‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ మూవీ రివ్యూ

ABN , First Publish Date - 2021-03-19T19:49:47+05:30 IST

అగ్ర క‌థానాయకుల‌తో సినిమాలు చేస్తూ వ‌చ్చిన గీతాఆర్ట్స్..

‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ మూవీ రివ్యూ

చిత్రం:  చావు క‌బురు చ‌ల్ల‌గా

స‌మ‌ర్ప‌ణ‌: అల్లు అర‌వింద్‌

బ్యాన‌ర్:  జీఏ2 పిక్చర్స్‌

న‌టీన‌టులు:  కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, భ‌ద్ర‌మ్‌, ఆమ‌ని, మురళీ శర్మ, రజిత, మహేశ్, ప్రభు తదితరులు

ద‌ర్శ‌క‌త్వం:  కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి

నిర్మాత‌: బ‌న్నీ వాస్‌

సినిమాటోగ్ర‌ఫీ:  క‌ర‌మ్ చావ్లా, సునీల్ రెడ్డి

మ్యూజిక్‌:  జేక్స్ బిజోయ్

ఆర్ట్:  జి.ఎం.శేఖ‌ర్‌

ఎడిటింగ్‌:  స‌త్య‌.జి‌


అగ్ర క‌థానాయకుల‌తో సినిమాలు చేస్తూ వ‌చ్చిన గీతాఆర్ట్స్.. వైవిధ్య‌మైన క‌థ‌లతో సినిమాలు చేస్తూ యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌డానికి అనుబంధ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్‌ను స్థాపించింది. ఈ సంస్థ‌లో ప‌రిమిత బ‌డ్జెట్‌లో యువ హీరోలు, ‌ర్శ‌కులు చేసిన‌ ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, గీత గోవిందం, టాక్సీవాలా, ప్ర‌తిరోజూ పండగే’ చిత్రాలు మంచి విజ‌యాల‌ను ద‌క్కించుకున్నాయి. ఈ క్ర‌మంలో జీఏ2 పిక్చ‌ర్స్ సంస్థ‌లో రూపొందిన మ‌రో చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. కార్తికేయ హీరోగా, కౌశిక్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్ చేసిన ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమా ఎలా ఉంటుందోన‌నే ఆస‌క్తిని క్రియేట్ చేశాయి. మ‌రి సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో చూద్దాం...


క‌థ‌:

బాల‌రాజు(కార్తికేయ‌) స్వర్గపురి వాహనం(మృతదేహాలను  తీసుకెళ్లే వాహనం)‌. త‌ల్లి గంగ‌మ్మ‌(ఆమ‌ని)తో క‌లిసి ఓ బ‌స్తీలో నివ‌సిస్తుంటాడు. దాంతో అంద‌రూ త‌న‌ను బ‌స్తీ బాల‌రాజు అని పిలుస్తుంటారు. ఓసారి పీట‌ర్ అనే వ్య‌క్తి చనిపోతాడు. అత‌ని శ‌వాన్ని శ్మ‌శానికి తీసుకెళ్ల‌డానికి వెళ‌తాడు బాల‌రాజు. అక్క‌డ పీట‌ర్ శ‌వం ప‌క్క‌న ఏడుస్తున్న అత‌ని భార్య మ‌ల్లిక‌(లావ‌ణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని అంద‌రి ముందు చెబుతాడు. అంద‌రితో త‌న్నులు తింటాడు. అయినా కూడా మ‌ల్లిక‌ను ప్రేమించ‌డం మాన‌డు బాల‌రాజు. అదే స‌మ‌యంలో తన కన్నతల్లి, త‌మ ఏరియాలో ఉండే మోహ‌న్‌(శ్రీకాంత్ అయ్య‌ర్‌) అనే వ్యక్తితో స‌న్నిహితంగా ఉంద‌ని తెలిసి కోపం పెంచుకుని, ఆ వ్యక్తిపై దాడి చేస్తాడు. అయితే చివరకు త‌న త‌ల్లి ప్రేమ‌ను అర్థం చేసుకున్న బాల‌రాజు.. మోహన్ తో గంగ‌మ్మ‌కు పెళ్లి చేయాల‌ని అనుకుంటాడు. త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాల‌తో మ‌ల్లిక కూడా బాల‌రాజుకు ద‌గ్గ‌ర‌వుతుంది. అప్పుడే  బాల‌రాజు జీవితంలో జ‌రిగే షాకింగ్ ఘ‌ట‌నతో క‌థ అనుకోని మ‌లుపు తిరుగుతుంది. మ‌ల్లిక మ‌రొక‌రిని పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌ప‌డుతుంది. ఇంత‌కీ బాల‌రాజు జీవితంలో ఏం జ‌రుగుతుంది? మ‌ల్లిక‌ను బాల‌రాజు దూరం చేసుకున్నాడా? అస‌లు ఏం జ‌రిగింది?  అనే విష‌యం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.



స‌మీక్ష‌: 

జీవితంలో గ‌తం అనేది జ్ఞాప‌కంగా ఉండాలి. కానీ.. గ‌త‌మే జీవితం కాకూడ‌దు అనే కాన్సెప్ట్‌ను క‌థ‌గా రాసుకుని చేసిన చిత్రం చావు క‌బురు చ‌ల్ల‌గా. తొలి చిత్రం ఆర్‌.ఎక్స్ 100లో ల‌వర్‌బోయ్‌లా క‌నిపించిన కార్తికేయ‌కు ఆ త‌ర్వాత ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. దాంతో రూటు మార్చి డిఫరెంట్ క్యారెక్ట‌రైజేష‌న్‌తో రూపొందిన చావు క‌బురు చ‌ల్ల‌గాలో న‌టించాడు. మృతదేహాలను తీసుకెళ్ల వాహ‌నం డ్రైవ‌ర్‌గా న‌టించ‌డానికి కార్తికేయ ఒప్పుకోవ‌డ‌మే కాకుండా, ఆ పాత్ర‌లో ఒదిగిపోయిన తీరు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఎలా ఉంటుంద‌నే విష‌యాన్ని తొలి ప‌దిహేను నిమిషాల్లో ఎష్టాబ్లిష్ చేశారు. పెద్ద స‌మస్య‌కు చిన్న ప‌రిష్కారం ఉంటుంద‌ని చెప్పేలా హీరో క్యారెక్ట‌ర్‌ను ఎలివేట్ చేశారు. అలాగే త‌ల్లి ఎవ‌రితో రిలేష‌న్‌లో ఉంద‌ని కోపం పెంచుకున్న కొడుకు.. చివ‌ర‌కు త‌న కోసం, త‌న తండ్రి కోసం త‌ల్లి చేస్తున్న త్యాగాన్ని గుర్తించి ఆమెకు పెళ్లి చేయాల‌నుకోవ‌డం, అంద‌రూ జీవితాన్ని చావుతో ముగిస్తే.. తాను చావు నుంచే జీవితాన్ని చ‌ద‌వ‌డం మొద‌లు పెట్టాన‌ని ముర‌ళీశ‌ర్మ‌తో చెప్పై డైలాగ్‌, ప్రీ క్లైమాక్స్‌లో త‌ల్లి చనిపోయిన‌ప్పుడు కార్తికేయ న‌ట‌న ఆక‌ట్టుకుంది. ఇది వ‌ర‌కు చిత్రాల‌కు భిన్నంగా కార్తికేయ న‌టించిన సినిమా చావుక‌బురు చ‌ల్ల‌గా అని చెప్ప‌డంలో సందేహం లేదు. లావ‌ణ్య త్రిపాఠి పాత్ర‌, ఆ పాత్ర వెనుక నేప‌థ్యం కాస్త డిఫ‌రెంట్‌గా ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. అలాగే ముర‌ళీ శ‌ర్మ ఎప్ప‌టిలాగానే కుటుంబ పెద్ద పాత్ర‌లో కనిపించాడు. త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇక సినిమాలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే పాత్ర ఆమ‌ని. గంగ‌మ్మ పాత్ర‌లో ఆమ‌ని న‌ట‌న అల‌రిస్తుంది. తెలియ‌ని సంఘ‌ర్ష‌ణ‌కు గుర‌య్యే పాత్ర‌కు ఆమ‌ని న్యాయం చేసింది. 


ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి మ‌నిషి పుట్టుకు, చావు అనే అంశాల చుట్టూ రాసుకున్న క‌థ‌. ఓ ర‌కంగా చెప్పాలంటే కాస్త బ‌రువైన క‌థే. అయితే దాన్ని ఎంట‌ర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. ఈఎంట‌ర్‌టైన్‌మెంట్ పెద్ద‌గా న‌వ్వించ‌లేదు. 



ఈ ప్ర‌య‌త్నంలో ఫ‌స్టాఫ్ విషయానికి వ‌స్తే హీరో, హీరోయిన్‌ను ఇష్ట‌ప‌డిన త‌ర్వాత ఆమె ఇంటికి వెళ్ల‌డం.. హీరో త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో ఇబ్బంది పెడుతున్నా కూడా హీరోయిన్ కుటుంబ స‌భ్యులు ఏమీ అన‌క‌పోవ‌డం.. అలాగే హీరో, హీరోయిన్ మ‌ధ్య ప్ర‌థ‌మార్థంలో వ‌చ్చే స‌న్నివేశాలు, సంభాష‌ణ‌లు బోరింగ్‌గా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో ఎమోష‌న‌ల్ యాంగిల్‌లో సినిమా ర‌న్ అవుతుంది. అయితే హీరో, మురళీశర్మ మధ్య నడిచే డిస్కషన్ సీన్‌ను ఇది వ‌ర‌కు చాలా సినిమాల్లో చూశాం. ద‌ర్శ‌కుడు మ‌రోసారి అలాంటి ఎండింగ్‌నే ఇచ్చాడు. 


జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన పాటల్లో ఫ‌స్ట్ సాంగ్ బావుంది. మిగిలిన పాట‌ల‌న్నీ అంత‌గా ఆక‌ట్టుకోవు. నేప‌థ్య సంగీతం బావుంది. ఇక హీరోకి, ముర‌ళీశ‌ర్మ‌కు మ‌ధ్య జరిగే ఎమోష‌న‌ల్ కాన్వ‌ర్‌జేష‌న్ కామ‌న్‌గా చాలా సినిమాల్లో చూసినా, డైలాగ్స్ ప‌రంగా ఆక‌ట్టుకుంటాయి. క‌ర‌మ్ చావ్లా, సునీల్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ బావుంది. 


చివరగా... హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ.. హీరోయిన్ కుటుంబం అభ్యంతరం చెప్పడం.. చివర్లో హీరో ఎమోషనల్ డైలాగ్స్ చెప్పి ఒప్పించడం అనే పాయింట్స్ రొటీన్‌గానే అనిపిస్తుంది. అయితే గ‌త చిత్రాల‌కు భిన్నంగా కార్తికేయ క్యారెక్ట‌ర్‌, న‌ట‌న‌, కొన్ని ఎమోష‌నల్ డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి

Updated Date - 2021-03-19T19:49:47+05:30 IST