‘రాజ్యసభ టికెట్’.. వార్తలపై స్పందించిన చిరంజీవి

ఏపీ సీఎం వైఎస్ జగన్ తనకు రాజ్యసభ టికెట్ ఆఫర్ చేశారని వస్తున్న వార్తలను మెగాస్టార్ చిరంజీవి కొట్టిపారేశారు. వరుసగా రెండో రోజు (శుక్రవారం) విజయవాడలో దర్శనమిచ్చిన చిరంజీవి.. రాజ్యసభ టికెట్ అని వినిపిస్తున్న వార్తలు కేవలం రూమర్లు మాత్రమేనని మీడియాకు తెలిపారు. నిన్న (గురువారం) వైఎస్ జగన్‌‌తో సుమారు రెండు గంటల పాటు చిరంజీవి భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీపై అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. ఇన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న చిరు ఇప్పుడే ఎందుకెళ్లి భేటీ అయ్యారు..? అసలు ఇది సినీ రంగానికి సంబంధించిన భేటీనా.. లేకుంటే రాజకీయంగా ఏదైనా విషయాలపై చర్చించారా..? చిరంజీవికి జగన్ బంపరాఫర్ ఇవ్వబోతున్నారా..? అని చిత్రవిచిత్రాలుగా సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఈ వార్తలపై తాజాగా చిరంజీవి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 


‘‘నేను రాజకీయాలకు పూర్తిగా దూరం. నాకు రాజ్యసభ టికెట్ అని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. ఆ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు నేను అతీతం. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు ఎలాంటి ఆఫర్లు రావు.. అలాంటివి నేను కోరుకోవడం లేదు కూడా. అటువంటి వాటికి నేను పూర్తిగా దూరమని ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను..’’ అని చిరంజీవి తెలిపారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.