విభిన్నమైన పాత్రలు, విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ( Nawazuddin Siddiqui). ‘సీరియస్ మెన్’ (Serious Men) సినిమాలో నటించి ప్రపంచవ్యాప్తంగా ఫేమ్‌ను సంపాదించుకున్నాడు. ఎమ్మీ అవార్డ్(Emmy Award)కు కూడా నామినేట్ అయ్యాడు. పర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలు పోషిస్తూ భారత్‌కు పేరు, ప్రఖ్యాతలు తీసుకువస్తున్నాడు. తాజాగా అతడు నటించిన మరో సినిమా ఫిల్మ్ ఫెస్టివల్‌కు సెలక్ట్ అయింది.
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన ‘నో ల్యాండ్స్ మ్యాన్’(No land’s man) సిడ్నీ ఫిలిం ఫెస్టివల్(Sydney Film Festival)కు సెలక్ట్ అయింది. ఈ విషయాన్ని సిద్దిఖీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘‘నా మనసుకు దగ్గరైన ‘నో ల్యాండ్స్ మ్యాన్’ ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు చూస్తున్నారు. ఈ చిత్రం సిడ్నీ ఫిలిం ఫెస్టివల్ కు అధికారికంగా సెలక్ట్ అయింది’’ అని నవాజుద్దీన్ సిద్దిఖీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ‘నో ల్యాండ్స్ మ్యాన్’ ను బంగ్లాదేశీ ఫిల్మ్ మేకర్- రైటర్ ముస్తాఫా సర్వర్ ఫరూకీ (Mostofa Sarwar Farooki) తెరకెక్కించాడు. అస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్. రెహమాన్ (A R Rahman) సంగీతం అందించాడు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియాలో ఈ సినిమా షూటింగ్ జరిపారు. దక్షిణాసియాకు చెందిన వ్యక్తి ఆస్ట్రేలియా మహిళను అమెరికాలో అనుకోకుండా కలుస్తాడు. జాత్యహంకారం, ఛాందసవాదం నేపథ్యంగా ఈ చిత్ర కథ నడుస్తుంది. గతేడాది బుసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ఏషియన్ సినిమా విభాగంలో ఈ మూవీని ప్రదర్శించారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. నవాజుద్దీన్ సిద్దిఖీ చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ‘టికు వెడ్స్ షేరు’ (Tiku Weds Sheru) సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికీ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నిర్మాతగా వ్యవహరిస్తుంది. నవాజుద్దీన్ త్వరలోనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో 9వసారి పాల్గొనబోతున్నాడు. ఆ ఫెస్టివల్‌లో ఇప్పటికే అతడు 8సార్లు సందడి చేశాడు.