పరిశ్రమ పెద్దగా కాదు.. బిడ్డగా వచ్చాను: చిరంజీవి

జగన్‌తో ఆరోగ్యకర చర్చ జరిగింది! 

వివాదాలకు ఇక ఫుల్‌స్టాఫ్‌ పడినట్లే! 

దయచేసి ఎవరూ మాట జారవద్దు..

రెండు కోణాల్లోనూ ఆలోచిస్తా అన్నారు

జగన్‌ ఇచ్చిన భరోసాతో ఎనలేని ధైర్యం ఏర్పడింది

వారం, పదిరోజుల్లో జీవో ఆమోదం

– చిరంజీవి


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా జరిగిందన మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు.  పరిశ్రమ పెద్దగా కాకుండా బిడ్డగా సినీ పరిశ్రమ కష్టాలను జగన్‌ ముందు ఉంచడానికి వచ్చానని ఆయన తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌ను చిరంజీవి కలిశారు. దాదాపు గంటన్నర సాగిన ఈ భేటీలో సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ సమావేశం ఎంతో సంతృప్తికరంగా సాగింది. సీఎం నన్ను ఓ సోదరుడిలా పండగవేళ ఆహ్వానించి ఆప్యాయంగా మాట్లాడారు. ఆయన మాట తీరు బాగా నచ్చింది. భారతిగారు స్వయంగా భోజనం వడ్డించడం ఆనందంగా అనిపించింది. కొద్ది రోజులుగా సినిమా టికెట్‌ ధరల విషయంలో ఒక మీమాంశ ఉంది. దీని వల్ల పరిశ్రమలో అగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందోననే అసంతృప్తి ఓ వైపు.. ఇండస్ర్టీకి మంచి చేద్దామనేదే తమ ఉద్దేశం అని చెబుతున్న ప్రభుత్వం ఒక వైపు. పరిష్కారం దొరకని ఈ సమస్య రోజురోజుకి పెద్దది అవుతోంది. ఈ నేపథ్యంలో సీయం జగన్‌ ప్రత్యేకంగా నన్ను పిలిచారు. ఒక సమస్య గురించి నిర్ణయం తీసుకునే ముందు ఒక కోణంలోనే వినటంకాదు రెండో కోణంలోనూ వినాలని అన్నారు. ‘మీరు వచ్చిన సమస్యలను వినిపిస్తే దానిపై తుది నిర్ణయం తీసుకోవచ్చు అని ఆయన నాతో అన్న మాటలకు నాపై పెట్టిన నమ్మకం, భరోసా ఎంతో బాధ్యతగా అనిపించింది’’ అని అన్నారు. 


‘‘సామాన్య ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే ఆయన ప్రయత్నాన్ని అభినందిస్తూ, పరిశ్రమలో ఉన్న సాధక బాధకాలు, ఎగ్జిబిషన్‌ రంగంలో థియేటర్‌ యజమానులు పడుతున్న కష్టాలను ఆయన వివరించాను. ఆయన సానుకూలంగా స్పందించారు. వీటి అన్నింటినీ పరిగణలోకి తీసుకుని, కమిటీతో మాట్లాడి పరిశ్రమకు మంచి జరిగేలా ఓ నిర్ణయం తీసుకుంటామని మాటిచ్చారు. పేద కార్మికులకు మంచి చేస్తానని చెప్పారు.  డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌రంగంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. థియేటర్లు మూసి వేయాలనే అభద్రతా భావం కూడా ఉంది. ఈ సమస్యలు అన్నింటిని జగన్‌ ముందు ఉంచాను. అన్నింటినీ ఆయన అవగాహన చేసుకున్నారు. అన్ని కోణాల్లోనే ఆలోచించి అందరికీ మంచి జరిగేలా నిర్ణయం తీసుకుని జీవో పాస్‌ చేస్తామని ధైర్యం కల్పించేలా మాట్లాడారు. ఆయన ఇచ్చిన భరోసాతో ఎనలేని ధైర్యం ఏర్పడింది. దయ చేసి పరిశ్రమకు సంబంధించిన ఎవరూ కూడా మాటలు జారవద్దు. నా మాట మన్నించి సంయమనం పాటించండి. వారం, పది రోజుల్లో అందరికీ ఆమోదంగా ఉండే జీవో వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అలాగే  చిన్న సినిమాల కోసం అయిదవ షో కావాలనే కోరికను ఆయన ముందుంచగా దానికి కూడా సానుకూలంగా స్పందించారు. ఆయనతో జరిగిన చర్చ మొత్తాన్ని మా ఇండస్ట్రీకి సంబంధించిన అందరికీ తెలియజేస్తానని, వారేమన్నా సలహాలు ఇస్తే వాటిని కూడా తర్వాతి మీటింగ్‌లో మీ ముందు ఉంచుతాను అని జగన్‌తో చెప్పాను. ఈ సారి ఎక్కడ కలుద్దాం అని అడిగితే ‘ఎందుకు అన్నా... ఎప్పుడు కలిసినా భోజనానికే కలుద్దాం’ అని జగన్‌ అన్నారు. నన్ను సొంతమనిషిలా చూస్తునందుకు ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు జరిగిన వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లే అనిపిస్తుంది. తర్వాతి మీటింగ్‌కు జగన్‌గారు వందమందితో రమ్మంటే పరిశ్రమ అందరితోనూ వస్తాను. అదే అందంగా ఉంటుంది. ఇప్పుడు జగన్‌గారితో మాట్లాడటానికి పరిశ్రమ పెద్దగా కాదు.. బిడ్డగా వచ్చాను’’ అని చిరంజీవి అన్నారు. 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.