చిత్రపురి నిధులు ‘ఐపీ’ల పాలు!

  • 90 కోట్లు ఎగనామం పెట్టిన నిర్మాణ సంస్థలు
  • ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న హౌసింగ్‌ సొసైటీ
  • ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు తిప్పలు


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): సొంతింటి కోసం సినీ కార్మికులు రూపాయి రూపాయి పోగు చేసి చెల్లించారు. హౌసింగ్‌ సొసైటీ పాలక మండలిపై విశ్వాసంతో వారు ఏది చెబితే అది నమ్మారు. కానీ, ఇళ్ల నిర్మాణానికి వినియోగించాల్సిన వారి డబ్బు.. నిర్మాణ సంస్థలకు అడ్వాన్సులు ఇచ్చేందుకు, వారు ఎగనామం పెట్టేందుకు పనికివచ్చింది. దీనికితోడు గత పాలకమండళ్లు విందులు, వినోదాల పేరుతో దుబారా ఖర్చులు చేశారు. చివరికి సొసైటీ అప్పులపాలైంది. ఇళ్ల నిర్మాణం పూర్తికాక.. కార్మికులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తూనే ఉండాల్సివస్తోంది. నాలుగైదేళ్ల క్రితమే పూర్తవ్వాల్సిన చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ ప్రాజెక్టుకు మరో వంద కోట్ల వరకు ఖర్చు చేస్తేనే ఇళ్లన్నీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి నెలకొంది. 


కార్మికులు రూ.640 కోట్లు చెల్లించినా.. 

చిత్రపురికాలనీలో అన్ని రకాల ఇళ్ల నిర్మాణ పనుల మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.723.81 కోట్లుగా అంచనా వేశారు. ప్రాజెక్టును ప్రారంభించేందుకు నిధులకు ఇబ్బంది రావడంతో ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థ నుంచి రూ.50 కోట్ల వరకు రుణాలు తీసుకొచ్చారు. ఆ తరువాత సొసైటీ భూములను తనఖా పెట్టి పలు ప్రభుత్వ బ్యాంకుల నుంచి రూ.180 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. అయితే ఇళ్ల కోసం సినీ కార్మికులు చెల్లించిన డబ్బుతో ఆ రుణాలు తీర్చే అవకాశం ఉన్నా జాప్యం చేశారు. దీంతో ప్రముఖ ప్రభుత్వ బ్యాంకుకు రూ.150 కోట్ల వరకు అసలుతోపాటు రూ.57 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. ఇంకా రూ.30 కోట్ల వరకు చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన సొసైటీ భూమిని వేలం వేసేందుకు ఆ బ్యాంకు నోటిఫికేషన్‌ వేసింది. దీంతో కొంత నగదును చెల్లించినా.. ఇంకా రూ.13 కోట్లు బకాయి ఉంది. ఈ సొమ్మును సింగిల్‌ సెటిల్‌మెంట్‌ స్కీమ్‌లో జూలై 25 వరకు చెల్లించాలని, లేదంటే స్థలాన్ని ఈ-వేలం పెడతామని బ్యాంకు ప్రకటించింది. అయితే సినీ కార్మికులు తమకు కేటాయించిన ఇళ్ల ఆధారంగా హౌసింగ్‌ సొసైటీలోని 4213 ఫ్లాట్లకు మొత్తం రూ.640 కోట్ల వరకు చెల్లించారు. ఈ నిధులతో నిర్మాణం వేగంగా జరపాల్సి ఉండగా.. నిర్మాణ సంస్థలను ఎంపిక చేయడం దగ్గర నుంచి ప్రాజెక్టును పూర్తి చేసే వరకు పాలకమండలి సభ్యులు పదేళ్లపాటు జాప్యం చేశారు. దీంతో ప్రస్తుతం పాలకమండలి వద్ద అప్పులు తప్ప.. నయా పైసా లేదు. ఇంకా 1581 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటి నిర్మాణం, మౌలిక సదుపాయాలకు కలిపి రూ.150 కోట్ల వరకు నిధులు అవసరమున్నాయి. ఇళ్ల కేటాయింపు జరిగిన వారి నుంచి మాత్రం  ఇంకా రూ.50 కోట్ల వరకు మాత్రమే రావాల్సి ఉంది. 


అడ్వాన్స్‌లుగా అడ్డగోలు చెల్లింపులు..

చిత్రపురి హౌసింగ్‌ సొసైటీలో సింగిల్‌, ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పనులు 2003లో ఓ నిర్మాణ సంస్థకు అప్పగించగా.. అది ముందుకు సాగలేదు. చివరికి ప్రాజెక్టు పూర్తి చేయలేని స్థితికి నిర్మాణ సంస్థ చేరినా.. 2014లో అప్పటి పాలకమండలిలోని పలువురు ఆ నిర్మాణ సంస్థకు కొమ్ముకాశారన్న ఆరోపణలున్నాయి. అప్పటికే ఆ నిర్మాణ సంస్థకు రూ.50 కోట్ల వరకు చెల్లించగా.. ఆ సంస్థ పనులు చేయకుండానే దివాలా తీసినట్లుగా ఐపీ పెట్టారు. అయితే ఆ సంస్థ నుంచి నాటి పాలకమండలి సభ్యుల్లో కొందరికి పెద్ద మొత్తం అందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత మరో మూడు నిర్మాణ సంస్థలు ముందుకొచ్చాయి. వాటికి కూడా సుమారు రూ.40కోట్ల మేర అడ్వాన్స్‌లుగా చెల్లించారు. కాగా, సుమారు రూ.13 కోట్ల వరకు ఎగనామం పెట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిర్మాణ సంస్థ అడ్వాన్స్‌ తిరిగి చెల్లించిన్నట్లు చెబుతుండగా, అప్పటి పాలకమండలి సభ్యులు మాత్రం ఐపీ పెట్టి వెళ్లారని అంటున్నారు. 


హౌసింగ్‌ సొసైటీలో అక్రమాలు ఇలా..

చిత్రపురి హౌసింగ్‌ సొసైటీలో 220 విల్లాల నిర్మాణానికి అనుమతులు పొంది మరో ఆరు విల్లాలను అదనంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు. 

దీనిపై పలువురు  కోర్టుకెక్కడంతో మణికొండ మునిసిపల్‌ అధికారులు నిర్మాణంలో ఉన్న విల్లాలను సీజ్‌ చేశారు. 

చిత్రపురి కాలనీలో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు పలు సంస్థలు కోట్ల రూపాయలు సొసైటీకి చెల్లించేందుకు అంగీకరించాయి. కానీ ఆ సంస్థలన్నింటినీ పక్కన పెట్టి గత పాలకమండలిలోని ఓ సభ్యుడే నయా పైసా సొసైటీకి చెల్లించకుండా హక్కులు పొందినట్లు సమాచారం. 

చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ నుంచి ఇళ్లు పొందిన వారికి రిజిస్ర్టేషన్‌ చార్జీలు లేవు. స్టాంప్‌ డ్యూటీ చార్జీ రూ.100లు చెల్లిస్తే ఎలాంటి రిజిస్ర్టేషన్‌ చార్జీలు లేకుండా చేయాలని, అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్‌ 658 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిర్మాణం పూర్తయ్యిన 2632 ఫ్లాట్లను రిజిస్ర్టేషన్లకు లబ్ధిదారుల నుంచి చార్జీల పేరుతో రూ.25వేల చొప్పున పెద్దమొత్తం వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.


గతంలో చేసిన తప్పిదాల వల్లే ఇబ్బందులు

చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ పూర్తిగా ఆర్థికలోటులో ఉంది. గత పాలకమండలిలో పలు నిర్మాణ సంస్థలు అడ్వాన్స్‌లు తీసుకొని ఎగనామం పెట్టాయి. మిగిలిన పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. డబ్బులు చెల్లించిన ప్రతి సినీ కార్మికుడికీ ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. ఆరు నుంచి నెలల్లోపు పనులు చేయడానికి సొసైటీ సిద్ధంగా ఉంది. గతంలో జరిగిన తప్పిదాల వల్ల సొసైటీకి బ్యాంకు రుణాలు వచ్చే పరిస్థితి లేదు. ఒక ఫైనాన్స్‌ ఏర్పాటు చేసుకొని ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తాం.

- వల్లభనేని అనిల్‌కుమార్‌, చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.