అల్లర్లతో ‘మా’ పరువు తీయవద్దు: చిరంజీవి
ABN , First Publish Date - 2021-10-11T03:56:40+05:30 IST
మూలలలోకి వెళ్లి సమస్యను దూరం చేసుకుంటే మన ఇండస్ట్రీ వసుదైక కుటుంబం అవుతుందని, దీని కోసం సమస్యలను సృష్టించే వారిని దూరం పెట్టడం మంచిదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో
మూలలలోకి వెళ్లి సమస్యను దూరం చేసుకుంటే మన ఇండస్ట్రీ వసుదైక కుటుంబం అవుతుందని, దీని కోసం సమస్యలను సృష్టించే వారిని దూరం పెట్టడం మంచిదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ‘పెళ్లి సందD’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి తాజాగా ‘మా’ ఎన్నికల నేపథ్యంలో జరిగిన సంఘటనలపై తొలిసారి స్పందించారు.
ఇటీవల చోటుచేసుకున్న ‘మా’ సంఘటనలపై ఆయన మాట్లాడుతూ..‘‘అందరి మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే.. ఈ పరిశ్రమలో వివాదాలు, కొట్టుకోవడాలు, మాటలు అనడం, మాటలు అనిపించుకోవడం వంటివి ఉండవు కదా. ఏదైనా ఇక్కడ తాత్కాలికం. పదవులు రెండేళ్లుంటాయా? మూడేళ్లుంటాయా?. చిన్న చిన్న బాధ్యతల వంటి వాటి కోసం మాటలు అనడం, అనిపించుకోవడం చూస్తుంటే బయటివాళ్లకి ఎంత లోకువ అయిపోతామో కదా?. ఒక పదవి కోసం అంత లోకువ కావాలా? నాకిది చాలా బాధ అనిపించింది. ఎవరైనా కానివ్వండి.. ఏ ఒక్కరినీ నేను వేలు పెట్టి చూపించడం లేదు. అది విజ్ఞతతోటి, మెచ్యూరిటీతోటి ప్రతి ఒక్కరూ ఉండాలి తప్ప.. మన ఆధిపత్యం చూపించుకోవాలని, మన ప్రభావాన్ని చూపించుకోవడం కోసం అవతలి వారిని కించపరచాల్సిన అవసరం లేదు. వాళ్లు మమ్మల్ని అన్నారు కదా.. అంటే మీరు వారిని అన్నారు కదా.. అని కాదు.. ఎక్కడ స్టార్ట్ అయ్యిందో గుర్తుంచుకోండి. ఎవరి కారణంగా ఈ మధ్య వివాదాలు స్టార్ట్ అయ్యాయో ఆ మనిషిని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హోమియోపతి కావాలి. హోమియోపతి లక్షణం ఏమిటంటే.. మూలాలలోకి వెళ్లి సమస్యను దూరం చేస్తుంది. మనం కూడా మూలాలలోకి వెళ్లి ఆలోచించండి. ఎవరు.. దీనికంతటికి కారణం? అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచితే కనుక మనది వసుదైక కుటుంబం అవుతుంది..’’ అని అన్నారు.