మోహన్‌బాబుకు చిరంజీవి ఫోన్
ABN , First Publish Date - 2021-10-18T09:48:51+05:30 IST
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు మోహన్‌బాబు, చిరంజీవి మధ్య చిచ్చు పెట్టాయనే పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. రెండు వర్గాలుగా ఏర్పడి పోటీ పడ్డారని ఫిల్మ్‌నగర్ సర్కిళ్లలో పలువురు వ్యాఖ్యానించారు...

‘మా’ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వలేదన్న చిరంజీవి
అందరం కలిసికట్టుగా ఉందామన్న మోహన్‌బాబు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు మోహన్‌బాబు, చిరంజీవి మధ్య చిచ్చు పెట్టాయనే పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. రెండు వర్గాలుగా ఏర్పడి పోటీ పడ్డారని ఫిల్మ్‌నగర్ సర్కిళ్లలో పలువురు వ్యాఖ్యానించారు. ప్రకాశ్‌రాజ్‌కు అన్నయ్య చిరంజీవి మద్దతు ఉందని నాగబాబు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రకాశ్‌రాజ్ కోసం తనను అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకోమని మోహన్‌బాబుకు చిరంజీవి ఫోన్ చేసినట్టు విష్ణు మంచు సైతం వ్యాఖ్యానించారు. అయితే... తాజాగా మోహన్‌బాబుకు ఫోన్ చేసిన చిరంజీవి తాను ఎవరికీ మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేసినట్టు తెలిసింది. అకారణంగా తన పేరు బయటకు వచ్చిందని చెప్పారట. మోహన్‌బాబు స్నేహపూర్వకంగా స్పందించారని, అందరం కలసికట్టుగా ఉండాలనేది తన అభిమతమని చిరంజీవితో చెప్పినట్టు సమాచారం. ‘మా’ ఎన్నికల పూర్తయినా... ఎన్నికలకు ముందు, ఆ తర్వాత పరిణామాలపై ఇటు పరిశ్రమ వర్గాల్లో, అటు ప్రజల్లో చర్చ జరుగుతోంది.
చిరంజీవి కుడి చేతికి సర్జరీ
‘‘కుడి చేతితో ఏ పని చేయాలన్నా నొప్పిగా, తిమ్మిరిగా అనిపిస్తుండటంతో వైద్యుల్ని సంప్రదించా. మణికట్టు దగ్గరల్లో ఉన్న నరం మీద ఒత్తిడి పడటం వల్ల అలా అనిపిస్తుందని... కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారని సర్జరీ చేశారు. 15 రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. అందువల్ల, ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణకు విరామం ఇచ్చా. నవంబర్ 1న మళ్లీ సెట్స్‌కు వెళతా’’ అని ఓ సమావేశంలో చిరంజీవి తెలిపారు.