Captain Review: ఈ ‘కెప్టెన్’ని భరించడం కష్టం

ABN , First Publish Date - 2022-09-08T22:49:08+05:30 IST

తమిళ్ నటుడు ఆర్య తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. అతని సినిమాలు చాలా తెలుగులో వచ్చాయి, అలాగే అతను అప్పుడెప్పుడో వచ్చిన అల్లు అర్జున్ సినిమా ‘వరుడు’లో..

Captain Review: ఈ ‘కెప్టెన్’ని భరించడం కష్టం

సినిమా: ‘కెప్టెన్’

విడుదల తేదీ: 08 సెప్టెంబర్, 2022 

నటీనటులు: ఆర్య, ఐశ్వర్య లక్ష్మి, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి తదితరులు 

సంగీతం: డి ఇమ్మాన్ 

ఎడిటింగ్: ప్రదీప్ ఇ. రాఘవ్

సినిమాటోగ్రఫీ: ఎస్. యువ

సమర్పణ: సుధాకర్ రెడ్డి

నిర్మాణం: థింక్ స్టూడియోస్, ది స్నో పీపుల్

రచన-దర్శకత్వం: శక్తి సౌందర్ రాజన్


-సురేష్ కవిరాయని 


తమిళ్ నటుడు ఆర్య తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. అతని సినిమాలు చాలా తెలుగులో వచ్చాయి, అలాగే అతను అప్పుడెప్పుడో వచ్చిన అల్లు అర్జున్ సినిమా ‘వరుడు’లో విలన్‌గా నటించాడు. ఇప్పుడు ‘కెప్టెన్’ అనే సైన్స్ ఫిక్షన్ సినిమాతో మనముందుకు వచ్చాడు. ఒకప్పటి కథానాయిక సిమ్రాన్ ఇందులో ఒక ప్రధాన పాత్రలో కనపడతారు.


కథ:

విజయ్ (ఆర్య) ఒక అనాథ, మిలిటరీలో కెప్టెన్‌గా పని చేస్తుంటాడు. తన టీమ్‌లోని ఐదుగురే తన కుటుంబమని, వారిని కంటికి రెప్పలా కాచుకుంటాడు. అనుకొని, వాళ్ళకి ఎటువంటి ఆపదా రాకుండా చూసుకుంటూ ఉంటాడు. కష్టమయిన మిలిటరీ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేస్తూ.. విజయ్ టీమ్ మంచి పేరు తెచ్చుకుంటుంది. ఒక అడవిలో సెక్టర్ 42 అనే ప్రాంతంలో ఎవరూ అడుగుపెట్టలేని స్థితి. అటువంటి దుర్భేద్యమైన చోటికి ఎన్నిసార్లు సైనికులు వెళ్లినా అనుమానాస్పదంగా చనిపోతూ వుంటారు. విజయ్ బృందాన్ని అక్కడికి పంపాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వీళ్ళకి డాక్టర్ కీర్తి (సిమ్రన్) సహాయంగా వస్తుంది. ఆ అడవిలో ఏవో విచిత్ర జంతువులు వున్నాయని చెపుతుందామె. విజయ్ టీమ్ ఆ కారడవిలో ఏమి కనుక్కుంటారు? అక్కడేమి జరుగుతుంది? ఎందుకా ప్రదేశంలోకి అడుగు పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి– వంటి ప్రశ్నలకి సమాధానం సినిమా చూసి తెలుసుకోవల్సిందే. 


విశ్లేషణ:

దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ తమిళ్ సినిమాలో ఒక కొత్త కాన్సెప్ట్‌తో ఎప్పుడూ వస్తూ ఉంటాడు. ఇంతకు ముందు, ఒక యానిమేషన్ సినిమా, అలాగే ఇంకో సినిమాలో ఒక టెడ్డి బేర్‌ని ప్రధాన పాత్రలో, అలాగే అతను తీసిన అయిదు సినిమాలు విభిన్నమైన కథలతో, ఎక్కువగా హాలీవుడ్ సినిమాల స్పూర్తితో వైవిధ్యంగా తీశాడు. ఇప్పుడు ఈ ‘కెప్టెన్’ అనే సినిమా కూడా హాలీవుడ్ సినిమా ‘ప్రెడేటర్’ స్ఫూర్తితో తీసినట్టు అనిపిస్తోంది. ఆ ఇంగ్లీష్ మూవీలో ఆర్నాల్డ్ తన మిలిటరీ టీమ్‌తో అడవిలో వున్న ఒక వింత జంతువుతో పోరాడతాడు. అది 1987లో వచ్చిన ఒక అద్భుత చిత్రం. అప్పట్లోనే అది పెద్ద విజయం సాధించడమే కాకుండా, హాలీవుడ్‌లో ఒక ఐకానిక్ మూవీగా తనదైన ముద్ర వేసింది. అటువంటి సినిమా స్ఫూర్తి పొంది శక్తి సౌందర్ రాజన్ ఈ ‘కెప్టెన్’ సినిమా తీశాడు. అయితే ఈ కథలో లాజిక్ తప్పిపోయింది. అలాగే గ్రాఫిక్స్ అస్సలు బాగోలేవు, నమ్మబుద్ధిగా ఎక్కడా తీయలేదు. ఒక మంచి సన్నివేశం ఉండొచ్చు అని ఆశిస్తున్న సమయంలో దర్శకుడు నీరుగార్చారు. దర్శకుడు కథని తెరకెక్కించడంలో సరిగా సక్సెస్  కాలేదు. ఇదివరకు తీసిన సినిమాల వల్ల ఆ దర్శకుడి మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు దెబ్బతిన్నాయనే చెప్పాలి. మనిషి వెర్సస్ వింత మృగం అనే కథ ఎంచుకున్నప్పుడు, గ్రాఫిక్స్ గొప్పగా ఉండాలి. కానీ, గ్రాఫిక్స్‌కి తోడు కథ కూడా బలహీనంగా ఉండటంతో ఈ సినిమా ఆసక్తికరంగా లేదు.


నటీనటులు:

ఒక మిలిటరీ కెప్టెన్‌లో కనబడాల్సిన చురుకుదనం ఆర్యలో కనబడలేదు.. మిలిటరీ అనగానే చాలా యాక్టివ్‌గా ఉండాలి, కానీ అతనిలో అది లోపించింది. సిమ్రన్ శాస్త్రవేత్తగా పరవాలేదు అనిపించింది. మిగతా మిలిటరీ పాత్రల్లో వేసిన వాళ్ళు బాగానే చేశారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా వేసింది, కానీ ఆమెకి అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. ఏమి జరగబోతోందో అంతా ముందే తెలిసిపోతూ ఉంటుంది. ఇందులో తెలుగు నటీనటులు ఒక్కరూ లేరు. డబ్బింగ్ సినిమాల హవా నడుస్తుందని ఈ కెప్టెన్ సినిమాని కూడా డబ్బింగ్ చేసి వదిలారు అన్నట్టు ఉంది. ఈ మొక్కుబడి తంతు వల్లే డైలాగ్స్ ప్రేక్షకులకి అంతగా ఎక్కవు; లిప్ సింక్ సరిగ్గా లేదు. 


మొత్తం మీద ఈ కెప్టెన్ సినిమా దాని మాతృక అయిన హాలీవుడ్ సినిమాలో ఒక్క శాతం వంతు బాగా తీసినా బాగుండేది. కాబట్టి ప్రేక్షకులకి డబ్బు, టైమూ రెండూ వృథానే.


ట్యాగ్‌లైన్: ఈ ‘కెప్టెన్‌’ని భరించడం కష్టం

Updated Date - 2022-09-08T22:49:08+05:30 IST