇవ్వలేదు..
షూటింగ్స్ జరుగుతాయి
బుధవారం నుంచి కార్మికుల సమ్మె అని అంటున్నారు. కానీ మాకు ఎటువంటి సమాచారం లేదు. సమ్మె చేయాలంటే నిబంధనల ప్రకారం 15 రోజుల ముందు ఫిల్మ్ ఛాంబర్‌కు నోటీసు ఇవ్వాలి. అటువంటి నోటీసు ఇంతవరకూ మాకు రాలేదు. నిర్మాతలు బుధవారం షూటింగ్స్ జరుపుకోవచ్చు. మాకు ఫోన్ చేసిన నిర్మాతలకు ఇదే విషయం చెబుతున్నాం. బుధవారం ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతలమండలి సంయుక్తంగా నిర్వహించే సమావేశంలో ఈ విషయం గురించి చర్చిస్తాం
కొల్లి రామకృష్ణ,
అధ్యక్షుడు తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి