సినిమా రివ్యూ: ‘బింబిసార’ (Bimbisara Review)

ABN , First Publish Date - 2022-08-05T23:18:28+05:30 IST

రెండేళ్ల విరామం తర్వాత, అంటే కోవిడ్ తరువాత, ‘బింబిసార’ (Bimbisara) అనే సోషియో ఫాంటసీ సినిమాతో వచ్చారు నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram). అంతకు ముందు ఆయన నటించిన ‘ఎంత మంచివాడవురా’ ఆశించిన ఫలితాన్ని..

సినిమా రివ్యూ: ‘బింబిసార’ (Bimbisara Review)

సినిమా: ‘బింబిసార’ (Bimbisara)

విడుదల తేదీ: 05 ఆగస్ట్, 2022

నటీనటులు: కళ్యాణ్ రామ్, క్యాథెరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్, ప్రకాశ్ రాజ్, తనికెళ్ళ భరణి, అయ్యప్ప శర్మ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు.

సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు

సంగీతం: చిరంతన్ భట్, వరికుప్పల యాదగిరి, ఎం ఎం కీరవాణి

ఎడిటింగ్: తమ్మిరాజు

నిర్మాత: హరికృష్ణ. కె

రచన-దర్శకత్వం: వశిష్ట


రెండేళ్ల విరామం తర్వాత, అంటే కోవిడ్ తరువాత, ‘బింబిసార’ (Bimbisara) అనే సోషియో ఫాంటసీ సినిమాతో వచ్చారు నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram). అంతకు ముందు ఆయన నటించిన ‘ఎంత మంచివాడవురా’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈసారి ఒక వైవిధ్యమైన కథతో రావాలని అనుకున్నారు. అందుకుగాను తానే నిర్మాణాన్ని తలకెత్తుకొని, భారీ వ్యయంతో ఈ బింబిసార తీశారాయన. సినిమా హాల్‌కి ప్రేక్షకులు రావటం కష్టమవుతున్న ఈ పోస్ట్- కోవిడ్ కాలంలో, ప్రేక్షకుల్ని సినిమా హాల్ వరకూ రప్పించడం పెను సవాలుగా మారిన ఈ రోజుల్లో కళ్యాణ్ రామ్ తన సినిమాని విడుదల చేశారు. ఇది తనకు ‘బింబిసార’ మీద ఉన్న నమ్మకానికి నిదర్శనం అని సినిమా విడుదలకి ముందే ధీమాగా చెప్పారు. అదీ కాకుండా వశిష్ట అనే కొత్త దర్శకుడి చేతికి ఇంత భారీ బడ్జెట్ సినిమా నిర్మాణ సారథ్యాన్ని అప్పగించడం కూడా సాహసమే అని చెప్పాలి. ఈ సినిమా కథాకాలం సగం మాత్రమే వర్తమానం, మిగతా సగం రాజుల కాలం. కాబట్టి, ఇటువంటి సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో వచ్చిన ‘బింబిసార’ మీద అంచనాలు ఉండటం సహజమే. అయితే ఆ అంచనాల్ని ఈ ‘బింబిసారుడు’ ఎంతవరకూ అందుకోగలిగాడో రివ్యూలో చూద్దాం. (Bimbisara Review)


కథ:

కథ చెప్పాలంటే ముందుగా ఈ సినిమా ట్యాగ్‌లైన్ గురించి చెప్పుకోవాలి. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది ఈ సినిమాకి ట్యాగ్‌లైన్. క్రీస్తు పూర్వం 500 సంవత్సరానికి చెందిన త్రిగర్తల సామ్రాజ్యానికి అధినేత బింబిసారుడు (కళ్యాణ్ రామ్) అనే రాజు. అతి క్రూరుడైన బింబిసారుడు.. తన రాజ్యంలోని ప్రజలను తన అధికారం, అహంకారం, బలగర్వంతో ఎంతో బాధిస్తూ ఉంటాడు. అతని కత్తి పడినా, కన్నుపడినా.. ఎదుటి రాజు, రాజ్యం అతనికి దాసోహమవ్వాల్సిందే. ఎదురు తిరిగిన ఎంతటి వాడైనా.. తన కత్తికి బలి కావాల్సిందే. అలాంటి క్రూరుడైన బింబిసారుడుని.. తన కవల సోదరుడు దేవదత్తుడు (కళ్యాణ్ రామ్) ఎదురిస్తాడు. దీంతో బింబిసారుడు తన సోదరుడిని చంపేందుకు ప్రయత్నించగా.. ఈ ప్రయత్నంలో బింబిసారుడిని దేవదత్తుడు ఓ మాయాదర్పణంపై విసిరేస్తాడు. ఆ మాయాదర్పణ మహత్యంతో బింబిసారుడు వర్తమాన కాలంలోకి వచ్చి పడతాడు. వర్తమాన కాలంలోకి వచ్చిన బింబిసారుడు‌కి ఎదురైన అనుభవాలు ఏంటి? ఆ అనుభవాలతో అతను మంచిగా మారాడా? మాయాదర్పణం ద్వారా విసిరివేయబడ్డ బింబిసారుడు మళ్లీ త్రిగర్తల సామ్రాజ్యానికి వెళ్లవలసిన అవసరం ఎందుకొచ్చింది? ఎలా మళ్లీ అతను ఆ కాలానికి వెళ్లాడు? త్రిగర్తల సామ్రాజ్యం చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాని చూడాల్సిందే. (Bimbisara Movie Review)


విశ్లేషణ:

ఒక సాదాసీదా కథని జనరంజకం చేయడంలోనే దర్శకుడి ప్రతిభ ఉంటుంది. ఈ ‘బింబిసార’ కథ విషయానికి వస్తే ఇది కూడా ఒక మామూలు సినిమా కథే. క్రూరుడైన రాజు తన రాజ్యంలో ప్రజలను నానా హింసలకూ గురిచేస్తాడు.  ఎన్నో ఘోర కృత్యాలు చేస్తాడు. అలాంటి రాజు – ఆధునిక సంక్షోభ సమాజంలో జీవించాల్సి వస్తుంది. ఇక్కడ  మానవత్వం అంటే ఏంటో చూస్తాడు, తాను చేసిన తప్పులను తెలుసుకుంటాడు. ఇది వినటానికి చాలా సింపుల్‌గా ఉంటుంది, కానీ దర్శకుడు వశిష్ట ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని మలిచాడు. కమర్షియల్ హంగులు అన్నీ పెట్టి ఒక సోషియో ఫాంటసీ కథని మొదటి నుండి చివరి వరకు ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా నడిపాడు. అతను ‘బింబిసార’ పాత్రని మలిచిన విధానం చాలా బాగుంది. అదీ కాకుండా రెండు భిన్నమైన కాలాలను సమన్వయంగా నడిపే తీరు కూడా బాగుంది. దర్శకుడు కొత్తవాడు అయినా ఎక్కడా రాజీ పడకుండా తీశాడు. ‘బింబిసార’తో వచ్చే సన్నివేశాలన్నీ చాలా రిచ్‌గా ఆకట్టుకునే విధంగా వున్నాయి. దీనికి తోడు పోరాట సన్నివేశాలు కూడా చాలా బాగా తీసి, ప్రేక్షకుడిలో మరింత ఉత్సుకత పెంచాడు. తన మొదటి సినిమా అయినా వశిష్ట విజయం సాధించాడనే చెప్పాలి.


ఇక నటన విషయానికి వస్తే ఈ సినిమా ఆసాంతం కళ్యాణ్ రామ్ అనే చెప్పాలి. ఇది ఆయన సినిమా కెరీర్‌లో ఒక మైలు రాయి. బింబిసార పాత్రకు ప్రాణం పోసిన కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం ఇందులో చూడొచ్చు. బింబిసార, దేవదత్త పాత్రలతో పాటు, నేటి కాలంలో మోడ్రన్ బింబిసార పాత్రలో కూడా ఆయన మమేకమైపోయారు. హావభావ ప్రదర్శనలో కానీ, డైలాగ్స్ చెప్పడంలో కానీ చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వైవిధ్యం చూపారు. ఆ కష్టానికి తగిన ఫలితం స్క్రీన్ మీద కనిపిస్తుంది. సినిమాలో కథానాయికలకి ఏమంత ప్రాధాన్యం లేదు. ఈ మధ్యకాలంలో వస్తున్న అన్ని సినిమాలలో మాదిరిగానే హీరోయిన్లు నామమాత్రంగా ఉండటం ఒక మైనస్ పాయింట్ ఈ సినిమాకి. వెన్నెల కిషోర్ పర్వాలేదన్నట్టు చేస్తే, అయ్యప్ప శర్మ కేతుగా బాగా నటించాడు. శ్రీనివాస్ రెడ్డి కొంతమేరకు నవ్విస్తాడు, అలాగే బ్రహ్మాజీ కూడా చిన్న పాత్రలో కనిపిస్తాడు. తనికెళ్ళ భరణి తన పాత్రకు న్యాయం చేశాడు. శాస్త్రిగా హిందీ నటుడు వారిన హుస్సేన్ విలన్‌గా అంత మెప్పించలేకపోయాడు. ఆ స్థానంలో తెలుగు నటుడుని పెడితే బాగుండేదేమో. జబర్దస్త్ నటులు అక్కడక్కడా కనపడుతూ వుంటారు. పాటల చిత్రీకరణ బాగుంది.


ఇవన్నీ కాకుండా, ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కీరవాణి ఒక మూల స్తంభంలా నిలిచారనే చెప్పాలి. తను కొన్ని పాటలకు మ్యూజిక్ ఇవ్వటమే కాకుండా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా గొప్పగా చేశారు. సినిమా ఆసక్తికరంగా ఉండటానికి కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక కారణం. సినిమాటోగ్రఫీ చోటా.కె. నాయుడు పనితనం స్క్రీన్ మీద చక్కగా కనపడుతుంది. ఆయన కూడా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. అలాగే ఈ సినిమాలో పోరాట దృశ్యాలు కూడా చాలా చక్కగా చిత్రీకరించారు. మొత్తానికి, బింబిసార అనే చిత్రం ఒక పైసా వసూల్ చిత్రం అని చెప్పొచ్చు. అన్నికమర్షియల్ హుంగులతో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌లో ఒక మాస్ చిత్రాన్ని చక్కగా చూపించారు. సినిమా అయితే మొత్తం కళ్యాణ్ రామ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అతనే కథని తన భుజస్కందాలపై నడిపించారు. చాలా కాలం తర్వాత ఆయనకి ఒక మంచి బ్రేక్ దొరికినట్టే. అక్కడక్కడా కొన్ని సినిమాటిక్ సీన్స్ వున్నా, రెండో సగం వీక్‌గా అనిపించినా.. ‘బింబిసార’ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగానే ఉంది. (Bimbisara Review)


ట్యాగ్‌లైన్: హీరోకే కాదు.. ఇండస్ట్రీకి కూడా ఊరట లభించినట్టే.

Updated Date - 2022-08-05T23:18:28+05:30 IST