‘చెక్‌’ మూవీ రివ్యూ

చిత్రం: చెక్‌

బ్యాన‌ర్‌: భ‌వ్య క్రియేష‌న్స్‌

న‌టీన‌టులు: నితిన్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌, సాయి చంద్, సంపత్ రాజ్, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, హర్షవర్ధన్, రోహిత్, సిమ్రాన్ చౌదరి తదితరులు

సంగీతం: కళ్యాణిమాలిక్

ఛాయా గ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్

ఆర్ట్ : వివేక్ అన్నామలై

ఎడిటింగ్ : అనల్అనిరుద్దన్

ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి

నిర్మాత: వి.ఆనంద ప్రసాద్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి


చాలా రోజులుగా మంచి హిట్ కోసం వెయిట్ చేసిన నితిన్ గ‌త ఏడాది 'భీష్మ‌'తో సూప‌ర్‌హిట్ కొట్టాడు. అదే స్పీడుతో మూడు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఆ మూడు సినిమాల్లో ఓ సినిమా 'చెక్'‌. వైవిధ్య‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడిగా పేరున్న చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఉరిశిక్ష ప‌డ్డ ఓ ఖైదీ జైలులో చెస్ ఆటను నేర్చుకుంటాడు. ఆ ఆట వ‌ల్ల త‌న జీవితంలో ఎదురైన స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించుకున్నాడు?  ఈ క్ర‌మంలో అత‌ను ఎదుర్కొన్న స‌మ‌స్య‌లేంటి?  అనేది సినిమా క‌థాంశ‌మ‌ని టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూసిన ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మైంది. అస‌లు ఉరి శిక్ష ప‌డ్డ ఖైదీ చెస్ నేర్చుకోవ‌డం ఏంటి?  దాని వ‌ల్ల స‌మ‌స్యల నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు అనే పాయింట్‌ను సినిమాగా ఎలా తీశారనే ఆసక్తి అంద‌రిలోనూ క్రియేట్ అయ్యింది. మ‌రి 'చెక్' సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకుందా?  ఈ సినిమాతో నితిన్ మ‌రో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడా?  లేదా?  అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం...

కథ:

ఆదిత్య(నితిన్) ఓ అనాథ. చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగిన ఆదిత్య, తనుంటున్న చోట పరిస్థితులు నచ్చకుండా బయటకు వచ్చేస్తాడు. తన తెలివి తేటలతో చిన్న చిన్న మోసాలు చేస్తూ బతుకుతుంటాడు. ఓసారి అనుకోకుండా యాత్ర(ప్రియా ప్రకాశ్‌ వారియర్‌)తో ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకుంటున్న సమయంలో యాత్ర కనిపించకుండా పోతుంది. అదే సమయంలో దేశంలో జరిగే ఓ టెర్రరిస్ట్‌ ఎటాక్‌లో  40 మందికి పైగా చనిపోతారు. దేశంలో జరిగిన బాంబ్‌ బ్లాస్టులకు ఆదిత్యకు సంబంధం ఉందని కేసును పరిశోధిస్తున్న పోలీసులకు ఆధారాలు దొరుకుతాయి. దాంతో బ్లాస్ట్స్‌కు సంబంధం ఉన్న మిగతా ఉగ్రవాదులతో పాటు ఆదిత్యకు కూడా ఉగ్రవాది అనే ముద్ర వేసి ఉరి శిక్ష వేస్తారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న శ్రీమన్నారాయణ(సాయిచంద్‌) అనే మరో ఖైదీ సహాయంతో చెస్‌ నేర్చుకుంటాడు ఆదిత్య. క్రమంగా చెస్‌ ఆటలో మంచి పట్టు సాధించడమే కాకుండా, చెస్‌లో స్టార్‌ ప్లేయర్స్‌ను సైతం ఓడించే రేంజ్‌కు చేరుకుంటాడు ఆదిత్య. క్రమంగా నేషనల్ చెస్‌ ఛాంపియన్‌, ఆ తర్వాత కామన్‌ వెల్త్‌ చెస్‌ పోటీల్లో పాల్గొని విజేతగా నిలుస్తాడు ఆదిత్య. అదే సమయంలో ఆదిత్య..తాను నిరపరాధినని, ఏ నేరం చేయలేదు కాబట్టి  ఉరి శిక్షను తప్పించాలని రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటిషన్‌ పెట్టుకుంటాడు. చెస్‌లో ఆదిత్య సాధిస్తున్న విజయాలు చూసిన అందరూ ఆదిత్యకు రాష్ట్రపతి తప్పకుండా క్షమాబిక్ష పెడతాడని అనుకుంటారు. అయితే అనుకోకుండా జరిగిన ఓ దుర్ఘటన కారణంగా రాష్ట్రపతి ఆదిత్య పెట్టుకున్న క్షమాబిక్షను తిరస్కరిస్తారు. ఆదిత్యను ఉరితీయడానికి ముహూర్తం కుదురుతుంది. ఆదిత్యను ఉరితీయడానికి సర్వం సిద్ధం చేస్తుంటారు. అప్పుడతను ఏం చేస్తాడు..?  అసలు ఆదిత్యను ఉగ్రవాద కుట్రలో ఇరికించిందెవరు? చివరకు కథ ఎలాంటి మలుపు తీసుకుంది?  అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:


ముందుగా నటీనటుల విషయానికి వస్తే.. భీష్మ వంటి హిట్‌ తర్వాత నితిన్‌ కమర్షియల్ సినిమానే చేయాలని కాకుండా డిఫరెంట్ సినిమా చేయాలనే ఆలోచనతో చెక్‌ సినిమాను వాంటెడ్‌గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. సినిమా చూసిన వారు.. నితిన్‌ ఇప్పటి వరకు చేసిన సినిమాలకు ఈ సినిమా కాస్త డిఫరెంట్‌ అని చెబుతారు. మోసాలు చేసే ఓ యువకుడు గ్రాండ్‌ మాస్టర్‌గా ఎలా ఎదిగాడు? అనే పాయింట్‌ను చక్కగా ఎలివేట్‌ చేశాడు దర్శకుడు. నితిన్‌ కూడా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. భయపడుతూ చిన్న చిన్న కేసులను మాత్రమే వాదిస్తూ అనుకోకుండా ఓ ఉగ్రవాది కేసుని డీల్‌ చేసే లాయర్‌ పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చక్కగా నటించింది. ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ పాత్ర పరిమితం.అయితే కథలో కీలకం. అయితే, ఆమె పాత్రలోని సీక్రెట్‌ను రివీల్ చేయలేదు దర్శకుడు.ప్రియా వారియర్‌ పాత్రను అలాగే వదిలేశారు. ఇక జైలులో హీరోను చెస్‌ ఛాంపియన్‌గా మార్చే గురువు పాత్రలో సాయిచంద్‌ చక్కగా నటించాడు. ఇక మురళీశర్మ, సంపత్‌ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. 


టెక్నీషియన్స్‌ విషయానికి వస్తే.. దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించాడు. అయితే సినిమాలో ప్రేక్షకుడికి చాలా ప్రశ్నలకు సమాధానం కనిపించదు. అసలు ఉగ్రవాది దాడికి, నితిన్‌కి ఉన్న లింకేంటి?  ఉగ్రవాదులు నితిన్‌నే ఎందుకు టార్గెట్‌ చేసుకున్నారు? అసలు ఈ ప్లాన్‌ వెనుక సూత్రధారి ఎవరు?  అనే విషయాలపై క్లారిటీ లేదు. ఇవన్నీ తెలియాలంటే చెక్‌ సీక్వెల్‌ కోసం వెయిట్‌ చేయాల్సిందే అనే తీరులో సినిమాను డైరెక్టర్‌ తెరకెక్కించాడు. ముగింపు కూడా అలాగే ఇచ్చాడు. కల్యాణి మాలిక్‌ సంగీతం అందించిన ఈ సినిమాలో కేవలం ఓ పాట మాత్రమే ఉంది.  నేపథ్య సంగీతం బాగుంది. రాహుల్‌ శ్రీవాత్సవ్‌ కెమెరా పనితం కూడా ఓకే. పాయింట్‌ బాగానే ఉన్నా.. సినిమాలో ఎక్కువ భాగాన్ని చెస్‌ ఆట చుట్టూనే రన్‌ చేశారు. సందర్భానుసారం వచ్చే డైలాగ్స్‌ బావున్నాయి. సినిమా సెకండాఫ్‌లో అయినా సీక్రెట్స్‌ రివీల్‌ అవుతాయనుకుంటే .. ఉన్నట్లుండి సినిమాను ఎండ్ చేసి ప్రేక్షకుడికి దర్శకుడు షాకిచ్చాడు. 


చివరగా.. చెక్‌.. ప్రత్యర్థి ఎవరో తెలియకుండానే హీరో ఆడిన ఆట

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.