చిత్రపురి ఫ్యామిలీ ప్యాకేజీ

ABN , First Publish Date - 2021-06-30T09:55:17+05:30 IST

చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌లలో ఎందులోనూ పనిచేయరు. కానీ, ఏదో ఒక యూనియన్‌లో సభ్యత్వం లభిస్తుంది.

చిత్రపురి ఫ్యామిలీ ప్యాకేజీ

  • కమిటీ సభ్యులకు నాలుగైదు ఫ్లాట్లు
  • బంధువులకు సైతం దక్కిన ఇళ్లు
  • అడ్డగోలుగా ఇళ్ల కేటాయింపులు
  • ప్రముఖులకు రెండు సొసైటీల్లోనూ లబ్ధి
  • పదేళ్ల గడువు తీరక ముందే విక్రయాలు
  • నామమాత్రపు ధరకు కైవసం..
  • రెట్టింపు ధరలకు ఇతరులకు అమ్మకం
  • చేతులు మారుతున్న కోట్ల రూపాయలు
  • హౌసింగ్‌ సొసైటీ లీలలు ఎన్నెన్నో


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌లలో ఎందులోనూ పనిచేయరు. కానీ, ఏదో ఒక యూనియన్‌లో సభ్యత్వం లభిస్తుంది. హౌసింగ్‌ సొసైటీలో సభ్యత్వం పొందేందుకు తగిన అర్హత ఉండదు. కానీ, ఏకంగా ముందుగా ఉన్న నంబరుపైనే సభ్యత్వం లభిస్తుంది. సొసైటీలో ఇల్లు, ఫ్లాట్‌, విల్లా.. ఇలా ఏది కావాలంటే అది దక్కుతుంది. వారికే కాదు.. వారి కూతురి పేరిట ఒకటి, కొడుకు పేరిట మరొకటి, బంధువుల పేరిట కొన్ని దక్కుతాయి. బినామీల పేరిట కూడా మరికొన్ని ఇళ్లను దక్కించుకుంటారు. హౌసింగ్‌ సొసైటీ పాలకమండలిని గుప్పిట్లో పెట్టుకొని కొందరు ఇలా ‘ఫ్యామిలీ ప్యాకేజీ’ కింద ఇళ్లను పొందుతుంటే.. సినీ రంగంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్నవారు మాత్రం అన్యాయానికి గురవుతున్నారు. రూపాయి రూపాయి పోగు చేసి డబ్బులు చెల్లిస్తున్నా.. ఇల్లు దక్కడంలేదు. అంతేకాదు.. కొందరు గతంలో ఫిలింనగర్‌ హౌసింగ్‌ సొసైటీలో లబ్ధి పొంది.. ప్రస్తుతం చిత్రపురి హౌసింగ్‌ సొసైటీలోనూ ఇల్లు దక్కించుకుంటున్నారు. మరికొందరు ఇల్లు పొంది పదేళ్ల గడువు తీరకముందే.. అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇంకొందరైతే నిర్మాణంలో ఉండగానే ఇతరులతో ఒప్పందం చేసుకొని.. రెండు, మూడు రెట్లకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. 


రెండు సొసైటీల్లోనూ లబ్ధి.. 

సొసైటీ నిబంధనల ప్రకారం.. ఒక హౌసింగ్‌ సొసైటీలో లబ్ధి పొందినవారు మరో హౌసింగ్‌ సొసైటీలో చేరకూడదు. లబ్ధి పొందకూడదు. కానీ, కొంతమంది ఇప్పటికే ఫిలింనగర్‌ హౌసింగ్‌ సొసైటీలో లబ్ధి పొంది, ప్రస్తుతం చిత్రపురి హౌసింగ్‌ సొసైటీ ఇళ్లను దక్కించుకున్నారు. వీరిలో గొప్ప రచయితలుగా పేరొందినవారు, దర్శకులు, ఆర్టిస్టులు ఉన్నారు. ఇక హౌసింగ్‌ సొసైటీలో ఇళ్లు పొందినవారు వాటిని రిజిస్ర్టేషన్‌ జరిగిన పదేళ్ల వరకు ఎవరికీ విక్రయించకూడదని నిబంధనల్లో పొందుపరిచారు. ఈ విషయాన్ని రిజిస్ర్టేషన్‌ శాఖకు విన్నవించారు. కానీ, చాలా మంది ఈ నిబంధనను ఉల్లంఘించి ఇళ్లను ఇతరులకు విక్రయిస్తున్నారు. ఏ రియల్‌ ఎస్టేట్‌ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ చూసినా.. వాటిలో చిత్రపురి హౌసింగ్‌ సొసైటీలోని ఫ్లాట్లను అమ్మకానికి పెట్టిన వివరాలు కనిపిస్తుంటాయి. గృహ ప్రవేశం జరిగి.. ఐదేళ్లు కూడా పూర్తి కాని హెచ్‌ఐజీ ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్లు రెండు, మూడేళ్లుగా పెద్ద ఎత్తున చేతులు మారుతున్నాయి.


రిజిస్ట్రేషన్‌ కూడా జరగకముందే విక్రయం..

ఎల్‌ఐజీ ఇళ్లును రూ.5 లక్షలకు కొనుక్కున్న పలువురు.. ప్రస్తుతం వాటిని రూ.30 లక్షల వరకు బయ టివారికి అమ్ముతున్నారు. మరికొందరు రిజిస్ట్రేషన్‌ కూడా జరగకముందే కేటాయింపుపత్రాల ఆధారంగా విక్రయిస్తున్నారు. ఓ దర్శకుడు తనకు కేటాయించిన రోహౌస్‌ ఇంకా నిర్మాణంలో ఉండగానే ఇతరులకు కోటి రూపాయలకు విక్రయించిన్నట్లు సమాచారం. ఇలా 50ుఇళ్లను ఇతరులకు విక్రయించేశారు. ఆదాయం వస్తుండడంతో రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు కూడా సొసై టీ నిబంధనలేవీ పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. హౌసింగ్‌ సొసైటీలోని కొంతమంది పెద్దలకు ముడుపులు అందిస్తే చాలు.. ఈడబ్ల్యూఎస్‌ ఇళ్లలోని సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నుంచి ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల వరకు విక్రయించి పెడుతున్నారు. పాలకమండలిలోని వారే ఈ దందా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బినామీల పేరుతో ఉన్న సుమారు 30 ఫ్లాట్ల వరకు పాలకమండలిలోని ఓ సభ్యుడు తన బంధు వు ద్వారా రియల్‌ ఎస్టేట్‌ దందాకు తెరలేపారని అంటున్నారు. హైటెక్‌ సిటీకి కూతవేటులో, ఐటీ కారిడార్‌ మధ్యలో చిత్రపురి ఉండడంతో ఫ్లాట్స్‌ హాట్‌ కేక్‌లా అమ్ముడవుతున్నాయి. అడ్డదారిలో ఫ్లాట్లను చేజిక్కించుకున్న వారంతా కొనుగోలు చేసిన ధరకంటే మూడింతలు అధికంగా విక్రయిస్తుండడంతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ అక్రమ దందా పలువురు పాలకమండలి సభ్యుల కనుసన్నల్లోనే సాగుతున్నట్లు తెలిసింది.


బయటివారిని ఖాళీ చేయించాలి

నేను మంత్రిగా ఉన్న సమయంలో చిత్రపురి సొసైటీ భూమి హద్దులను నిర్ధారించేలా అప్పటి రంగారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించి చర్యలు చేపట్టాను. సినీ కార్మికుల కష్టాలు తెలిసిన వాడిగా ఆనాడు చర్యలు తీసుకున్నాను. కానీ, ప్రస్తుత పరిస్థితి కంచే చేను మేసినట్లుగా ఉంది. సినీ కార్మికులకు దక్కాల్సిన ఇళ్లను పెద్దలు, నాయకులు పంచుకున్నారు. ఒక్కొక్కరు నాలుగైదు ఇళ్లు పొందా రు. వీటిపై ఫిర్యాదులు వస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. హౌసింగ్‌ సొసైటీలో సినీ పరిశ్రమకు సంబంధం లేనివారిని వెంటనే ఖాళీ చేయించాలి. అడ్డగోలుగా కేటాయింపులపై పూర్తిస్థాయి న్యాయ విచారణ జరిపించాలి. 

   - బాబుమోహన్‌, సినీ నటుడు, మాజీ మంత్రి


ఫ్యామిలీ ప్యాకేజీలో మచ్చుకు కొన్ని..

చిత్రపురి సొసైటీ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేసిన ఓ వ్యక్తి.. మ్యూజిక్‌ యూనియన్‌, జూనియర్‌ ఆర్టిస్టు యూనియన్‌ల నుంచి సభ్యత్వాలు పొంది పాలకమండలిలో కీలకంగా మారారు. తన పేరుతో ఎల్‌ఐజీ ఫ్లాట్‌ పొందారు. ఆపై తన బంధువుకు తొలుత హౌసింగ్‌ సొసైటీలో సభ్యత్వం కల్పించారు. ఆ తర్వాత తన భార్యకు జూనియర్‌ ఆర్టిస్టుగా సభ్యత్వం కల్పించారు. కొన్నాళ్లకు సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా.. బంధువు పేరును తొలగించి భార్య పేరు చేర్చారు. ఆమె పేరుతో విల్లా ఖరారయింది. బంధువుకూ హెచ్‌ఐజీ ఫ్లాట్‌ కేటాయించారు.


ఓ ప్రముఖ రాజకీయ పార్టీ ప్రతినిధిగా, చిత్రపురి హౌసింగ్‌ సొసైటీలో కీలకంగా ఉన్న ఓ వ్యక్తి.. పూర్తి డబ్బులు చెల్లించకపోయినా తన కుమార్తెకు ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌, కుమారుడికి సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. కేవలం రూ.18 లక్షలు మాత్రమే చెల్లించి తన పేరుతో ఖరారైన విల్లాను అన్నింటి కంటే ముందుగా సిద్ధం చేసుకున్నాడు.


హౌసింగ్‌ సొసైటీలో ఉద్యోగిగా ప్రయాణం మొదలుపెట్టిన ఓ వ్యక్తి.. పాలకవర్గాల గుట్టు తెలుసుకొని, వారిని గుప్పిట్లో పెట్టుకున్నాడు. అన్ని రాజకీయ పార్టీల కండువాలు వేసుకొని రాజకీయ చాతుర్యం సంపాదించాడు. ప్రస్తుతం సొసైటీలో కీలక స్థానంలో ఉన్న ఈయన.. ఓ విల్లాను ఖరారు చేసుకున్నాడు. ఈయనకు కుటుంబానికి మూడు ఇళ్లతోపాటు బినామీల పేరుతో మరికొన్ని ఫ్లాట్లు కూడా ఉన్నట్లు తెలిసింది. 


ఓ సినిమాలో హీరోయిన్‌ రెండు పెసరట్లు ఆర్డర్‌ చేసి.. హీరోతో మాట్లాడుతుండగా.. వారి మాట తీరును బట్టి ఉల్లిపాయలు, నెయ్యి, జీడిపప్పు అదనంగా వేయాలని, బిల్లు మాత్రం వేయకూడదని చెప్పే వెయిటర్‌గా కనిపించిన వ్యక్తి.. చిత్రపురి హౌసింగ్‌ సొసైటీలో కీలక బాధ్యతలో ఉన్నారు. తన పేరుతో ఫ్లాట్‌ దక్కించుకున్నారు. మైనర్లకు సభ్యత్వం కల్పించకూడదని ట్రేడ్‌ యూనియన్‌ చట్టం చెబుతున్నా.. తన కూతురుకు 16 ఏళ్లు ఉన్నప్పుడే సభ్యత్వం కల్పించి ఫ్లాట్‌ కూడా కట్టబెట్టారు. ఆమెకు 24 క్రాఫ్ట్‌లలో దేనితోనూ సంబంధం లేకపోగా, ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నట్లు చెబుతున్నారు.

 

ప్రముఖ టీవీ చానల్‌ యాంకర్‌గా ఉన్న పాలకమండలి సభ్యురాలు.. డబ్బింగ్‌ యూనియన్‌ ద్వారా హౌసింగ్‌ సొసైటీలో సభ్యత్వం పొందినట్లు రికార్డులో ఉంది. 5500 తరువాతి నంబరు  ఉన్నా.. ఆ యాంకర్‌కు హెచ్‌ఐజీ ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ ఖరారయింది. అంతేకాదు.. ఆమె తండ్రి పేరుతో ఎల్‌ఐజీ సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌కు డబ్బులు చెల్లించి.. హెచ్‌ఐజీ ట్రిపుల్‌  బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

 

హౌసింగ్‌ సొసైటీలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేసిన ఓ కాంట్రాక్టర్‌కూ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ను కట్టబెట్టారు. 

Updated Date - 2021-06-30T09:55:17+05:30 IST