South Vs Bollywood Debate: అది కరెక్టు కాదంటున్న యంగ్ హీరో

ABN , First Publish Date - 2022-05-25T17:08:53+05:30 IST

‘విక్కీ డోనర్’ అనే డిఫరెంట్ కథతో బాలీవుడ్‌కి పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించిన నటుడు ఆయుష్మాన్ ఖురానా...

South Vs Bollywood Debate: అది కరెక్టు కాదంటున్న యంగ్ హీరో

‘విక్కీ డోనర్’ అనే డిఫరెంట్ కథతో బాలీవుడ్‌కి పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించిన నటుడు ఆయుష్మాన్ ఖురానా. అనంతరం కూడా అలాంటి ప్రత్యేక కథలనే ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. అందుకే ఈ యువ నటుడికి బాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ నటుడు తాజాగా నటించిన చిత్రం ‘అనేక్’. త్వరలో విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌లో మూవీ టీం  బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఇంటర్వ్యూలో దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారిన దక్షిణాది, ఉత్తరాది సినిమాల డిబేట్‌పై ఆయుష్మాన్ స్పందించాడు.


ఆయుష్మాన్ మాట్లాడుతూ.. ‘ఈ తరం ప్రేక్షకులకి సినిమాలపై అపారమైన అవగాహన ఉంది. వినోదానికి, భాషకి సంబంధం లేదు. ప్రతి కంటెంట్ గురించి దేశవ్యాప్తంగా సినీ లవర్స్‌కి తెలుసు. భాష అనే అడ్డంకిని దాటి మరి వారు సినిమాలను ఎంకరేజ్ చేస్తారు. భారతీయ సినిమాలనే కాదు. అంతర్జాతీయ కంటెంట్‌ని చూడటానికి సిద్ధంగా ఉంటున్నారు. అందుకే డాక్టర్ స్ట్రేంజ్ వంటి మార్వెల్ మూవీస్, ఇతర సూపర్ హీరో సినిమాలు మంచి ఓపెనింగ్స్‌ని సాధిస్తున్నాయి.


భాష ఏదైనా సినిమాలు బావుంటే హిందీ ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇతర భాష చిత్రాలతో పాటు సూర్యవంశీ, గుంగూభాయి కతియావాడి, ఇటీవలే విడుదలైన భుల్ భూలయ్యా 2 వంటి సినిమాలు ఇక్కడ మంచి ఆదరణ పొందాయి. అందుకే హిందీ సినిమాలు బాగా ఆడటం లేదనడం తప్పు. వినోదాన్ని పంచే కథతో వస్తే హిందీ సినిమాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతాయి. కాబట్టి ఉత్తరాది మార్కెట్‌కి సౌత్ సినిమాలు టేకోవర్ చేసుకుంటున్నాయనే ఆలోచన తప్పు’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-05-25T17:08:53+05:30 IST