మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత వరుసగా ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’, బాబీ దర్శకత్వంలోని చిత్రాల్ని ఒకేసారి పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూడు చిత్రాలూ సెట్స్ పై ఉన్నాయి. వీటిలో బాబీ దర్శకత్వంలోని చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనేది వర్కింగ్ టైటిల్ గా చెలామణి అవుతోంది. ఈ టైటిల్ ను మార్చబోతున్నారనే వార్తలు వినిస్తున్నాయి. ఇక ఇందులో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నాడనే వార్తలొస్తున్నాయి. చిరుకి తమ్ముడిగా ఫుల్ లెంత్ రోలే చేయబోతున్నాడని తెలుస్తోంది. శని, ఆదివారాలు ఈ సినిమా షూటింగ్ అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఇందులో రవితేజ జోడీగా కేథరిన్ ట్రెస్సా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి, రవితేజ, కేథరిన్ లపై కీలక దృశ్యాల చిత్రీకరణ జరుగుతోందట.
కేథరిన్ ఆఖరుగా విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ‘బింబిసార’, శ్రీవిష్ణు ‘భళాతందానాన’, నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తోంది కేథరిన్. ‘ఇద్దరమ్మాయిలతో, సరైనోడు’ చిత్రాల్లో బన్నీ సరసన కథానాయికగా నటించి మెప్పించిన కేథరిన్.. ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్ చిత్రంలో నటిస్తుండడం విశేషాన్ని సంతరించుకుంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని మైత్రీమూవీస్ వారు నిర్మిస్తుండగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా కేథరిన్ కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.