‘బాహుబలి’ కంటే భారీ సినిమాను రూపొందిస్తాను: కమల్ ఆర్. ఖాన్

ABN , First Publish Date - 2022-04-19T02:22:01+05:30 IST

బాలీవుడ్ ఇండస్ట్రీని ఎప్పుడు విమర్శిస్తూ వార్తల్లో నిలిచే వ్యక్తి కమల్. ఆర్.ఖాన్(కేఆర్‌కే). బీ టౌన్ సెలబ్రిటీలపై ఎప్పుడు విమర్శల వర్షం కురిపిస్తుంటాడు.

‘బాహుబలి’ కంటే భారీ సినిమాను రూపొందిస్తాను: కమల్ ఆర్. ఖాన్

బాలీవుడ్ ఇండస్ట్రీని ఎప్పుడు విమర్శిస్తూ వార్తల్లో నిలిచే వ్యక్తి కమల్. ఆర్.ఖాన్(కేఆర్‌కే). బీ టౌన్ సెలబ్రిటీలపై ఎప్పుడు విమర్శల వర్షం కురిపిస్తుంటాడు. గతంలో అతడు ‘దేశ్‌ద్రోహీ’ అనే సినిమాలో నటించాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్‌ను ‘దేశ్‌ద్రోహీ-2’ పేరుతో తెరకెక్కిస్తానంటున్నాడు. ఆ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘బాహుబలి’ కంటే భారీ స్థాయిలో ఈ చిత్రం ఉంటుందని స్పష్టం చేశాడు. త్వరలోనే మూవీని పట్టాలెక్కిస్తానని పేర్కొన్నాడు. 


కమల్ ఆర్. ఖాన్ ‘దేశ్‌ద్రోహీ-2’ పోస్టర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఓ మెసేజ్‌ను కూడా రాశాడు. ‘‘బ్లాక్ బ్లాస్టర్ సినిమాను ఏవిధంగా రూపొందించాలో బాలీవుడ్‌కు చూపిస్తాను. ఈ ప్రాజెక్టులో నేను టైటిల్ రోల్ పోషిస్తాను. దర్శకత్వం కూడా వహిస్తాను. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అని కేఆర్‌కే స్పష్టం చేశాడు. గతంలో కేఆర్‌కే నటించిన ‘దేశ్ ద్రోహీ’ సినిమాకు జగదీష్ శర్మ దర్శకత్వం వహించాడు. కేఆర్‌కే నిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రం మహారాష్ట్రలో తప్ప దేశ వ్యాప్తంగా 2008, నవంబర్ 14న విడుదలైంది. బాంబే సినిమా రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ చిత్రాన్ని నిషేధించింది. అనంతరం నిర్మాతలు బాంబే హైకోర్టు మెట్లెక్కి సినిమా విడుదలకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. దీంతో ఈ మూవీ మహారాష్ట్రలో 2009, జనవరి 23న విడుదలైంది. ముంబైలో వలసదారులు ఎదుర్కోనే సమస్యలను ఈ సినిమాలో చూపించారు.



Updated Date - 2022-04-19T02:22:01+05:30 IST