Chiranjeevi at Allu Studios: ఇదొక స్టాటస్‌ సింబల్‌ కావాలి!

ABN , First Publish Date - 2022-10-01T18:58:16+05:30 IST

ప్రముఖ హాస్యనటుడు దివంగత అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో అల్లు అరవింద్‌ నిర్మించిన ‘అల్లు స్టూడియోస్‌’ఉ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్‌ చిరంజీవి స్టూడియోను ప్రారంభించారు.

Chiranjeevi at Allu Studios: ఇదొక స్టాటస్‌ సింబల్‌ కావాలి!

ప్రముఖ హాస్యనటుడు దివంగత అల్లు రామలింగయ్య (100 Years of Allu Ramalingaiah)శత జయంతి వేడుకల హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో అల్లు అరవింద్‌ నిర్మించిన ‘అల్లు స్టూడియోస్‌’  శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్‌ చిరంజీవి స్టూడియోను (Chiranjeevi launch Allu studios) ప్రారంభించారు. అనంతరం అల్లు రామలింగయ్య విగ్రహం వద్ద నివాళి అర్పించారు. చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఎంతో మంది నటులున్నా కొద్దిమందికి మాత్రమే ఈ ఘనత, ఆప్యాయత లభిస్తుంది. రామలింగయ్యగారి వారసులుగా, కొడుకుగా వారు వేసిన బాటలో అల్లు అరవింద్‌ అగ్ర నిర్మాతగా, మనవలు, అల్లు బాబీ, బన్నీ, శిరీష్‌ వీళ్లు కూడా ఇదే సినిమారంగంలో అగ్ర స్థానంలో ఉన్నారంటే.. ఎన్నో దశాబ్దాల క్రితం పాలుకొల్లులో ఆయన మదిలో మెదిలిన ఆలోచన. ఎంతో ఇష్టమైన నటనా రంగంలో రాణించాలి, మద్రాస్‌ వెళ్లి నిరూపించుకోవాలి అన్న బలీయమైన ఆయన ఆలోచన ఈరోజు పెద్ద వ్యవస్థగా మారింది. ఆయన ఆర్టిస్ట్‌గా నిలదొక్కుకుని ఆయన కుమారుడిని నిర్మాతను చేయాలనే తపనతో గీతా ఆర్ట్స్‌ ప్రారంభి వెసులుబాటు కలిగించారు. తండ్రి తెలివితేటల్ని, సమయస్ఫూర్తిని పుణికిపుచ్చుకొన్న అరవింద్‌గారు నిర్మాతగా అగ్ర స్థాయిలో ఉన్నారు. దీనికి రామలింగయ్యగారిని అల్లు వారి తరతరాలు ప్రతిక్షణం తలుచుకోవాలి. ఈ అల్లు స్టూడియో అనేది లాభాపేక్ష కోసం కాదని నేను అనుకుంటున్నాను. అల్లు రామలింగయ్యగారి పట్ల కృతజ్ఞత చూపించుకోవడానికి, తరతరాలు ‘అల్లు’ అనే బ్రాండ్‌ను తలచుకోవడం కోసం ఈ స్టూడియో నిర్మించారని భావిస్తున్నాను. ఇదొక స్టాటస్‌ సింబల్‌గా ఉండాలి. ఇంతకంటే మనకు జన్మనిచ్చిన వారికి ఏ రకంగా కృతజ్ఞత తీర్చుకోగలం. తమకు ఈ బాటను ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్యగారిని స్మరించుకుంటూ ఈ ప్రయత్నం చేసిన అల్లువింద్‌గారు, బన్నీ, బాబీ, శిరీష్‌లకు అభినందనలు తెలుపుతున్నా. నేను కూడా ఆ కుటుంబంలో భాగమైనందుకు ఆనందిస్తున్నా’’ అని అన్నారు. 




అల్లు స్టూడియో.. ఓ జ్ఞాపిక...

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘నాన్నగారు చనిపోయి 18 ఏళ్లయింది. ఈ రోజు ఆయన శత జయంతి. అనేక మాధ్యమాల్లో ఇప్పటికీ ఆయన మనకు కనిపిస్తున్నారు. అల్లు స్టూడియో అనేది ఓ జ్ఞాపిక. లాభాపేక్ష కోసం కట్టింది కాదు. గీతా ఆర్ట్స్‌, అల్లు స్టూడియో, ఆహా ఓటిటి అన్నింటిని నా కుమారులకు అప్పగిస్తున్నాను’’ అని అన్నారు. 


మా తాతయ్య కోరిక ఇది...

ఈ రోజు తాతయ్య వందో జయంతి. మాకెంతో ప్రత్యేకమైన రోజు. మామూలుగా తండ్రి మరణిస్తే.. ఏడాది.. లేదా ఓ ఐదేళ్లు గుర్తుంచుకుంటారు. ప్రతి ఏడాది వారిని స్మరించుకుంటూ చేయాల్సిన కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ మా నాన్న మాత్రం వారి తండ్రిని మరచిపోలేదు. సంవత్సరం సంవత్సరానికి మా తాతయ్య మీద మా నాన్నకు ప్రేమ పెరుగుతూనే ఉంది. మా నాన్న ప్రేమ చూస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుంది. అల్లు అరవింద్‌ పెద్ద నిర్మాత. స్థలాలు ఉన్నాయి. స్టూడియో కట్టడం పెద్ద కష్టం కాదు అని కొందరు అనుకోవచ్చు. అయితే మేం ఈ స్టూడియో డబ్బు సంపాదించడం కోసం కట్టలేదు. ఇది మా తాతయ్య కోరిక. ఆయన జ్ఞాపకార్ధం నిర్మించాం. ఈ స్టూడియో ద్వారా పరిశ్రమకు ఎన్నో సేవలు అందాలి’’ అని అల్లు అర్జున్‌ అన్నారు. 




Updated Date - 2022-10-01T18:58:16+05:30 IST