విడుదలైన కొద్ది రోజులకే సినిమాలు ఓటీటీలో రావడం థియేటర్ వ్యవస్థకే కాదు పెద్ద హీరోలకు తీరని నష్టమని నిర్మాత బన్నీ వాసు (Bunny vasu )అన్నారు. థియేటర్లలో విడుదలైన సినిమాలు వెంటనే ఓటీటీలో దర్శనం ఇవ్వడం గురించి ఆయన మాట్లాడారు. గోపీచంద్ హీరోగా ఆయన నిర్మించిన ‘పక్కా కమర్షియల్’ చిత్రం ప్రెస్ మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విడుదలైన 50 రోజుల వరకూ సినిమాను ఓటీటీకి ఇవ్వకూడదనే ఆలోచనలో నిర్మాతలున్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘భారీ చిత్రాలు వెంటనే ఓటీటీలో విడుదల కావడం వల్ల హీరోల క్రేజ్ తగ్గే అవకాశం ఉంది. ఇటీవల సినిమా విడుదల విషయంలో ఓ అగ్ర హీరో నిర్మాతతో ఒప్పందం కుదుర్చుకుని, అనుమతి లేకుండా 50 రోజుల వరకు ఓటీటీలకు ఇవ్వకూడదని సూచించినట్లు ఆయన చెప్పారు. పరాజయం పాలైన సినిమానుత్వరగా ఓటీటీకి ఇవ్వడం వల్ల ఎదురుగా లాభం కనిపించవచ్చు. కానీ అది భవిష్యత్తులో థియేటర్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సమస్యలపై చర్చించడానికి నిర్మాతలంతా బుధవారం సమావేశం కానున్నారని తెలిపారు. (Bunny vasu about ott)
‘‘కరోనా తర్వాత సినిమా పబ్లిసిటీ ఖర్చులు పెరిగాయి. కలెక్షన్లు తగ్గాయి. ఎంత పెద్ద సినిమా విడుదలైనా 30–40 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుందిలే అప్పుడు చూద్దాం అన్న పరిస్థితి ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. ఆ స్థితి వస్తే ఎవ్వరూ ఏం చేయలేం. ప్రస్తుతం ఆన్‌లైన్ టికెటింగ్ సమస్యపై డిస్ర్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ఎన్నో సందేహాలున్నాయి. దీనికోసం చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఓ సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందనిపిస్తోంది. థియేటర్లలో విడుదలైన సినిమాలను ఎన్ని రోజులకు ఓటీటీకి ఇవ్వాలనే విషయంపై ఎంతో పరిశోధన జరుగుతోంది. అన్నింటికి పరిష్కారం దొరుకుతుంది’’ అని బన్నీవాస్ చెప్పారు. (Pakka commercial)