క్యారెక్టర్‌ ఆర్టిస్టుల దూకుడుకు కళ్లెం వేయగలరా?

ABN , First Publish Date - 2022-08-07T05:30:00+05:30 IST

ప్రశాంతంగా ఉన్న టాలీవుడ్‌లో అలజడి. షూటింగులు ఆగిపోయాయి. థియేటర్లకు జనాలు రావడం మానేశారు. ఓటీటీ భూతంలా కనిపిస్తోంది. బడ్జెట్‌ని అదుపులో పెట్టకపోతే నిర్మాత అధోగతి ..

క్యారెక్టర్‌ ఆర్టిస్టుల దూకుడుకు కళ్లెం వేయగలరా?

ప్రశాంతంగా ఉన్న టాలీవుడ్‌లో అలజడి.

షూటింగులు ఆగిపోయాయి.

థియేటర్లకు జనాలు రావడం మానేశారు.

ఓటీటీ భూతంలా కనిపిస్తోంది.

బడ్జెట్‌ని అదుపులో పెట్టకపోతే నిర్మాత అధోగతి 

పాలవుతాడన్న నిజం తెలిసొచ్చింది. 

అందుకే సినిమా బండికి రిపేర్లు మొదలెట్టారు. ఖర్చుని

 ఎక్కడ, ఎలా అదుపులో పెట్టాలో.. ఆలోచనలో పడ్డారు. 

అందరి దృష్టీ.. హీరోల పారితోషికాలపై ఉంది గానీ, 

క్యారెక్టర్‌ ఆర్టిస్టులూ తక్కువ తినడం లేదు. వాళ్ల రోజు వారీ 

వేతనాలు లక్షలు దాటి కోట్లు అవుతున్నాయి. గొంతెమ్మ 

కోరికలు.. నిర్మాతల గుండెల్లో భారంగా మారుతున్నాయి.

 క్యారెక్టర్‌ ఆర్టిస్టుల దూకుడుకు అడ్డుకట్ట వేయాలని 

ఇప్పుడు నిర్మాతలంతా తర్జన భర్జనలు పడుతున్నారు. 

ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ ఇదే.


హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్ల రెమ్యునరేషన్లు ఇదివరకెప్పుడూ లేనంతగా పెరిగిపోయాయన్నది నిజం. హీరోలు కూడా ఈ విషయం ఒప్పుకొంటారు. అవసరమైతే.. కాస్తో కూస్తో తగ్గించుకొంటారు. అంతిమంగా ఎవరికైనా ఓ హిట్టు అవసరం. తన సినిమా హిట్టయితే హీరో మైలేజీ అమాంతం పెరుగుతుంది. ఆ తరవాత వద్దన్నా పారితోషికాలకు రెక్కలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు తగ్గించుకొంటే, పోయేదేం లేదు. పైగా సినిమా మరీ దారుణమైన పరాజయాన్ని పొంది, నిర్మాత.. బయ్యరూ నష్టపోతే, ఎంతో కొంత తిరిగి ఇచ్చే ఉదార స్వభావం మన హీరోలకు ఉంది. అదీ లేదంటే... ‘తరువాతి సినిమా నువ్వే చేసుకో..’ అని సదరు నిర్మాతకు అభయ హస్తం అందిస్తారు. అలా ఓ సినిమాతో దెబ్బ తిన్నా, మరో సినిమాతో కోలుకొన్న సందర్భాలు టాలీవుడ్‌లో కోకొల్లలుగా కనిపిస్తాయి. కానీ.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుల విషయంలో అలా ఏనాడూ జరగలేదు. వాళ్లకి  ఇవ్వడం తప్ప... తిరిగి తీసుకోవడం ఏ నిర్మాతా చూళ్లేదు.


సినిమాకి హీరో ఎంత ముఖ్యమో, క్యారెక్టర్‌ ఆర్టిస్టులూ అంతే ముఖ్యం. చిన్న సినిమాలకైతే మరీనూ. పెద్ద సినిమాల్ని హీరో ఒక్కడే ఒంటి చేత్తో లాగించేస్తాడు. చిన్న సినిమాలు అలా కాదు. కథని నడిపించే బలమైన క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ఉన్నప్పుడే ఆ సినిమాకి రంగు, రుచి, వాసన. అలాంటి చోట... కాస్త ఖరీదైనా సరే, పాపులర్‌ నటీనటుల్ని తీసుకురావాలని దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. టాలీవుడ్‌లో ప్రస్తుతం ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేశ్‌, మురళీ శర్మ, సముద్రఖని, రాజేంద్రప్రసాద్‌, నరేశ్‌ వీళ్లంతా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా స్టార్‌ హోదా అనుభవిస్తున్నవాళ్లే. వీళ్ల పారితోషికాలు రోజుల వారీగా ఇస్తుంటారు. ఒకొక్కరికీ రోజుకి దాదాపు రూ.3 నుంచి 7 లక్షల వరకూ ఇవ్వాల్సిందే. ఇది వరకు బ్రహ్మానందం మాత్రమే రోజువారీ పారితోషికం పుచ్చుకొనేవారు. ప్రతీ సినిమాలోనూ బ్రహ్మానందం ఉండాల్సిందే అనే సెంటిమెంటుతో ఆ తరవాత ఆయన్ని ‘గంటల’ లెక్కన పంచుకోవడం మొదలైంది. అది వేరే సంగతి. రోజువారీ లెక్క ఆ తరవాత ఈ అలవాటు అందరికీ పాకేసింది.


ఓ పెద్ద సినిమా కోసం రావు రమేశ్‌ లాంటి క్యారెక్టర్‌ ఆర్టిస్టు కావాలంటే నిర్మాతకు ఖర్చు తడిసి మోపెడవుతుంది. దాదాపు 20, 30 రోజుల పాటు రావు రమేశ్‌ డేట్లు అవసరం అవుతాయి. రోజుకి రూ.5 లక్షలు అనుకొన్నా, ఆయనకే కోటిన్నర చెల్లించాల్సి వస్తోంది. సముద్రఖని పారితోషికం దాదాపుగా రోజుకి రూ.7 లక్షలని టాక్‌. ఓ తమిళ నటుడ్ని తెలుగులోకి తీసుకొచ్చి రోజుకి రూ.7 లక్షలు ఇస్తున్నారంటే ఆశ్చర్యమేస్తుంటుంది. ఇంకాస్త షాకింగ్‌ విషయం ఏమిటంటే, సముద్రఖని ఓ తమిళ సినిమా కోసం అందుకొంటున్న పారితోషికం ఇందులో  రూ.3 నుంచి రూ.4 లక్షల వరకూ మాత్రమే. ‘ఉప్పెన’ కోసం విజయ్‌ సేతుపతిని తెలుగులోకి తీసుకొచ్చారు. రోజుకి రూ.25 లక్షలు ఇస్తామన్నది ప్రతిపాదన. 10  రోజుల్లో షూటింగ్‌ ముగిస్తే, విజయ్‌ పారితోషికం రూ.2.5 కోట్లతో సరిపెట్టవచ్చు. విజయ్‌ లాంటి స్టార్‌ హీరోతో ఇది మంచి డీలే. కానీ.. 10 రోజుల షూటింగ్‌ కాస్తా.. 25 రోజుల వరకూ చేయాల్సివచ్చింది. అలా.. రూ.7.5 కోట్ల లెక్క తేలింది. ‘పుష్ప’లో ఫహద్‌ ఫాజల్‌ కీ ఇలానే భారీగా పారితోషికం సమర్పించుకోవాల్సివచ్చింది. ‘ఉప్పెన’, ‘పుష్ప’ ఇవి రెండూ అద్భుతమైన విజయాలు సాధించి నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టాయి. లేదంటే - వీళ్ల పారితోషికాలతోనే నిర్మాణ సంస్థ సగం మునిగిపోయేది. 


అప్పుడప్పుడూ బాలీవుడ్‌ నటీనటుల్ని కూడా తెలుగులోకి తీసుకొస్తుంటారు. వాళ్ల పారితోషికాలు మరింత భయంకరంగా ఉంటాయి. ‘అత్తారింటికి దారేది’ కోసం బొమన్‌ ఇరానీని తెలుగు తెరకు పరిచయం చేశారు. బొమన్‌ తన సినీ జీవితంలో అత్యధిక పారితోషికం తీసుకొన్నది ఈ సినిమాకే అని టాక్‌. ఆ తరవాత.. ‘బెంగాల్‌ టైగర్‌’ కోసం కూడా బొమన్‌ భారీ మొత్తమే డిమాండ్‌ చేశారు. ఇప్పుడు అనుపమ్‌  ఖేర్‌ వంతు వచ్చింది. ‘కార్తికేయ 2’లో అనుపమ్‌ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘టైగర్‌ నాగేశ్వరరావు’లోనూ ఆయన కనిపించనున్నారు. ఈరెండు సినిమాలకూ రోజుల లెక్కన ఆయన పారితోషికం అందుకొన్నారని టాక్‌. 


హీరోలకు డిమాండ్‌ - సప్లై అంటూ ఎలాగైతే ఓ సూత్రం చెబుతారో, వీళ్ల విషయంలోనూ అంతే. ఎవరి డిమాండ్‌ని బట్టి వాళ్లు డబ్బు అందుకుంటారు. ఇక్కడ అసలు సమస్య క్యారెక్టర్‌ ఆర్టిస్టుల పారితోషికాలు కాదు. వాళ్ల ఎగస్ర్టా ఖర్చులు. అవి తడిసి మోపెడు అవుతున్నాయి. ఓ సహాయ నటుడు సెట్లో ఉన్నాడంటే తనకో కార్‌ వాన్‌ కావాలి. సిబ్బందికి మరో కార్‌వాన్‌ ఏర్పాటు చేయాలి. సదరు ఆర్టిస్టు చెన్నై నుంచో, ముంబై నుంచో వస్తే, కనీసం 5 నక్షత్రాల హోటెల్‌లో బస ఏర్పాటు చేయాలి. స్టాఫ్‌ కి మూడు నక్షత్రాల హోటెల్‌లో గదులు కేటాయించాలి. ప్రతీ క్యారెక్టర్‌ ఆర్టిస్టుకీ ముగ్గురు నుంచి ఐదుగురు వరకూ వ్యక్తిగత సిబ్బంది ఉంటుంది. ఆ సినిమా జరుగుతున్నన్ని రోజులూ.. వాళ్ల జీత భత్యాలు నిర్మాతలే భరించాలి. తిండి ఖర్చు, రోజువారీ బేటా మామూలే. ఇవన్నీ లెక్కేస్తే, క్యారెక్టర్‌ ఆర్టిస్టుకి ఇచ్చే పారితోషికానికి మించి పోతోంది. ఇప్పుడు ఈ ఖర్చుకి కత్తెర వేయాలన్నది నిర్మాతల ప్రయత్నం. 




ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ ఇటీవల మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)తో ఓ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సహాయ నటులతో వచ్చే ఇబ్బందులు, వాళ్ల పేచీలు, గొంతెమ్మ కోర్కెలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది. ‘‘క్యారెక్టర్‌ ఆర్టిస్టు ఎంత స్టార్‌ అయినా సరే, వాళ్లకు మేం పారితోషికం మాత్రమే ఇస్తాం. సిబ్బంది జీత భత్యాలతో మాకు సంబంధం లేదు’’ అని ఓ నిర్మాత తెగేసి చెప్పార్ట. మిగిలిన నిర్మాతలదీ ఇదే మాట. ‘‘సహాయ నటులకు ఇచ్చే పారితోషికంతో  మాకు ఇబ్బంది లేదు. వాళ్లకున్న డిమాండ్‌ మేరకే ఇస్తాం. అయితే... సమయ పాలన చాలా అవసరం. ఉదయం ఆరింటికి సెట్‌ కి రమ్మంటే, తొమ్మిదింటికి రావడం, ఆరు దాటకుండానే వెళ్లిపోవడం చేస్తున్నారు. దీని వల్ల నిర్మాతలకు ఎంత ఇబ్బందో ఆలోచించడం లేదు. ఇచ్చిన టైమ్‌కి సెట్‌లో లేకపోయినా, దర్శక నిర్మాతలకు సహకరించకపోయినా, అటువంటి వారిపై ‘మా’ చర్యలు తీసుకోవాలి’’ అని ఓ నిర్మాత కోరారు. ‘మా’లో సభ్యత్వం ఉన్నవాళ్లని మాత్రమే సినిమాల్లో ఎంచుకోవాలని ‘మా’ కూడా గట్టిగా డిమాండ్‌ చేస్తోంది. అలాగైతే.. వాళ్లని కంట్రోల్‌ చేయడం కూడా తేలికవుతుంది. నిర్మాతల కష్టాలు ఎప్పుడు గట్టెక్కుతాయో, ఈ క్యారెక్టర్‌ ఆర్టిస్టులంతా ఎప్పుడు దారిలోకి వస్తారో తెలీదు గానీ, మొత్తానికి మంచి ప్రయత్నమైతే జరుగుతోంది. ముందు ఇంటికి చక్కదిద్దుకోవడం అత్యవసరమని నిర్మాతలు నమ్మడం, రిపేర్లు మొదలెట్టడం ఆహ్వానించదగిన పరిణామం. మరి ఈ ప్రయత్నాలు, రిపేర్లు సత్ఫలితాలు ఇస్తే... నిర్మాతలు పాటిస్తున్న బంద్‌కి ఓ సార్థకత చేకూరుతుంది. 

Updated Date - 2022-08-07T05:30:00+05:30 IST