చిన్నారికి చూపునిచ్చిన జయంతి

ABN , First Publish Date - 2021-07-27T17:39:15+05:30 IST

దక్షిణాదిన అగ్రతారగా సుధీర్ఘ కాలం కొనసాగి పాత్ర ఎటువంటిదైనా జీవిస్తారనే పేరొందిన మేటి నటి జయంతి మృత్యువు తర్వాత కూడా మరొకరికి చూపునిచ్చారు. జయంతి బెంగళూరులో ఆదివారం అర్ధరా

చిన్నారికి చూపునిచ్చిన జయంతి

- తల్లి ఆశయాన్ని నెరవేర్చిన కుమారుడు

- సినీనటి జయంతికి పలువురు నివాళి


బెంగళూరు: దక్షిణాదిన అగ్రతారగా సుధీర్ఘ కాలం కొనసాగి పాత్ర ఎటువంటిదైనా జీవిస్తారనే పేరొందిన మేటి నటి జయంతి మృత్యువు తర్వాత కూడా మరొకరికి చూపునిచ్చారు. జయంతి బెంగళూరులో ఆదివారం అర్ధరాత్రి తర్వాత నివాసంలోనే కన్నుమూశారు. వయోసహజ ఆరోగ్య సమస్యలతో బాధపడు తూ తుదిశ్వాస వీడిన జయంతి ఆశయాన్ని కుమారుడు కృష్ణకుమార్‌ నెరవేర్చారు. కన్నడ కంఠీరవ డాక్టర్‌ రాజ్‌కుమార్‌తో సుమారు 35 సినిమాలలో నటించారు. ఆ అనుబంధంతోనే డాక్టర్‌ రాజ్‌కుమార్‌ ఐ బ్యాంకుకు కళ్లను దానం చేశారు. ఆమె ఆశయానికి అనుగుణంగా నగరంలోని నారాయణ నేత్రాలయ వైద్యులు కళ్లను సేకరించి కళ్లులేని ఓ చిన్నారికి అమర్చారు. అంత్యక్రియల కోసం బనశంకరి శ్మశాన వాటికకు తీసుకెళ్లిన సమయంలోనే వైద్యులు ప్రక్రియ ముగించారు. 


ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం

తెలుగు, కన్నడ, తమిళ భాషల ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకున్న నటి జయంతి మృతి భారతీయ సినీ పరిశ్రమకే తీరని లోటని పంచభాషా నటి బీ సరోజాదేవి పేర్కొన్నారు. నటి జయంతితో తనకున్న ఆత్మీయ అనుంబంధాన్ని స్మరించుకొని కన్నీటి పర్యంతమయ్యారు. తన పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని జయంతికి ఇచ్చినప్పుడు తనకెంతో సంతోషం కలిగిందన్నారు. నటనాకౌశల్యానికి జయంతి నిలువుటద్దమని ప్రముఖ నటుడు అనంతనాగ్‌ పేర్కొన్నారు. జయంతి మృతి కలచివేసిందని కన్నడ నటీ మణులు, తారా అనురాధ, శృతి నివాళులర్పించారు. చందనసీమతో జయంతికి ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకున్న అఖిల కర్ణాటక డాక్టర్‌ రాజ్‌కుమార్‌ అభిమానుల సంఘం అధ్యక్షుడు సా.రా.గోవింద్‌ అలనాటి ఎన్నో హిట్‌ చిత్రాలు నేటికీ ప్రేక్షకుల హృదయాల్లో పదిలంగా ఉన్నాయన్నారు. ప్రముఖ కన్నడ హీరో డాక్టర్‌ శివరాజ్‌కుమార్‌ నివాళులర్పిస్తూ తమ కుటుంబంతో జయంతికి అవినాభావ సంబంధాలున్నాయన్నారు. తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు, అజంతా మూవీస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఏ రాధాకృష్ణ రాజు నివాళులర్పిస్తూ అలనాటి మేటి నటిని కోల్పోవడం ఎంతో బాధగా ఉందన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తమ సంస్థ 60వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకృష్ణదేవరాయుల పురస్కారాన్ని అందజేసిన క్షణాలను స్మరించుకున్నారు. జయంతి పార్థివదేహాన్ని సోమవారం సాయంత్రం కొద్దిసేపు నగరంలోని రవీంద్ర కళాక్షేత్రలో ఉంచారు. పెద్దసంఖ్యలో రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు కడపటి నివాళులర్పించారు. 

Updated Date - 2021-07-27T17:39:15+05:30 IST