బాలీవుడ్‌కు బాయ్‌కాట్ ఎఫ్‌క్ట్!

ABN , First Publish Date - 2021-09-19T06:49:55+05:30 IST

ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా అసెంబ్లీ, పార్లమెంట్‌ సమావేశాలను కొన్ని రోజులు ప్రతిపక్షాలు బాయ్‌కాట్‌ చేస్తుంటాయి.

బాలీవుడ్‌కు బాయ్‌కాట్ ఎఫ్‌క్ట్!

  • బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు సోషల్‌ మీడియాలో బాయ్‌కాట్‌ సెగ తగులుతోంది.
  • ప్రేక్షకులు వర్గాలుగా విడిపోయి సినిమా చూడాలో వద్దో ఈ బాయ్‌కాట్‌ గ్యాంగులు డిసైడ్‌ చేస్తున్నాయి.
  • ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచే డిస్‌లైక్‌లతో దర్శక నిర్మాతలకు చెమటలు పట్టిస్తున్నాయి.
  • బాయ్‌కాట్‌ దెబ్బకు సినిమా టైటిల్స్‌ మారిపోతున్నాయి. కొన్ని సన్నివేశాలను ఎడిట్‌ చేయాల్సి వస్తోంది.
  • ఫలానా పాత్రకు ఫలానా నటులనే తీసుకోవాలంటూ దర్శక నిర్మాతల మీద ఒత్తిడి తెచ్చి అనుకున్నది సాధిస్తున్నారు. సోషల్‌ మీడియాలో బాయ్‌కాట్‌ గ్యాంగుల దెబ్బకు దర్శక నిర్మాతలు బెదురుతున్నారు. 


ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా అసెంబ్లీ, పార్లమెంట్‌ సమావేశాలను కొన్ని రోజులు ప్రతిపక్షాలు బాయ్‌కాట్‌ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు సోషల్‌ మీడియా కాలంలో ఇది కొత్త రూపుతీసుకుంది. తమకు నచ్చని సినిమాలు, నటీనటులను సోషల్‌ మీడియా సాక్షిగా నెటిజన్లు బాయ్‌కాట్‌ చేస్తున్నారు. బాయ్‌కాట్‌ హ్యాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాల్లో దుమ్ము రేపుతున్నారు. నేషనల్‌ వైడ్‌గా ట్రెండింగ్‌ చేస్తున్నారు. వారానికి ఒకసారి చెప్పుకోదగ్గ స్థాయిలో ఏదో ఒక సినిమా, నటీనటులు, వెబ్‌సిరీ్‌సలపై ఈ బాయ్‌కాట్‌ ట్రెండింగ్‌ నడుస్తూ చిత్ర పరిశ్రమకు ముచ్చెమటలు పట్టిస్తోంది.  


సుశాంత్‌ అభిమానుల ట్రెండింగ్‌ 

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం నుంచి ముఖ్యంగా బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో స్టార్‌కిడ్స్‌ నటించిన చిత్రాలు విడుదలైన ప్రతిసారీ బాయ్‌కాట్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఆ తర్వాత విడుదలైన పలు పెద్ద చిత్రాలకు రికార్డ్‌ స్థాయిలో డిస్‌లైక్స్‌తో షాక్‌ ఇచ్చారు సుశాంత్‌ ఫ్యాన్స్‌. అలియాభట్‌ నటించిన ‘సడక్‌ 2’ విషయంలో ఇలా బాయ్‌కాట్‌తో అనుకున్న ఫలితం సాధించారు. అలాగే అనన్యాపాండే నటించిన ‘ఖాలీ పీలీ’ చిత్రం విషయంలోనూ సుశాంత్‌ అభిమానులు పంతం నెగ్గించుకున్నారు. ఆ తర్వాత వారిచూపు వరుణ్‌ ధావన్‌, సారా అలీఖాన్‌ నటించిన ‘కూలీ నంబర్‌ వన్‌’పై పడింది. ఈ సినిమా ట్రైలర్‌ను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. దీంతో చిత్రబృందం లైక్స్‌, డిస్‌లైక్స్‌ కనిపించకుండా జాగ్రత్తపడింది. అయితే వ్యూస్‌ మాత్రం భారీగానే వచ్చాయి. అక్షయ్‌కుమార్‌ నటించిన ‘లక్ష్మి’ చిత్రంలో ముస్లిం అబ్బాయి, హిందూ అమ్మాయిని ప్రేమించడంపై లవ్‌ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నారని కొందరు అభ్యంతరాలు లేవనెత్తారు. సినిమాను బాయ్‌కాట్‌ చేయాలని ట్రెండింగ్‌ చేశారు. దాంతో ఎందుకొచ్చిన గొడవని ట్రైలర్‌లో లైక్స్‌, డిస్‌లైక్స్‌ కనిపించకుండా హైడ్‌ చేశారు. 


ఓటీటీ నిషేధం కోసం...

ఓటీటీలకు గతంలో సెన్సార్‌ లేకపోవడం వల్ల కొన్ని వెబ్‌సిరీ్‌సలు మితిమీరిన అశ్లీల దృశ్యాలను ప్రసారం చేశాయి. ఇషాన్‌ కట్టర్‌, టబు ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎ సూటబుల్‌ బాయ్‌’ వెబ్‌సిరీ్‌సపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. హీరోయిన్‌ తన ముస్లిం ప్రియుడితో గుడిలో రొమాన్స్‌ చేస్తున్న దృశ్యాలపై పలు హిందూ సంస్థలు అభ్యంతరాలు తెలిపాయి. దీంతో ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ను తొలగించాలంటూ ‘బాయ్‌కాట్‌ నెట్‌ఫ్లిక్స్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండింగ్‌ చేశారు.


బాయ్‌కాట్‌ బెబో 

‘బాహుబలి’ రచయిత విజయేంద్రప్రసాద్‌ కథను అందిస్తున్న మరో పాన్‌ ఇండియా చిత్రం ‘సీత: ద ఇన్‌కార్నేషన్‌’. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీతమ్మ వారి పాత్ర కోసం మేకర్స్‌ తొలుత బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ని సంప్రదించారు. అయితే అడిగినంత పారితోషికం ఇస్తేనే సినిమా చేస్తానని ఆమె చెప్పారనే వార్తలు బయటకొచ్చాయి. దీంతో నెటిజన్లు కరీనాపై మండిపడ్డారు. ‘బాయ్‌కాట్‌ కరీనా’ పేరుతో ట్విట్టర్లో ట్రెండింగ్‌ మొదలుపెట్టారు. ‘కరీనా సీతమ్మ పాత్రను చేసేందుకు అంగీకరించబోం’ అని హెచ్చరించారు. ఆ సందర్భంలో కొందరు నెటిజన్లు కరీనా కన్నా కంగనా రనౌత్‌ అయితే బాగుంటారు, సీత పాత్రలో ఒదిగిపోతారు కాబట్టి ఆమెనే నటింపచేయాలని సూచించారు. కాదని ముందుకెళితే దర్శక నిర్మాతలను కూడా బ్యాన్‌ చేయాల్సివస్తుందని హెచ్చరించారు. చివరకు కంగనను సీత పాత్రకు తీసుకోవడంలో బాయ్‌కాట్‌ కరీనా ట్రెండింగ్‌ ప్రభావం కూడా కొంత పనిచేసిందనే చెప్పాలి. 


ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా కరీనా కపూర్‌ పలు సందర్భాల్లో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. భారతదేశంపై దండెత్తిన తైమూర్‌, జహంగీర్‌ పేర్లు తన పిల్లలకు పెట్టడంతో ఆమె నెటిజన్ల టార్గెట్‌కు గురయ్యారు. ఇక కరీనా భర్త, నటుడు సైఫ్‌ అలీఖాన్‌కూ బాయ్‌కాట్‌ సెగ తప్పలేదు. ఆయన నటించిన ‘తాండవ్‌’ వెబ్‌సిరీస్‌ హిందూ దేవతలను కించపరిచేలా ఉందంటూ ‘బ్యాన్‌ తాండవ్‌, బాయ్‌కాట్‌ సైఫ్‌’ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ చేశారు. 


సోనూసూద్‌కూ తప్పలేదు

సేవాకార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందిన సోనూసూద్‌ కూడా ఓ సందర్భంలో సోషల్‌ మీడియాలో బాయ్‌కాట్‌కు గురయ్యారు. మహా శివరాత్రి సందర్భంలో సోనూసూద్‌ చేసిన ట్వీట్‌ వివాదాస్పదమైంది. ‘ఇతర పండుగలప్పుడు ఇలా ఎందుకు చెప్పవు’ అంటూ ఆయన్ను నెగిటివ్‌గా ట్రెండ్‌ చేశారు. ‘హూ ద హెల్‌ ఆర్‌ యూ సోనూసూద్‌’ హ్యాష్‌టాగ్‌తో ఆయనపై విరుచుకుపడ్డారు. 


సీఏఏకు వ్యతిరేకమా...

సీఏఏ నిరసనలకు మద్దతు తెలిపినందుకు నిరసనగా అలీఫైజల్‌ నటించిన ‘మీర్జాపూర్‌’ వెబ్‌సిరీ్‌సను బాయ్‌కాట్‌ చేయాలంటూ ట్రెండింగ్‌ చేశారు. అలాగే ఫర్హాన్‌ అక్తర్‌ సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ ఆయన నటించిన ‘తుపాన్‌’ చిత్రం సమయంలోనూ సినిమాను బ్యాన్‌ చేయాలంటూ పెద్దఎత్తున సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేశారు. హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయిని ప్రేమించే సన్నివేశాలు ఉండడంతో లవ్‌ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ మరో క్యాంపెయిన్‌ నడిపారు. ‘రాధే’ చిత్రం ట్రైలర్‌ విడుదలైనప్పుడు సల్మాన్‌పై నెటిజన్లు దండెత్తారు. ‘రాధే’ను బ్యాన్‌ చేయాలంటూ ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున ట్రెండింగ్‌ చేశారు.


దక్షిణాదిన ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌తో...

‘ద ఫ్యామిలీ మ్యాన్‌’ సిరీ్‌సతో కోలీవుడ్‌లో బాయ్‌కాట్‌ సెగను ఎదుర్కొన్నారు సమంత. అందులో తమిళులను తీవ్రవాదులుగా చూపుతూ కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని నెటిజన్లు అభ్యంతరం తెలిపారు. సిరీస్‌ను బ్యాన్‌ చేయాలంటూ తమిళనాట ట్రెండింగ్‌ చేశారు. ఈ సెగ సినిమాలు, నటీనటులకు మాత్రమే పరిమితం కాలేదు. సృజనాత్మక రంగంగా పేరుగాంచిన వాణిజ్య ప్రకటనల రూపకల్పన పైనా బాయ్‌కాట్‌ ట్రెండ్‌ ప్రభావం చూపింది. బంగారు ఆభరణాల సంస్థ ‘తని్‌ష్క’ రూపొందించిన ఓ టీవీ ప్రకటనలో ముస్లిం కుటుంబం తమ హిందూ కోడలికి సీమంతం చేయడంపై పలు అభ్యంతరాలు తలెత్తాయి. అదే పనిగా ‘బాయ్‌కాట్‌ తని్‌ష్క’ను వైరల్‌ చేశారు. దాంతో ఆ ప్రకటనను తనిష్క్‌ సంస్థ వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. దీపావళి సమయంలో విడుదలచేసిన ప్రకటనపైన కూడా నెటిజన్లు ‘బాయ్‌కాట్‌ తనిష్క్‌’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సంస్థ ఆ ప్రకటనను విరమించుకుంది.

Updated Date - 2021-09-19T06:49:55+05:30 IST