Bigg Boss హోస్ట్‌లకు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. ఎవరెవరికి ఎంతెంతంటే..!

ABN , First Publish Date - 2021-09-25T20:30:17+05:30 IST

`బిగ్‌బాస్`.. భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న టీవీ కార్యక్రమం.

Bigg Boss హోస్ట్‌లకు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. ఎవరెవరికి ఎంతెంతంటే..!

`బిగ్‌బాస్`.. భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న టీవీ కార్యక్రమం. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం.. ఇలా అన్ని భాషల్లోనూ `బిగ్‌బాస్` తన హవా చూపిస్తున్నాడు. ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తున్నాడు. అత్యంత భారీ వ్యయంతో రూపొందే `బిగ్‌బాస్` కార్యక్రమాన్ని హోస్ట్ చేసే స్టార్లు కూడా అంతే స్థాయిలో భారీ పారితోషికాలు అందుకుంటుంటారు. తెలుగులో ఇటీవలె ఈ కార్యక్రమం ఐదో సీజన్ ప్రారంభమైంది. తెలుగు `బిగ్‌బాస్` మొదటి సీజన్‌ను యంగ్ టైగర్ ఎన్టీయార్ హోస్ట్ చేయగా.. రెండో సీజన్‌కు నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ తర్వాత `కింగ్` నాగార్జున పర్మినెంట్ హోస్ట్‌గా మారిపోయారు. 


ఇక, హిందీలో సల్మాన్ ఖాన్ `బిగ్‌బాస్` హోస్ట్‌గా అప్రతిహతంగా దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన 14 సీజన్స్‌లో 11 సీజన్స్‌ను సల్మాన్ హోస్ట్‌ చేశారు. ఇక, తమిళంలో అయితే ఆది నుంచి కమల్ హాసన్ ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే హిందీలో `బిగ్‌బాస్`-15, తమిళంలో `బిగ్‌బాస్`-5 ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో గత సీజన్లతో పోల్చుకుంటే హోస్ట్‌లందరూ తమ పారితోషికాలను భారీగా పెంచేశారట. కళ్లు చెదిరే రీతిలో రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారట. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..


 నాగార్జున


తెలుగులో `బిగ్‌బాస్` మూడో సీజన్‌ నుంచి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఐదో సీజన్ ఈ నెల 5వ తేదీన ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా చేస్తున్నందుకు నాగార్జున కళ్లు చెదిరే రీతిలో పారితోషికం అందుకుంటున్నారట. విశ్వసనీయ సమాచారం ప్రకారం `బిగ్‌బాస్`-3 సీజన్‌ను హోస్ట్ చేసినందుకు నాగార్జునకు ఒక్కో ఎపిసోడ్‌కు రూ.12 లక్షల చొప్పున నిర్వాహకులు ఇచ్చారట. నాలుగో సీజన్‌లో మొత్తం ఎపిసోడ్‌లు అన్నింటికీ కలిపి నాగ్ రూ.8 కోట్లు అందుకున్నారట. ఇక, తాజా సీజన్‌కు వచ్చేసరికి నాగ్ రెమ్యునరేషన్ అమాంతం పెరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుత సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నందకు నాగ్ మొత్తం రూ.12 కోట్లు అందుకోబోతున్నట్టు సమాచారం.


 కమల్‌హాసన్


తమిళంలో ప్రసారమయ్యే `బిగ్‌బాస్` కార్యక్రమాన్ని మొదటి నుంచీ విశ్వనటుడు కమల్‌హాసన్ హోస్ట్ చేస్తున్నారు. త్వరలో ఈ కార్యక్రమం ఐదో సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ కోసం నిర్వాహకులతో కమల్ తాజాగా అగ్రిమెంట్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్‌లో ఒక్కో ఎపిసోడ్‌కు కమల్ రూ.3 కోట్లు తీసుకోబోతున్నారట. సీజన్ మొత్తానికి కమల్ రూ.50 కోట్లను అందుకోనున్నట్టు తమిళ మీడియా వర్గాల సమాచారం. గత సీజన్‌లో కమల్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2.5 కోట్లు తీసుకున్నారట.


 సల్మాన్ ఖాన్


గత కొన్నేళ్లుగా హిందీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోకు అగ్ర హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే `బిగ్‌బాస్` సీజన్ 15 ప్రారంభం కాబోతోంది. ప్రతి సీజన్‌కు సల్మాన్ తన రెమ్యునరేషన్‌ను పెంచుకుంటూ పోతున్నారు. త్వరలో ప్రారంభమయ్యే `బిగ్‌బాస్`-15లో ఒక్కో ఎసిపోడ్‌కు సల్మాన్ రూ. 16 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన మొత్తం బిగ్‌బాస్ 15 సీజన్‌ను హోస్ట్ చేసినందుకు సల్మాన్ ఏకంగా రూ.350 కోట్లు అందుకోబోతున్నారట. ఒక సినిమా చేస్తే సల్మాన్ రూ.50 కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నారు. `బిగ్‌బాస్` ద్వారా అంతకు ఏడు రెట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. 

Updated Date - 2021-09-25T20:30:17+05:30 IST