Tollywood: ఏపీ సీఎం నుంచి పిలుపెప్పుడు?

ABN , First Publish Date - 2021-09-20T21:33:29+05:30 IST

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చలనచిత్ర పరిశ్రమ సమస్యలను పట్టించుకుని, సానుకూలంగా పరిష్కార మార్గం చూపెట్టాలని టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా రెండు ప్రభుత్వాలను మెగాస్టార్ చిరంజీవి తాజాగా జరిగిన ‘లవ్ స్టోరి’ ప్రీ రిలీజ్ వేడుకలో..

Tollywood: ఏపీ సీఎం నుంచి పిలుపెప్పుడు?

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చలనచిత్ర పరిశ్రమ సమస్యలను పట్టించుకుని, సానుకూలంగా పరిష్కార మార్గం చూపెట్టాలని టాలీవుడ్ తరపున రెండు ప్రభుత్వాలనూ.. మెగాస్టార్ చిరంజీవి తాజాగా జరిగిన ‘లవ్ స్టోరి’ ప్రీ రిలీజ్ వేడుకలో కోరిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇండస్ట్రీలలో సినీ ఇండస్ట్రీ కూడా ఒకటి. ముఖ్యంగా ఏపీలో టికెట్ల రేట్స్‌పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. పెద్ద సినిమాలకు రెవిన్యూ వచ్చే అవకాశం లేదు. అందుకే పెద్ద సినిమాలు రెడీ అయ్యి కూడా విడుదలకు నోచుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యతో పాటు సినీ పరిశ్రమకు చెందిన మరికొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ప్రయత్నం చేశారు. అయితే సీఎం జగన్‌ను కలిసే పరిస్థితులు లేక మొదట విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారిని కలిసి సమస్యలను తెలియజేశారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ సమస్యలపై సీఎం జగన్‌తో మాట్లాడేందుకు చిరంజీవితో పాటు మరికొందరని ఆహ్వానించినట్లుగా ప్రభుత్వం తరపు నుంచి మంత్రి పేర్ని నాని ఓ ప్రకటన చేశారు.


ఆ ప్రకటన తర్వాత చిరంజీవి.. సినీ ఇండస్ట్రీలోని నిర్మాతలు, డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లను పిలిచి తన ఇంట్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఇండస్ట్రీ సమస్యలన్నింటినీ తెలుసుకుని సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు చిరు రెడీ అవుతున్న సమయంలో సీఎం జగన్‌తో మీటింగ్ ఇప్పుడప్పుడే కాదనేలా పేర్ని నాని రీసెంట్‌గా ఓ ప్రకటన చేశారు. సీఎం జగన్‌తో సమావేశం కుదరదనేలా నాని ప్రకటన రావడంతో సినీ ఇండస్ట్రీ తరపున పబ్లిక్ ఫంక్షన్‌లో రెండు ప్రభుత్వాలకు చిరంజీవి తన వినతిని విన్నవించాడు. అనంతరం నేడు(సోమవారం) టాలీవుడ్‌కి చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు.. పేర్ని నానితో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఇదంతా చూస్తుంటే సీఎం జగన్ మాత్రం చిరంజీవి అండ్ బృందానికి ఇప్పుడప్పుడే అపాయింట్‌మెంట్ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. పేర్ని నానితో సినీ పెద్దల చర్చలు సానుకూలంగా జరిగి, ఆ తర్వాత జగన్ దృష్టికి అవి వెళ్లి.. అప్పుడు జగన్ నుండి పిలుపురావాలి. ఇదంతా జరిగేది ఎప్పుడు? సీఎం జగన్ ‌నుండి పిలుపువచ్చేది ఎప్పుడు?

Updated Date - 2021-09-20T21:33:29+05:30 IST