శీలాన్ని కాపాడుకునే పోరాటమే ‘క్యాలీఫ్లవర్‌’

‘‘సినిమాలో హీరోగా నేను ఎంత అతి చేసినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే దర్శకులు నా కోసం కథలు రాస్తున్నారు. ప్రేక్షకులకు కూడా నచ్చుతోంది. వాళ్లని రెండున్నర గంటలు ఎంటర్టైన్‌చేయడం నాకు చాలా ఇష్టం’’ అని హీరో సంపూర్ణేష్‌బాబు అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్‌’ ఈ శుక్ర వారం థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంపూర్ణేష్‌బాబు సినిమా విశేషాలను పంచుకున్నారు. 


ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చే శాను. పెద్దాయన పాత్రకు ఆండీఫ్లవర్‌, యువకుడి పాత్రకు క్యాలీఫ్లవర్‌ అని పేరు పెట్టారు. శీలం అనేది ఆడవాళ్లకే కాదు మగవాళ్లకు కూడా ముఖ్యం. పురుషులు కూడా తమ శీలాన్ని కాపాడుకుంటే ఎలాంటి  సమస్యలు ఉండవు అనే పాయింట్‌ను దర్శకుడు ఆర్‌కే వినోదాత్మకంగా చెప్పారు. ఆయన గతంలో సీరియల్స్‌కు దర్శకత్వం వహించారు. క్యాలీఫ్లవర్‌ పాత్రకు సంపూర్ణేష్‌బాబు అయితే న్యాయం చేస్తాడని నా దగ్గరకు వచ్చారు. 


హీరో వంశంలో అబ్బాయిలు 35 ఏళ్లు వచ్చేదాకా పెళ్లి చేసుకోకూడదనే విచిత్ర నియమం ఉంటుంది. అప్పటిదాకా పవిత్రంగా ఉండాలి, అమ్మాయిలకు దూరంగా ఉండాలి అనే పాయింట్‌తో కథను ఆసక్తికరంగా అల్లుకున్నారు. ఈ సినిమాలో నాకు కొత్త గెటప్స్‌ బాగా సెట్‌ అయ్యాయి. గత చిత్రాలకు భిన్నంగా నా పాత్ర ఉంటుంది. శీలాన్ని కాపాడుకోవడానికి హీరో చేసే పోరాటం కడుపుబ్బా నవ్విస్తుంది. కోర్ట్‌ సన్నివేశాల్లో చెప్పే భారీ డైలాగ్‌లు ప్రేక్షకులకు కితకితలు పెడతాయి.


హీరో రేప్‌కి గురవ్వడం, ఆ నేపథ్యంలో వచ్చే పాటలు కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రస్తుతం హీరోగా నాలుగు సినిమాలు చేస్తున్నాను. ఒక తమిళ చిత్రం కూడా చేస్తున్నాను.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.