ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada), నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దంపతులకు కవలలు జన్మించారు. తాజాగా ఈ ఆనందకరమైన విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిన్మయి గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చాలా పాపులర్. సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు ఎక్కువగా డబ్బింగ్ చెబుతుందీ చిన్మయినే. అంతేకాదు, లావణ్య త్రిపాఠికి 'భలే భలే మగాడివోయ్' సినిమాలో డబ్బింగ్ చెప్పడంతో పాటు ఓ పాటను పాడారు. ఇలా యంగ్ హీరోయిన్స్‌కు డబ్బింగ్ చెప్పడంతో పాటు మంచి పాటలు పాడుతున్న ఆమె అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా కనిపించి ఆకట్టుకుంటున్నారు.
ఇక రాహుల్ రవీంద్రన్ 'అందాల రాక్షసి' సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 'హౌరా బ్రిడ్జ్' సినిమాలోనూ హీరోగా నటించిన రాహుల్ మరికొన్ని సినిమాలలో క్యారెక్టర్స్ కూడా చేసారు. దర్శకుడిగా మారి సుశాంత్ హీరోగా 'చి.ల.సౌ' అనే చిత్రాన్ని తీసి సక్సెస్ అందుకున్నారు. నాగార్జునతో 'మన్మధుడు 2' చిత్రాన్ని తీసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ఆశించినంతగా విజయాన్ని అందుకోలేదు. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న రాహుల్ ఓ బడా నిర్మాణ సంస్థలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
అయితే, ఈ మంగళవారం (జూన్ 21) చిన్మయి, రాహుల్ దంపతులకు ట్విన్స్ పుట్టారు. ఆ విషయాన్ని ఇద్దరు తన ఇన్స్టాగ్రాం, ట్విట్టర్లో ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తమకు పుట్టిన బాబు, పాపకు పేర్లు పెట్టిన విషయాన్ని పోస్ట్‌లో తెలిపారు. పాపకు 'ద్రిప్తా', బాబుకు 'శర్వాస్' అని నామకరణం చేశారు. అంతేకాదు, 'ద్రిప్తా, శర్వాస్... మన విశ్వానికి కొత్త.. ఎప్పటికీ ప్రేమ కేంద్రం' అంటూ లవ్ ఈమోజీలను షేర్ చేసారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి.