కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు అజిత్ కుమార్ (Ajith Kumar). దక్షిణాదిలోనే అత్యధికంగా పారితోషికం తీసుకుంటుంటారు. చివరగా ‘వలీమై’ సినిమాలో నటించారు. ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి బంపర్ హిట్‌గా నిలిచింది. అజిత్ ప్రస్తుతం హెచ్. వినోద్ (H.Vinoth) దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికీ వర్కింగ్ టైటిల్‌గా ‘ఏకే-61’ అని పెట్టారు. ‘ఏకే-61’ కు బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకీ సంబంధించిన క్రేజీ అప్డేట్ కోలీవుడ్‌లో షికార్లు కొడుతుంది. ‘ఏకే-61’ లో బాలీవుడ్ స్టార్ హీరో కీలక పాత్రలో నటించనున్నాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
బాలీవుడ్ వెటరన్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt) ఈ సినిమాలో నటించనున్నాడట. సంజయ్ ఈ చిత్రంలో విలన్‌గా నటించనున్నాడా లేదా కీలక పాత్రలో కనిపించనున్నాడా అనేది మాత్రం తెలియడం లేదు. సంజు బాబాకు సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే చిత్ర బృందం విడుదల చేయనుందని సమాచారం. ‘ఏకే-61’ షూటింగ్ ఆగస్టు చివరి వారంలో తిరిగి ప్రారంభం కానుంది. చివరగా సంజయ్ దత్ ‘కెజియఫ్-2’లో విలన్‌గా నటించాడు. ఈ చిత్రంలో అధీరాగా కనిపించి అభిమానులను అలరించాడు. ‘ఏకే-61’లో మంజువారియర్ (Manju Warrier) హీరోయిన్గా నటిస్తుంది. సముద్ర ఖని, వీర, అజయ్, జీఎం. సుందర్, శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.