మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తమ అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. వారు హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని లేకుండా విడుదలైన అన్ని చోట్లా.. ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతోంది. క్రిటిక్స్ సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం హిట్ టాక్ని సొంతం చేసుకుని.. కేవలం ప్రీమియర్స్‌తోనే రికార్డులను క్రియేట్ చేసింది. చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం సొంతం చేసుకోవడంతో.. మెగా, నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రం ఇంత పెద్ద విజయానికి కారణమైన అభిమానులకు, ప్రేక్షకులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపితే, రామ్ చరణ్ తన ఇంటి వద్దకు భారీగా తరలివచ్చిన అభిమానులను చూసి ఆనందంతో అభివాదం చేశారు. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.